
సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన అవసరం
ఏలూరు(మెట్రో): సత్వర న్యాయం కోసం చట్టాలపై అవగాహనతో పాటు పేదరిక నిర్మూలన కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసు క్యాంపు ఆన్ నల్సా స్కీంలపై నిర్వహించిన అవగాహన సదస్సును ఆమె ప్రారంభించారు. కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనె సీతారామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలకు రూ 225.17 కోట్లు, సీ్త్రనిధి ద్వారా రూ 66.32 కోట్లు, ఉన్నతి స్కీములో రూ 2.28 కోట్లు, దివ్యాంగ విద్యార్థులకు 3 టచ్ ఫోన్లు పంపిణీ చేశారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఇటీవల లోక్ అదాలత్‌లో 373 సివిల్ కేసులు, 292 ఎంబీఓపి కేసులు, 10,896 క్రిమినల్ కేసులు పరిష్కరించామన్నారు. జిల్లావ్యాప్తంగా 496 న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించామని తెలిపారు. కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల ద్వారా పేదరిక నిర్మూలనకు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు.