రియల్‌ దందా | - | Sakshi
Sakshi News home page

రియల్‌ దందా

Aug 31 2025 12:40 AM | Updated on Aug 31 2025 12:40 AM

రియల్

రియల్‌ దందా

రియల్‌ దందా

ఫిర్యాదులు పట్టించుకోవడం లేదు

అడ్డగోలుగా అనుమతుల్లేని భారీ వెంచర్లు

కొత్తూరు జూట్‌మిల్లు సమీపంలో భారీ లేఅవుట్‌

ఇడా అనుమతి లేకుండానే అట్టహాసంగా వెంచర్‌ ఏర్పాటు

రూ.13 కోట్ల విలువైన 2.21 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంచర్‌లో కలుపుకున్న వైనం

కమిషనర్‌ మొదలుకొని కలెక్టర్‌ వరకూ ఫిర్యాదు చేసిన స్థానికులు

అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టులో కేసు దాఖలు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అనుమతులు ఉండవు.. సంబంధిత శాఖాధికారులు పరిశీలించి అంతా సక్రమమేనని నిర్ధారణ చేయరు. చట్టంలోని లొసుగులు అడ్డంపెట్టుకుని వెంచర్లు ఏర్పాటు చేయడం, ముందస్తు జాగ్రత్తగా దరఖాస్తు చేసుకోవడం.. అనుమతి వచ్చేలోపు వెంచర్‌లో విక్రయాలు పూర్తి చేయడం ఇది ఏలూరులో కొన్ని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లల్లో జరుగుతున్న దందా. తాజాగా ఒక వెంచర్‌ నిర్వాహకుడు 2.21 ఎకరాల ప్రభుత్వ భూమిని కలుపుకుని అట్టహాసంగా ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించాడు. దీనిపై స్ధానికులు కలెక్టర్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ ఇలా అందరికీ ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఏలూరు సమీపంలోని కొత్తూరు జూట్‌మిల్లు వద్ద నగరానికి చెందిన ఒక రియల్టర్‌ సుమారు 9.67 ఎకరాల విస్తీర్ణంలో ఫేజ్‌–3 పేరుతో భారీ లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. గత నెలలో ప్రజాప్రతినిధితో వెంచర్‌ను ఓపెన్‌ చేసి బ్రోచర్‌ను రిలీజ్‌ చేయించారు. కట్‌చేస్తే... నగరపాలక సంస్థ నుంచి, డీటీసీపీ, ఏలూరు అర్బన్‌ డెవల్‌మెంట్‌ అథారిటీ నుంచి ఎలాంటి అనుమతి మంజూరు కాలేదు. ఇడాకు కేవలం దరఖాస్తు మాత్రమే సమర్పించారు. దీనిలో సర్వే నెంబర్‌ 327లో 1.02 ఎకరాలు, సర్వే నెంబర్‌ 328లో 1.16 ఎకరాల భూమి ప్రభుత్వ పోరంబోకుగా, ఖాళీ బాటగా ప్రభుత్వ అడంగల్‌లో నమోదైంది. సదరు వెంచర్‌ నిర్వాహకుడు ఆ భూమిని కూడా కలుపుకుని వెంచర్‌ను నిర్మించి దాన్ని రహదారిగా కొంత మార్చి మిగిలింది వెంచర్‌లో కలిపేశారు. దీనిపై ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి స్థానికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపు రూ.13 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేయడమే కాకుండా అనుమతి లేని వెంచర్‌ ఏర్పాటు చేసి భారీ విక్రయాలకు తెరతీశారు. దీనిపై ఏప్రిల్‌ 11న ఒక సారి, మే 23న మరోసారి స్థానికులు ఫిర్యాదు చేశారు. జాయింట్‌ కలెక్టర్‌ మొదలుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు ఫిర్యాదు కాపీని పంపారు.

చర్యలు తీసుకోవాలని

ఆదేశించినా స్పందన శూన్యం

ఈ క్రమంలో కలెక్టర్‌ ఆదేశాలతో జాయింట్‌ కలెక్టర్‌ విచారించి నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవాలని మే 8న నగర కమిషనర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఇడాలో ప్రభుత్వ భూమి కలిసి ఉండటంతో అనుమతి రాదు. గజం రూ.13 వేలు పెట్టి విక్రయిస్తున్నారు. ఈ వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. నగరానికి చెందిన కీలక నేత బడా సెటిల్‌మెంట్‌ నిర్వహించి విచారణకు అడ్డుపడటంతో వ్యవహారం పెండింగ్‌లో ఉంది. బడా నేతకు దాదాపు కోటిన్నరకుపైగా చెల్లించడంతో వ్యవహారం ముందుకు సాగకుండా చట్టంలోని లొసుగులు వినియోగిస్తున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు దాసరి వందన జీవన్‌ శ్యామ్‌ అనే వ్యక్తి దీనిపై ఫిర్యాదులు చేసి విసిగిపోయి హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు.

ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని అధికారుల చుట్టూ తిరిగి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. రూ. 13 కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని అధికారులే వెంచర్‌ యజమాని వద్ద ముడుపులు తీసుకుని ధారాదత్తం చేశారు. దీనిపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, మైనింగ్‌, నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో హైకోర్టులో కేసు దాఖలు చేశాం.

– దాసరి వందన జీవన్‌శ్యామ్‌

రియల్‌ దందా1
1/1

రియల్‌ దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement