రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ద్వారకాతిరుమల: లారీ, బైక్ పరస్పరం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండలంలోని దొరసానిపాడు శివారులో ఓ దాబా ముందు సోమవారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... కామవరపుకోట మండలం తాడిచర్లకు చెందిన కొప్పుల రాజేష్(20) వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రాజేష్, ఆడమిల్లిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు సర్వేపల్లి నవదీప్‌లు బైక్ సైలెన్సర్ రిపేర్ నిమిత్తం ద్వారకాతిరుమలకు వచ్చారు. అనంతరం స్వగ్రామానికి వెళుతున్నారు. కామవరపుకోట నుంచి ద్వారకాతిరుమల వైపుకు వెళుతున్న లారీ, వీరి బైక్ పరస్పరం వేగంగా ఢీకొన్నాయి. రాజేష్ తల భాగం నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతి చెందగా, నవదీప్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 108లో పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. మృతుడి తండ్రి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి


