● అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్న తిలక్‌వర్మ
● సంబరాలు చేసుకుంటున్న అమ్మమ్మ, తాతయ్య
ఉండి : క్రికెట్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలుగు తేజం నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ తమ మనవడే అంటూ ఉండి మండలం వాండ్రంకు చెందిన తాతయ్య భూపతిరాజు సుబ్బరాజు, అమ్మమ్మ సుందరమ్మ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. ఇటీవల టీ20 ప్రపంచకప్, గతంలో ఆసియా కప్ గెలుపులో తమ మనవడు కీలక పాత్ర పోషించాడంంటూ వారు సంబంరాలు చేసుకుంటున్నారు. గురువారం వారు తిలక్‌వర్మ గురించి పలు విషయాలు విలేకరులతో పంచుకున్నారు. మనవడు తిలక్ క్రికెట్‌లో రాణించేందుకు అల్లుడు నంబూరి నాగరాజు, కుమార్తె గాయత్రి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. అలాగే తిలక్ గెలుపులో అతని చిన్ననాటి కోచ్ సలీమ్ పాత్రకూడా ఎంతో ఉందన్నారు. తమ ఒడిలో ఆడుకున్న మనవడు దేశం గర్వించేస్థాయికి ఎదగడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. 2021లో తిలక్‌వర్మ ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. టి20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో తాము జంగారెడ్డిగూడెంలో ఉన్నామని, అక్కడ భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి మ్యాచ్ చూశామని, భారత్ గెలుపు సంబరాలతో తమ సంతోషానికి అవధులు లేవని తెలిపారు. తమ మనవడు క్రికెట్‌లో మరింతగా రాణించి దేశ ఖ్యాతిని పెంచాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. త్వరలోనే వాండ్రం రాబోతున్న తిలక్‌కు స్వాగత ఏర్పాట్లపై అలోచిస్తున్నామన్నారు.
వాండ్రంలో తమ సంతోషాన్ని పంచుకుంటున్న తిలక్‌వర్మ అమ్మమ్మ సుందరమ్మ, తాతయ్య సుబ్బరాజు, అమ్మమ్మ ఇంట్లో తిలక్‌వర్మ చిన్ననాటి ఫొటోలు


