ఊపాధి హామీ పథకానికి తూట్లు
భీమవరం: జీ రామ్ జీ పేరుతో కొత్త చట్టం పేదలకు ఉపాధి గ్యారెంటీ లేకుండా చేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.బలరాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టానికి సవరణ చేయడంపై నిరసనగా సోమవారం భీమవరంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటి వాటిని నేడు మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. గ్రామీణ పేదల ఉపాధికి నష్టం కలిగించే జీ రామ్ జీ చట్టం అమలుకు చేసే ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ రాజు మాట్లాడుతూ వలసల నివారణకు యూపీఏ ప్రభుత్వం చట్టాన్ని తెస్తే నేడు జాతిపిత గాంధీ పేరు తొలగించి రాంజీ పేరు పెట్టడం పేదలను మోసం చేయడమేనన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కామన నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు స్టాండింగ్ కమిటీ ముందు చర్చ పెట్టాలని డిమాండ్ చేసినా కేంద్రం మొండిగా చట్టాన్ని ఆమోదింప చేసిందని విమర్శించారు. రానున్న రోజుల్లో ఉపాధి హామీ చట్టాన్ని రక్షించే పోరాటంలో వైఎస్సార్‌సీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి లంక కృష్ణమూర్తి. ఎంసీపీఐయు జిల్లా నాయకుడు గురుగుబెల్లి రాంబాబు, బీఎస్పీ జిల్లా నాయకులు మురాల రత్నంరాజు, ఈది శేఖర్‌బాబు, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందరకుమార్, కోన జోసప్, ఈది రవికుమార్, బోకూరి విజయరాజు, బి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.


