నూజివీడు: గ్రావెల్ కనబడితే చాలు కూటమి అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. వారి ముందు చిన్నసైజు గుట్టలు రాత్రికి రాత్రే కరిగిపోతున్నాయి. అర్ధరాత్రి గ్రావెల్ అక్రమ తవ్వకాలు మొదలుపెట్టి తెల్లవారేసరికి గుట్టు చప్పుడు కాకుండా సర్దుకొని పోతున్నారు. ప్రభుత్వ బంజరు భూమి, చెరువులు, అటవీ భూముల్లోని గ్రావెల్ వారి ముందు ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ దందా నూజివీడు మండలం ఓగిరాల తండా పంచాయతీ పరిధిలో గత వారం రోజులుగా యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామ పరిధిలోని అటవీశాఖకు చెందిన భూపతి గట్టు వద్ద ఉన్న గ్రావెల్‌ను రాత్రి 10 గంటలు దాటితే చాలు పదుల సంఖ్యలో భారీ టిప్పర్లు వచ్చి గ్రావెల్‌ను లోడు చేసుకొని నూజివీడు, విజయవాడ తదితర ప్రాంతాలకు తరలించుకుపోతున్నారు. టిప్పర్ల మోతతో, దుమ్ము,ధూళీతో ఓగిరాల తండా, వెంకటాయపాలెం గ్రామాల ప్రజలకు రాత్రి పూట నిద్ర ఉండటం లేదు. ప్రకృతి సంపదను దోచుకెళ్తున్నా దానికి రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
పట్టించుకోని అధికారులు
ఈ దారుణమైన దోపిడీపై ఓగిరాల తండా గ్రామస్తులు పలువురు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 9న నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అర్జీని సైతం ఇచ్చినప్పటికీ గ్రావెల్ దోపిడీకి బ్రేక్ పడలేదు. ప్రజా సంపద దోపిడీకి గురవుతున్నా సబ్‌కలెక్టర్ స్థాయి అధికారి కూడా దోపిడీని ఆపకపోవడంపై గ్రామస్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. భూపతిగట్టు వద్ద దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను కొల్లగొట్టి తరలించినా పట్టించుకోవాల్సిన అటవీశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేదలు ఎవరైనా అడవిలోకి వెళ్లి పొయ్యిలోకి ఎండుపుల్లలు కట్టుకొని సైకిల్‌పై తెచ్చుకుంటుంటే సైకిళ్ల టైర్లు కోసేయడం వంటి పనులకు పాల్పడే అటవీశాఖ అధికారులు ఈ దందాను ఎందుకు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రావెల్ దందాను ఇప్పటికై నా నిలువరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.


