14 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

14 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌

Mar 13 2026 8:10 AM | Updated on Mar 13 2026 8:10 AM

14 నుంచి టెన్నిస్‌ టోర్నమెంట్‌ నేటినుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జిల్లాలో హాల్ట్‌ ట్రైబల్‌ స్పోర్ట్స్‌ టాలెంట్‌ హంట్‌ కారు ఢీకొని వ్యక్తి మృతి

భీమవరం: భీమవరం కాస్మోపాలిటీన్‌ క్లబ్‌లో ఈనెల 14 నుంచి వారం రోజులపాటు ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ యూఆర్‌పీఆర్‌ వర్మ, క్లబ్‌ సహాయ కార్యదర్శి రుద్రరాజు సుబ్బరాజు తెలిపారు. గురువారం క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మెన్స్‌ డబుల్స్‌ 35+, 45+, 55+, 65+, 70 విభాగంలో సింగిల్స్‌, డబుల్స్‌, 75 + విభాగంలో డబుల్స్‌ టోర్నమెంట్‌ జరుగుతాయన్నారు. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల నుంచి 175 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారన్నారు. 14, 15 తేదిల్లో క్వాలిఫైయింగ్‌ పోటీలు 16 నుంచి 20వ తేదీ వరకు ముఖ్య పోటీలు జరుగుతాయని వర్మ, సుబ్బరాజు తెలిపారు. అలాగే స్థానిక క్రీడాకారుల్లో టెన్నిస్‌ క్రీడలో ప్రతిభను ప్రోత్సహించడానికి అండర్‌ –30 పురుషుల చాంపియన్‌షిప్‌ నిర్వహిస్తున్నామని, 8 సింగిల్స్‌, 4 డబుల్స్‌ జట్లు 18, 19, 20 తేదీల్లో పోటీల్లో పాల్గొంటాయన్నారు.

భీమవరం: ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్న చర్లపల్లి–కామాఖ్య అమృత్‌ భారత్‌ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు జిల్లాలో హాల్ట్‌ కల్పించినట్లు కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి (తెలంగాణ) నుంచి కామాఖ్య (అస్సాం) మధ్య నడిచే నెం. 15673/15674 రైలుకు జిల్లాలోని భీమవరం టౌన్‌, తణుకు రైల్వే స్టేషన్లలో హాల్టింగ్‌ కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ రైలు శుక్రవారం చర్లపల్లిలో ప్రారంభం అవుతుండగా తణుకులో రాత్రి 10.50 గంటలకు, భీమవరం టౌన్‌లో రాత్రి 11.30 గంటలకు చేరుకుని తిరిగి 15వ తేదీన చర్లపల్లి స్టేషన్‌కు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈనెల 18 నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రెగ్యులర్‌ సర్వీస్‌గా నడుస్తుందని శ్రీనివాసవర్మ ప్రకటనలో వివరించారు.

ఏలూరు రూరల్‌: గిరిజన ప్రాంతాల బాలబాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు శాప్‌ ఆధ్వర్యంలో ట్రైబల్‌ స్పోర్ట్స్‌ టాలెంట్‌ హంట్‌ పేరిట పోటీలు, శిక్షణ నిర్వహించనున్నామని జిల్లా డీఎస్‌డీఓ ఎస్‌ఏ అజీజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 1, 2012 నుంచి మార్చి 31, 2018 మధ్య 8 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు కల్గిన బాలబాలికలకు ప్రత్యేక పోటీలు చేపట్టనున్నామని వివరించారు. ఇందులో భాగంగా ఈ నెల 16, 17 తేదీల్లో రంపచోడవరం ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ పాఠశాల ఆవరణలో 400, 800, 3కేఎం, 5కేఎం, జావలిన్‌త్రో, లాంగ్‌జంప్‌తో పాటు బాలికలకు ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్‌, హాకీ, ఖోఖో, ఫుట్‌బాల్‌, బాక్సింగ్‌ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇందులో ప్రతిభ చాటిన వారిని గుర్తించి శాప్‌ ఆధ్వర్యంలో మెరుగైన శిక్షణ అందిస్తామన్నారు. పోటీదారులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతూ స్టడీ సర్టిఫికెట్‌, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. పోలవరం పరిసర 12 మండలాల్లో బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఉంగుటూరు: మోటార్‌సైకిల్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల ప్రకారం ఉంగుటూరుకు చెందిన మానేపల్లి సత్యనారాయణ (75) గురువారం రాత్రి మోటార్‌సైకిల్‌పై నారాయణపురం వెళ్లి తిరిగి వస్తుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్‌సైకిల్‌పై వెళుతున్న సత్యనారాయణ డివైడర్‌పై పడి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎస్సై సూర్యభగవాన్‌ ఘటనా స్థలానికి చేరుకుని సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును చేబ్రోలు పోలీస్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement