ఎదురులేని మట్టి మాఫియా | - | Sakshi
Sakshi News home page

ఎదురులేని మట్టి మాఫియా

Mar 13 2026 8:10 AM | Updated on Mar 13 2026 8:10 AM

ద్వారకాతిరుమల: ఖద్దరు చొక్కా అండ.. అధికారుల మద్దతు ఉన్నంత వరకు మట్టి మాఫియాకు ఎదురేలేదు. ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలోని పోలవరం కుడి కాలువ గట్టుపై పెద్ద ఎత్తున జరుగుతున్న క్వారీ మట్టి అక్రమ తవ్వకాలను చూస్తున్నవారు ఎవరైనా.. నిజమే అనక మానరు. పట్టపగలు బహిరంగంగా జరుగుతున్న మట్టి దోపిడీని అరికట్టాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నా, అధికారులకు కనీసం చీమకుట్టినట్టు లేదంటే.. అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతోందని స్థానికులు అంటున్నారు. వివరాల్లోకి వెళితే. గుణ్ణంపల్లి వద్ద పోలవరం కుడి కాలువకు ఇరుపక్కలా గట్లుపై క్వారీలను ఏర్పాటు చేసి, ఎంతో విలువైన మట్టిని దోచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, దూబచర్లలో రహదారుల అభివృద్ధికి అంటూ వందలాది టిప్పర్ల మట్టిని బయటకు తరలించి, అమ్ముకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఈ మట్టి మాఫియాను అడ్డుకోవాల్సిన అధికారులు కనీసం ఆవైపు కన్నెత్తి చూడకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. అసలు ప్రభుత్వం ఉందా.. ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారులు ఏం చేస్తున్నారని ఓ పక్క స్థానికులు ప్రశ్నిస్తుంటే.. అక్రమార్కులు మాత్రం తమకు అడ్డేలేదు.. తగ్గేదే లేదని అంటున్నారు.

హడలిపోతున్న రైతులు

కాలువ గట్లపై నుంచి పొలాలకు వెళ్లే రైతులు టిప్పర్ల వేగాన్ని చూసి హడలిపోతున్నారు. మట్టి లోడుతో టిప్పర్‌ వెళ్లే సమయంలో దుమ్ము భారీగా లేస్తోంది. దాంతో టిప్పర్‌ వెనుక వెళ్లే వాహనదారులకు దారి కనబడక అష్టకష్టాలు పడుతున్నారు. దుమ్మూ.. దూళిలో పడుతూ లేస్తూ రైతులు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే టిప్పర్ల రాకపోకలతో కాలువ గట్లు సైతం ధ్వంసమయ్యాయి.

కాలువ గట్లు రాసిచ్చారా..

ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారంతో పాటు, కాలువ గట్లను రాసిచ్చారా.. అని గుణ్ణంపల్లి మాజీ సర్పంచ్‌ బాలం వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. అధికార పార్టీ ప్రముఖులు నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని అమ్ముకుని కోట్లు గడిస్తుంటే, అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని కూర్చోవడం దారుణమని అంటున్నారు. కాలువ గట్లపై తవ్వుతున్న పెద్దపెద్ద గోతులు భవిష్యత్తులో పెను ప్రమాదాలకు దారితీస్తాయని, అప్పుడు ప్రభుత్వం, అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. జిల్లా కలెక్టర్‌ కూడా ఈ అక్రమ మట్టి తవ్వకాలను పట్టించుకోకపోవడం దారుణమని వెంకటేశ్వరరావు అంటున్నారు.

పోలవరం కుడి కాలువ గట్టుపై కొనసాగుతున్న క్వారీ మట్టి అక్రమ తవ్వకాలు

గట్లపై ప్రయాణించేందుకు భీతిల్లుతున్న రైతులు

కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement