దెందులూరు : మండలంలోని కొవ్వలి గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు కాకిలేటి శివయ్య (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... శివయ్య వంగాయగూడెంలో సొంతంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం కొవ్వలిలో ఇల్లు కొనుగోలు చేసి, అక్కడి నుంచే క్లినిక్‌కు వెళ్లి వస్తున్నారు. ఆయన భార్య వీరరాఘవమ్మ ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఐసీడీఎస్ విభాగంలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేస్తుండగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం సమీపంలోని మురుగు కాలువలో శివయ్య మృతదేహం ఉన్నట్లు వీరరాఘవమ్మకు ఆమె తమ్ముడు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. కాలువలో శివయ్య మృతదేహంతో పాటు ఆయన వాడుతున్న స్కూటర్ కూడా పడి ఉంది. తన భర్త తలపై మారణాయుధాలతో నరికిన గాయాలు ఉన్నాయని, ఎడమ కాలు, కుడి చేయి, శరీరంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానం ఉందని వీరరాఘవమ్మ దెందులూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని నూజివీడు డీఎస్పీ, భీమడోలు సీఐ పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దెందులూరు ఎస్సై డి. వెంకట్ కుమార్ తెలిపారు. అయితే వైద్యుడు శివయ్య మృతి కేసులో ఆయన సెల్‌ఫోన్ కాల్ డేటా దర్యాప్తుకు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు.


