పెద్దల సభగా పిలుచుకునే శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ఏకంగా మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుపై చేసిన వ్యాఖ్యలపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లడ్డూ కల్తీపై జరిగిన చర్చను తప్పుదోవ పట్టించేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సహనం కోల్పోయేలా చేసి సభను వాయిదా వేయించాలనే దుర్బుద్ధితో టీడీపీ మంత్రులు వ్యవహరించారని విమర్శిస్తున్నారు. – సాక్షి నెట్ వర్క్
శాసనమండలిలో ప్రజా సమస్యలపై చర్చించాల్సింది పోయి కూటమి నాయకులు కులాలు, మతాలపై చర్చలు చేస్తుండడం బాధాకరం. శాసన మండలి సమయాన్ని వృథా చేస్తూ ప్రజాధనాన్ని పాడు చేస్తున్నారు. ప్రజల సమస్యలు పక్కనపెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజును కులాలు, మతాలు పేరుతో అవమానించడం చాలా దారుణం. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి దళితులను ఇబ్బందులకు గురి చేస్తుంది.
– పొట్ల సురేష్, వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి, తణుకు అర్బన్
శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజుపై మంత్రి అచ్చెన్నాయుడు కులమతాల ప్రాతిపదిక చేసిన వ్యాఖ్య లన్నీ డైవర్సన్ పాలిటిక్స్‌లో భాగమే. ఈ తరహా వ్యాఖ్య లు టీడీపీ నాయకుల దురహంకారానికి నిదర్శనం. బలహీనవర్గాలకు చెందిన వారు ఉన్నత పదవుల్లో ఉండటం వారి ఇష్టం లేదని ఈ వ్యాఖ్యలతో తేలింది. ప్రజల సమస్యలపై సమాధానం చెప్పలేకే ప్రభుత్వం కుల రాజకీయాలకు తెర తీసింది.
– జి.సుందర్‌కుమార్, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి, ఉండి
శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవర్తన హేయం. మండలి చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమే. టీడీపీ సోషల్ మీడియాలో మండలి చైర్మన్‌ను అవమానించేలా పెడుతున్న పోస్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దళితులు అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. ఆయన బాటలోనే ప్రస్తుతం టీడీపికి చెందిన మంత్రులు కూడా దళితుడైన చైర్మన్ మోషెన్‌రాజును అవమానించేలా సభలో మాట్లాడుతున్నారు.
– వడ్డి రఘురాం, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కన్వీనర్, తాడేపల్లిగూడెం
శాసనమండలి చైర్మన్ కొయ్యే మోసేనురాజుకు మతం అంటగడుతూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన అనుచిత వ్యాఖ్యలు దారుణం. మోషేనురాజు దైవభక్తితో ప్రతిఏటా ముక్కోటి ఏకాదశి రోజున తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనేక దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. లడ్డూ కల్తీ అంశంపై చర్చ జరుగుతుండగా దానిని పక్కదారి పట్టించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, మోషేనురాజు ఇద్దరు క్రిస్టియన్లు పేర్కొంటూ చేసిన వ్యాఖ్యాల సబబు కాదు.
– ఏఎస్ రాజు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, భీమవరం
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తుంది. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నానాయుడు మతపరమైన వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనం. అన్ని మతాలకు పవిత్ర దేవాలయం లాంటి శాసనమండలిలో చైర్మన్ మోషన్ రాజు తో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం దారుణం.
– కర్రి గౌరీసుభాషిణి, జెడ్పీటీసీ సభ్యురాలు, పెనుమంట్ర
రాష్ట్రంలో ప్రజాసమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటిని చర్చించాల్సిన శాసనమండలిలో కులాలు.. మతాలూ..అంటూ ప్రజలను విభజించి పాలించే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. శాసనమండలి చైర్మన్ మోషేను రాజు కులాన్ని, మతాన్ని మాటిమాటికీ సభలో ప్రస్తావిస్తూ ఆయన్ను అవమానించారు. గతంలో ఎన్నడూ సభలో ఇలాంటి ఘటనలు జరగలేదు. కల్తీ లడ్డూ అంశాన్ని డైవర్ట్ చేయడానికి కులాలను, మతాలను రెచ్చగొడుతూ కూటమి ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుంది.
– సొంగా సందీప్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏలూరు (టూటౌన్)


