
మద్ది క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
జంగారెడ్డిగూడెం: స్వయంభూః శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభాతసేవ, నిత్యార్చన పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుతీరి స్వామివారిని దర్శించుకున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి ఆర్‌వీ చందన తెలిపారు. భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ చేసినట్లు చెప్పారు.
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మంగళవారం సాయంత్రానికి కూడా రాలేదు. దీంతో ఈ కుర్చీ విషయంలో సందిగ్ధ స్థితి కొనసాగుతోంది. కొత్త ఉపకులపతి వస్తేనే కాని, లేదంటే ఎవ్వరినైనా ఇన్‌చార్జిగా నియమించి వారు ఇక్కడకు వచ్చి బాధ్యతలు స్వీకరించేవరకు ప్రస్తుతమున్న వీసీ కొనసాగుతారు. అయితే విధాన పరమైన కీలక నిర్ణయాలు తీసుకొనే వెసులుబాటు ఉండదు. మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం వర్సిటీ రిజిస్ట్రార్ పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.