కొయ్యలగూడెం: విత్తనాల తయారీ కేంద్రంలో గురువారం వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాష ఆకస్మిక తనిఖీలు చేశారు. గురువారం మండలంలో గవరవరం గ్రామంలో ఒక ప్రైవేటు మిల్లులోని పత్తి విత్తనాలు తయారు చేస్తున్నారని సమాచారం రావడంతో ఆయన ఏడీఏ పీజీ బుజ్జిబాబుతో కలిసి దాడులు చేశారు. విత్తనాల తయారీ కేంద్రం అనుమతులు ఒకచోట తయారీ ఒకచోట చేస్తున్నట్లుగా గుర్తించారు. అలాగే మార్కెటింగ్ చేసే సంచులపై ముద్రించే నియమ నిబంధనలు సైతం స్పష్టంగా లేకపోవడాన్ని గమనించారు. దీనిపై పూర్తి విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏఓ చెన్నకేశవులు ఉన్నారు.
ఆకివీడు: బ్రాంచ్ రైల్వే లైన్‌లో ప్రయాణికులు గురువారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరమ్మతులు చేసే ఇంజన్ రైలు మరమ్మతులకు గురి కావడంతో ఆకివీడు, కై కలూరు తదితర స్టేషన్లలో రైళ్లు నిలిచిపోయాయి. ఆకివీడు నుంచి చెరుకువాడ వైపు ట్రాక్‌పై మరమ్మతులు చేస్తుండగా ఇంజన్‌లో తీవ్ర లోపం వచ్చిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో భీమవరం ఆపై స్టేషన్ల నుంచి వచ్చే రైళ్లన్నీ ఒక స్టేషన్‌కు వెనుక మరొక స్టేషన్‌లో నిలిచిపోయాయి. విజయవాడ నుంచి వచ్చే రైళ్లన్నీ ఆకివీడు స్టేషన్‌కు దిగువన గుడివాడ వరకూ ట్రాక్‌పై నిలిచిపోయాయి. ఆకివీడు రైల్వే స్టేషన్‌లో హౌరా–షాలిమార్ ప్రత్యేక రైలు మూడు గంటలకుపై నిలిచిపోయింది.
కొయ్యలగూడెం: నాటు సారాను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ కె.వీరబ్రహ్మం గురువారం విలేకరులకు తెలిపారు. వివరాల ప్రకారం సరిపల్లి గ్రామంలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీపేట గ్రామానికి చెందిన కర్తవ ప్రసాద్ రాజు, సరిపల్లి గ్రామానికి చెందిన మన్యం రమేష్ ఇద్దరూ రెండు ద్విచక్ర వాహనాలపై సారాని తరలిస్తుండగా గుర్తించమన్నారు. ఇందులో మన్యం రమేష్ పారిపోగా, ప్రసాద్‌రాజును అరెస్టు చేశారు. నిందితుడి వద్ద సుమారు 20 లీటర్ల నాటు సారా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు.
వేలేరుపాడు: ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (పీఎం జన్‌మన్) పథకంలో భాగంగా మండలంలోని కోయిదా పంచాయతీలోని మోదెల గ్రామంలో 5కేవీ సోలార్ ఆఫ్ గ్రిడ్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ఆదివాసిలకు ఏపీఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ సోలార్ గ్రిడ్ ను పరిశీలించడానికి న్యూ ఢిల్లీ నుంచి పునరుత్పాదక ఇంధన మంత్రిత్వశాఖ తరుపున సైంటిస్ట్ పీవీ తరుణ్ సాకేత్ గురువారం మోదెల గ్రామానికి వచ్చారు. గ్రామంలోని సోలార్ ప్లాంట్‌ను తనికీ చేసి అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. కార్యక్రమంలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ ఖాన్, జీలుగుమిల్లి ఆపరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కట్టా రమేష్, జేఈ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
ఆగిరిపల్లి: నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పైనుంచి కిందపడి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని వట్టిగుడుపాడు గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్సై శుభశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం వట్టిగుడుపాడుకు చెందిన నీలపాల శ్రీనివాసరావు ( 50) తాపీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. శ్రీనివాసరావు ఎప్పటిలాగానే గురువారం ఉదయం వట్టిగుడిపాడులోని భవన నిర్మాణ పనులకు వెళ్లాడు. పనిలో నిమగ్నమై ఉండగా అప్పుడే నిర్మించిన ప్రహరీపై నుంచి ప్రమాదవశాత్తూ జారి కింద పడిపోయాడు. వెంటనే సంఘటనా స్థలంలో ఉన్న తోటి కూలీలు చికిత్స కోసం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాసరావు మరణించాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. శ్రీనివాసరావు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శుభశేఖర్ తెలిపారు.


