గిరిజన సొసైటీల పేరుతో ఇసుక దోపిడీకి స్కెచ్‌ | - | Sakshi
Sakshi News home page

గిరిజన సొసైటీల పేరుతో ఇసుక దోపిడీకి స్కెచ్‌

Mar 6 2026 8:35 AM | Updated on Mar 6 2026 8:35 AM

కుక్కునూరు: గిరిజన సొసైటీల పేరుతో ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుకను సిండికేట్‌ మాఫియా అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటించి అమ్ముకునేందుకు చేసిన యత్నం ఒక సామాన్యుడి ఫిర్యాదుతో ఆగింది. వివరాల్లోకి వెళ్తే ఏజెన్సీ ప్రాంతమైన కుక్కునూరు మండలంలో గోదావరి నదిలోని ఇసుకను తవ్వుకునేందుకు గిరిజన సొసైటీల నుంచి దరఖాస్తులు వెళ్లాయి. తెర ముందు గిరిజన సొసైటీల పేరుతో తెర వెనుక ఇసుక మాఫియా బడాబాబులు దాచారం, ఇబ్రహీంపేట గ్రామాల వద్ద గోదావరి నది నుంచి ఇసుకను తీసుకునేందుకు పర్మిషన్‌ మంజూరు చేయించుకున్నారు. దీంతో ఇసుకను రవాణా చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న మాఫియా రాత్రి వేళల్లో అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా లారీలలో ఇసుకను తెలంగాణకు తరలించింది. ఇలా తరలించిన ఒకటి, రెండు లారీలను తెలంగాణ పోలీసులు పట్టుకుని కేసులు నమోదు చేసిన ఘటనలు కూడా జరిగాయి. అయినప్పటికీ మాఫియా తెలంగాణలో ఈ వ్యాపారంతో పట్టున్న వ్యక్తులతో చేతులు కలిపి బూర్గంపాడు మీదుగా ఇసుకను తరలించినట్టు తెలుస్తుంది.

ఫిర్యాదుతో కదిలిన అధికార యంత్రాంగం

ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సొసైటీల ద్వారా ఇసుకను తవ్వుకునేందుకు నిబంధనల ప్రకారం యంత్రాలను ఉపయోగించకూడదు. అంతేకాక నదిలోకి లారీలను తరలించి ఇసుకను లోడ్‌ చేయకూడదు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే ఇసుక తవ్వుకునేందుకు అనుమతి ఉంటుంది. కానీ ఈ నిబంధనలు పాటించకుండా ఇసుక మాఫియా యథేచ్చగా రాత్రి వేళల్లో ఇసుకను తరలిస్తున్నా మండల స్థాయి అధికారులు పట్టించుకోలేదు. అయితే అక్రమ తరలింపుపై ఓ వ్యక్తి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కదిలిన అధికార యంత్రాంగం ఇబ్రహీంపేట ర్యాంపులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిగినట్టు ధ్రువీకరణకు వచ్చారు. అంతేకాక ఇకపై లారీలను రాంపులోకి అనుమతించకూడదని ఇసుక తరలింపు ట్రాక్టర్ల ద్వారానే చేపట్టాలని అది సమయానుకూలంగా మాత్రమే జరగాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికై నా స్థానిక అధికార యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని మండల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement