వీడని మత్తు.. జూదంలో చిత్తు
పెనుమంట్ర: సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని సంప్రదాయ కోడిపందేల ముసుగులో జరిగిన జూద క్రీడల్లో పాల్గొన్న యువత మద్యం మత్తులో తేలియాడుతూ లక్షలాది రూపాయలు చేజార్చుకున్నారు. పెనుమంట్ర మండలంలో పెనుమంట్ర, జుత్తిగ, నత్త రామేశ్వరం, ఆలమూరు, వెలగలేరు, మార్టేరు (జగన్నాధపురం) గ్రామపంచాయతీ పరిధిలో అనధికార అనుమతులు లభించడంతో నిర్వాహకులు విచ్చలవిడిగా బరుల వద్ద మద్యం విక్రయాలు సాగించారు. దీంతో యువత రాత్రి, పగలు తాగి తందనాలాడారు. పెనుమంట్ర బరి వద్ద నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మొదటి రోజు ప్రారంభంలోనే బెడిసి కొట్టడంతో అక్కడ కోడిపందేలు నిలిపివేశారు. అయితే జుత్తిగ, నత్త రామేశ్వరం, ఆలమూరు, వెలగలేరు, మార్టేరు (జగన్నాధపురం) పంచాయతీల పరిధిలో కోడిపందేలతో పాటు పేకాటలు, గుండాటలు యథేచ్ఛగా సాగాయి. మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారగా, లక్షలాది రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు నిర్వాహకులే చెబుతున్నారు. పండగ వెళ్లి మూడు రోజులవుతున్న బరులు వద్ద నేటికీ తొలగించని చెత్తాచెదారాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాల గుట్టలను చూస్తే ఏ మేరకు అసాంఘిక కార్యక్రమాలు జరిగాయో అర్థం అవుతుందని పలువురు చెబుతున్నారు. మండలంలో కోడిపందేలు జరుగుతున్న విషయాన్ని వెలగలేరు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గుడిమెట్ల రామ కనకారెడ్డి పోలీసులకు ముందుగా రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. పండగ మూడు రోజులు కనీసం రెవెన్యూ, పోలీస్, ఎకై ్సజ్ అధికారులు బరుల దరిదాపుల్లో కనిపించకపోవడం గమనార్హం. దీంతో నిర్వాహకులు భారీ స్థాయిలో ముడుపులు చెల్లించినట్లు చెప్పుకుంటున్నారు.
వీడని మత్తు.. జూదంలో చిత్తు
వీడని మత్తు.. జూదంలో చిత్తు


