పక్కదారి పడుతున్న చెరువు మట్టి | - | Sakshi
Sakshi News home page

పక్కదారి పడుతున్న చెరువు మట్టి

Jul 4 2026 2:13 AM | Updated on Jul 4 2026 2:13 AM

నూజివీడు : పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకొని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. మంత్రి పేరు చెబుతూ అధికారుల నోళ్లు మూయిస్తూ మట్టిని తమ ఇష్టారాజ్యంగా తవ్వేసి విక్రయించుకుంటున్నారు. మండలంలోని పోలసానపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన 7ఎకరాల వ్యవసాయ భూమిని మెరక చేసుకునేందుకు గాను కురువిడి చెరువులో నుంచి 2500 క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు ఇరిగేషన్‌ అధికారులు అనుమతినిచ్చారు. అయితే ఆ చెరువు నుంచి మట్టి తోలకుండా రాయన్న చెరువు నుంచి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. పొలాల్లోకి తోలుకుంటామని అనుమతి తీసుకొని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. అనుమతులు ఒక చెరువులో తీసుకుని వేరే చెరువు నుంచి మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నా ఇరిగేషన్‌ అధికారులు గానీ, రెవిన్యూ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ చెరువు నుంచి ఆగిరిపల్లి మండలం అనంతసాగారం పరిధిలో ఉన్న ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఆయిల్‌ పామ్‌నర్సరీకి ట్రాక్టరు మట్టిని రూ.1,500లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్‌కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.100 ఇస్తుండగా కొంత మొత్తం ట్రాక్టర్‌ కిరాయి కింద మినహాయించగా మిగిలిన మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందని పలువురు పేర్కొంటున్నారు.

మట్టిమాఫియాకు ఆదాయం ఫుల్లు

మట్టి తవ్వకాలకు అనుమతి కోసం ప్రభుత్వం కేవలం క్యూబిక్‌ మీటరు మట్టికి ఒక రూపాయి చెల్లిస్తే చాలనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో అనుమతి కోసం దరఖాస్తుదారుడు కేవలం 2500ల క్యూబిక్‌ మీటర్ల మట్టికి రూ.2500లు చెల్లించారు. అనుమతి వచ్చాక ఒక్క ట్రిప్పుకు రూ100ల నుంచి రూ.150లను అదనంగా వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. అసలు ఒక చెరువులో అనుమతి తీసుకొని వేరొక చెరువులో తవ్వుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement