జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మరోసారి మొరాయించింది. గురువారం జంగారెడ్డిగూడెం నుంచి చింతలపూడి సర్వీసు మండలంలోని తాడువాయి సెంటర్ వద్ద ఆగిపోయింది. ఆర్టీసీ సిబ్బంది ఎంత కష్టపడినా స్టార్ట్ కాలేదు. దీంతో ప్రయాణికులు ఒక దశలో అసహనం వ్యక్తం చేశారు. మిట్టమధ్యాహ్నం మండుటెండలో బస్సు ఆగిపోవడంతో అవస్థలు పడ్డారు. అరగంట కష్టపడిన తరువాత ఎట్టకేలకు బస్సు స్టార్ట్ అయ్యి చింతలపూడి బయలుదేరడంతో ఊపిరి పీల్చుకున్నారు.
నిడమర్రు: అక్రమంగా నిల్వ ఉంచిన 12 గ్యాస్ సిలిండర్లను ఏలూరు విజిలెన్స్ అధికారులు సీజ్ చేసినట్లు విజిలెన్స్ తహసీల్దారు బి, కన్యాకుమారి తెలిపారు. ఏలూరు విజిలెన్స్ ఎస్పీ కె.నాగేశ్వరరావుకు గురువారం అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తోకలపల్లి గ్రామంలో బలే ఏడుకొండలు నివాసంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా 12 గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్లను గుర్తించారు. దీంతో ఏడుకొండలపై నిత్యవసర చట్టం 1955 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో ఎస్సై సీహెచ్ రంజిత్, సీఎస్‌డీటీ ఎస్‌కే జరీనా తదితరులున్నారు.
ఏలూరు రూరల్: జాతీయస్థాయి పారా ఒలింపిక్స్ పోటీలకు కామవరపుకోట మండలం రావికంపాడు క్రీడాకారుడు శొంఠి రాంబాబు అర్హత సాధించాడు. జనవరి 27వ తేదీన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్రస్థాయి పారా ఒలింపిక్స్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో ఏలూరు జిల్లాకు ప్రాతినిధ్యం వహించిన రాంబాబు షాట్‌పుట్ విభాగంలో 8.05 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం సాధించాడు. దీంతో ఈ నెల 17 నుంచి 21 వరకూ ఒరిస్సా రాష్ట్రం భువనేశ్వర్‌లో జరిగే జాతీయ పారా ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు.
చాట్రాయి: విద్యార్థి మృతిపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చాట్రాయి సెంటర్‌లో మృతుడి బంధువులు రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని చాట్రాయి గ్రామానికి చెందిన అంబటి దీప్(16) బుధవారం రాత్రి చెరువులో పడి మృతి చెందాడు. అతడు విస్సన్నపేటలోని ప్రైవేట్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం ఇంటర్ చదువుతున్నాడు. ప్రేమ వ్యవహారమే అతడి మృతికి కారణమంటూ గురువారం అంబటి దీప్ బంధువులు చాట్రాయి సెంటర్లో రాస్తారోకో చేశారు. విచారణ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం నివేదక ఆధారంగా విచారణ చేయనున్నట్లు ఎస్సై డి రామకృష్ణ తెలిపారు.


