నూజివీడు: పట్టణంలోని విస్సన్నపేట రోడ్డులో కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం గురువారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విస్సన్నపేట రోడ్డులో మామిడి పరిశోధన స్థానానికి గురుకుల పాఠశాలకు మధ్యలో ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న పైప్ కల్వర్టు ప్రాంతం నుంచి దుర్వాసన వస్తుండడంతో మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో స్థానికులు చూడగా గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పట్టణ సిఐ పి.సత్యశ్రీనివాస్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించి, క్లూస్ టీంకు, డాగ్ స్క్వాడ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు సంఘటన ప్రాంతానికి విచ్చేసి క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీస్ డాగ్ వచ్చి అక్కడి నుంచి పక్కనే ఉన్న తోటల్లోకి వెళ్లే రోడ్డులో కొంత దూరం వెళ్లి ఆగింది. మగ వ్యక్తి మృతదేహం తల, ఛాతి, పొట్ట భాగాలు పూర్తిగా కుళ్లిపోయి ఆనవాలు పట్టని విధంగా ఉంది. వయస్సు సుమారు 35నుంచి 40ఏళ్ల లోపు ఉండొచ్చని, గళ్ల చొక్కా, నిక్కరు ధరించి ఉన్నాడు. మృతదేహం మొండెం వరకు కల్వర్టు లోపలకు ఉండగా, కాళ్లు బయటకు ఉన్నాయి. ఈ మేరకు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సత్యశ్రీనివాస్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నరసాపురం రూరల్: మండలంలోని సీతారామపురం సౌత్ మంగళగుంటపాలెం జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం శేరేపాలెం గ్రామానికి చెందిన చిలకపాటి జేమ్స్ (32) అనే వ్యక్తి బుధవారం సాయంత్రం 216 జాతీయ రహదారిపై కాలినడకన నరసాపురం వైపు వెళ్తున్నారు. అదే సమయంలో కాళీపట్నం పశ్చిమ గ్రామానికి చెందిన కుసుమే సంజీవరావు బైక్ పై వెళ్తూ జేమ్స్‌ను వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో జేమ్స్ తలకు గాయం అవ్వడంతోపాటు శరీరంపై కూడా తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితుడిని నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ జేమ్స్ గురువారం మృతి చెందాడు మృతుని సోదరుడు చిలకపాటి జాన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొగల్తూరు ఎస్సై జి.వాసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
జాతీయస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు పట్టియ్య
కొయ్యలగూడెం: జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలకు బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన యువకుడు జొన్నకూటి పట్టియ్య ఎంపికై నట్లు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చల్లా జాకబ్ గురువారం విలేకరులకు తెలిపారు. రాష్ట సాయి బ్యాడ్మింటన్ పోటీలు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఏలూరులో నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రాతినిధ్యం వహించిన సమయంలో పట్టియ్య ప్రతిభ కనబరిచడం సెలెక్టర్లు జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేశారన్నారు. శుక్రవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో పట్టియ్య పాల్గొంటాడన్నారు. పట్టియ్యకు వైఎస్సార్ సీపీ రాష్ట కార్యదర్శి రామస్వామి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతన తాతారావు, మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగారాజు తదితరులు అభినందనలు తెలియజేశారు.


