అవగాహన కల్పిస్తున్నాం
ఏలూరు జిల్లాలో రిజిస్ట్రేషన్లు (ఎకరాల్లో)
● అప్సడా నిబంధనలకు తూట్లు
● ఏలూరు జిల్లాలో నత్తనడకన సాగుతున్న నమోదు ప్రక్రియ
● రైతులు రాయితీలు కోల్పోయే ప్రమాదం
కై కలూరు: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వారంగంలో పారదర్శకత, నాణ్యమైన ఉత్పత్తులు, జవాబుదారితనం పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టం–2020 అమలు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు పొందాలంటే అప్సడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రగతి శూన్యంగా ఉంది. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు 40,149 మంది రైతులు 1,49,604 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కేవలం 91,430 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. చట్టం ప్రకారం నమోదు చేసుకుంటేనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం, విద్యుత్ సబ్సిడీలు అందుతాయి. అయినప్పటికీ, కొందరు రైతులు, స్థానిక రైతు సంఘాలు ఈ విషయంలో చొరవ చూపడం లేదు.
జీడీపీలో టాప్.. నమోదులో లాస్ట్
రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఏలూరు జిల్లా కలిదిండి మండలం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ ఆక్వారంగం భారీగా విస్తరించినప్పటికీ, మొత్తం 30,406.3 ఎకరాలకు గాను కేవలం 11,308 ఎకరాలకే రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా 19,097.50 ఎకరాల నమోదు పెండింగ్‌లో ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తూ, సిబ్బంది కొరతను తీర్చాలని కమిషనర్‌ను కోరారు. అయితే స్థానిక చేపల రైతుల సంఘాలు అవగాహన సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు.
నమోదు ప్రక్రియలో ప్రధాన అడ్డంకులు
● ఆధార్ కార్డుతో భూమి సర్వే నంబర్లు లింక్ కాకపోవడం.
● ఇతర రాష్ట్రాల్లో ఉండే యజమానుల నుంచి ఓటీపీలు సకాలంలో రాకపోవడం
● జాయింట్ ఎల్‌పీఎంలో పదిమంది రైతులున్నా ఆన్‌లైన్‌లో ఒకే సైట్‌గా చూపించడం.
● చెరువులు అమ్మినా పాత యజమానుల పేర్లే ఉండటం, మ్యుటేషన్ సమస్యలు వేధించడం.
● ఇటీవల బదిలీల వల్ల గ్రామ మత్స్యశాఖ సహాయకులు కొరత ఏర్పడడం.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు
● భూమి అడంగల్, ల్యాండ్ పాస్‌బుక్ (లీజు భూమి అయితే రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్).
● మండల సర్వేయర్ ధ్రువీకరించిన చెరువు ఆటోక్యాడ్ మ్యాప్.
● ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, రూ.10 స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్.
● వీటిని సచివాలయంలో లేదా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్‌కు అందించి, ఎకరానికి రూ.1,000 చొప్పున ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.
అప్సడా రిజిస్ట్రేషన్ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. కలిదిండి మండలంలో ఆక్వా రైతులు ఎక్కువుగా ఉన్నప్పటికీ రైతులు ముందుకు రావడం లేదు. ఆక్వా సాగు చేస్తున్న వారంతా అప్సడా చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పక చేయించాలి. నిబంధనలు పాటించని వారిపై జిల్లా కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
– బి.రాజ్‌కుమార్, మత్స్యశాఖ అధికారి, కై కలూరు
మండలం మొత్తం విస్తీర్ణం జరిగిన రిజిస్ట్రేషన్లు చేయాల్సినవి
కై కలూరు 15896.73 10371.2 5525.53
ముదినేపల్లి 18557.79 10580.68 7977.11
మండవల్లి 19919.83 11585.44 8334.39
కలిదిండి 30406.03 11308.53 19097.50
భీమడోలు 10900.70 9893.43 1007.27
నిడమర్రు 15172.60 10478.24 4694.36
ఉంగుటూరు 5718.46 4815.29 903.17
పెదపాడు 11166.08 9095.93 2070.15
దెందులూరు 7288.10 6151.04 1137.06
ఏలూరు 14578.19 6151.04 8427.15
మొత్తం 149604.51 91430.82 58173.69


