
ప్రమాద స్థాయిలో తమ్మిలేరు
కొల్లేరులోకి భారీగా వరద
● శనివారపు పేట కాజ్‌వే పైకి నీరు
● లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం
ఏలూరు (టూటౌన్): తమ్మిలేరు ప్రాజెక్టు నుంచి 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో తమ్మిలేరు నిండుకుండలా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఏలూరు నగర ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రవాహం మరింత ఎక్కువైతే నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరే ప్రమాదం పొంచి ఉంది. నగరాన్ని ఆనుకుని ఇరువైపులా తూర్పు, పడమరగా ఉన్న తమ్మిలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారపు పేట కాజ్‌వేపై రెండు అడుగుల మేర నీరు చేరింది. సోమవారం సాయంత్రం నుంచి కాజ్‌వేపై రాకపోకలు నిలిపేశారు. దీంతో ఏలూరు నుంచి పెదవేగి మండలంలోని పలు గ్రామాలతో పాటు నగరంలోని శనివారపు పేట, శ్రీరామ్ నగర్ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు నుంచి నూజివీడు వెళ్లే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాకపోకలు నిలిపివేయడంతో సెయింట్ ఆన్స్, గవరవరం, గ్జేవియర్ నగర్, టీటీడీ కళ్యాణమండపం మీదుగా ఏలూరు టౌన్‌లోకి వస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్, ఎస్పీ
తమ్మిలేరు వరద దృష్ట్యా ఏలూరు రూరల్, అర్బన్ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం ఉదయం పరిశీలించారు. తమ్మిలేరు పరివాహక ప్రాంతమైన శనివారపుపేట కాజ్ వే, బాలయోగి వంతెన, తంగెళ్ళమూడి వంతెన తదితర ప్రాంతాల్లో పర్యటించారు. వరద వల్ల ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, తమ్మిలేరు వెంట ఉన్న గట్ల పటిష్టత గురించి ఆదేశాలు జారీ చేశారు. తమ్మిలేరు వరద కారణంగా చింతలపూడి, లింగపాలెం, పెదవేగి, చాట్రాయి, ముసునూరు మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు. గట్ల పటిష్టతను పరిశీలించి బలహీనమైన చోట్ల అవసరమైన ఇసుక బస్తాలు, తదితర సామగ్రితో పటిష్టం చేయాలన్నారు. తమ్మిలేరు రిజర్వాయర్ లో నీటి సామర్‌ాధ్యన్ని ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ తమ్మిలేరు వరద నీటి విడుదల ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీసు అధికారులు గమనిస్తూ ప్రజలకు సమాచారం ఇవ్వాలన్నారు.
తమ్మిలేరు వరద నీటిని ఏలూరు తూర్పు, పడమర లాకుల నుంచి దిగువ కొల్లేరులోకి విడుదల చేస్తున్నారు. లాకుల వద్ద ఉన్న అన్ని గేట్లను ఎత్తేశారు. దీంతో పెద్ద ఎత్తున వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. లాకుల వద్ద చెత్తను ఎప్పటికప్పుడు తీయించేందుకు అధికారులు పొక్లెయిన్‌లను అందుబాటులో ఉంచారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా కార్పొరేషన్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు.

ప్రమాద స్థాయిలో తమ్మిలేరు

ప్రమాద స్థాయిలో తమ్మిలేరు