రబీకి నీటి కష్టాలు తప్పవా?
● గోదావరి డెల్టాలో 8.99 లక్షల ఎకరాల్లో సాగు
● మొత్తం 93 టీఎంసీలు అవసరం కాగా.. 19 టీఎంసీల కొరత
ఆకివీడు: ఈ ఏడాది వేసవిలో సాగు, తాగు నీటి అవసరాలకు కొరత తప్పేలా లేదు. ఇప్పటికే శివారు ప్రాంతాలకు సాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనవరి నెలాఖరునాటికి నీటి సరఫరాలో కొరత ఉండే అవకాశం ఉందని జలవనరుల శాఖ చెబుతోంది. ఫిబ్రవరి మొదటి వారంలో వంతుల వారీగా నీటిని సరఫరా చేయాలని ప్రణాళికలు రూపొందించారు. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ రబీ సీజన్‌లో సుమారు 8.99 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపడుతుండగా.. సాగు పూర్తయ్యేవరకూ 93 టీఎంసీల నీటి అవసరాల్ని జలవనరుల శాఖ గుర్తించింది. గోదావరి, సీలేరు నుంచి నీటిని సరఫరా చేసేందుకు నిర్ణయించారు. గోదావరి వెస్ట్రన్ డివిజన్‌లో 4.62 లక్షల ఎకరాలు, సెంట్రల్ డివిజన్‌లో 1.72 లక్షల ఎకరాలు, ఈస్ట్రన్ డివిజన్‌లో 2.65 లక్షల ఎకరాల్లో రబీ సాగు చేపట్టనున్నారు. వీటితో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలోని గ్రామాల్లో మంచినీటి అవసరాలు, ఇతర అవసరాలకు నీటి వినియోగం ఉంటుంది. ప్రస్తుత రబీ సీజన్‌కు 19 టీఎంసీల నీటి కొరత ఉన్నట్లు జలవనరుల శాఖ నిర్ధారించింది. నీటి కొరతను అధిగమించేందుకు వంతుల వారీ విధానాన్ని ఫిబ్రవరి మొదటి వారం నుంచి అమలుజేయనున్నారు.
మంచినీటికీ ఇక్కట్లు?
రానున్న రోజుల్లో మంచినీటి సమస్య తీవ్రమయ్యే ప్రమాదం ఏర్పడింది. గోదావరి, పోలవరం, సీలేరు ప్రాంతాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో సాగునీటికి, తాగునీటికి, చెరువులకు నీటి కష్టాలు తప్పేలా లేవు. పోలవరం ప్రాజెక్టుతో నీటి కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు, ప్రజలకు ఆదిలోనే హంసపాదులా మారింది. ఈ ఏడాది ఖరీఫ్‌లోనే కొన్నిచోట్ల నీటి సమస్య తలెత్తింది. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు నిండుకుంటోంది. చేపలు, రొయ్యల చెరువులకు, ఇతర అవసరాలకు నీరు ఏవిధంగా అందుతుందోననే ఆందోళనలో ప్రజలు, రైతులు ఉన్నారు.


