
వాడవాడలా వైఎస్ వర్ధంతి కార్యక్రమాలు
నివాళులర్పించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు
వైఎస్‌తో అనుబంధం, ఆయన చేసిన మేలు గుర్తు చేసుకున్న నేతలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: రైతుకు తోడుగా, నిరుపేదకు నీడగా, ఆడపడుచులకు అండగా, యువతకు దార్శనికుడిగా, ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆపద్బాంధవుడిగా, పేద విద్యార్థుల ఉన్నత చదవులకు పెద్దదిక్కుగా జనరంజక పాలన సాగించిన రాజన్నకు జిల్లా ప్రజలు జోహార్లు పలికారు. మహానేత దివికేగి 16 ఏళ్లు గడిచినా గుండె గూటిలో ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగానే ఉంటాయని చాటిచెప్పారు. జోహార్ వైఎస్సార్ అంటూ నినదించారు. జిల్లా వ్యాప్తంగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్‌ఆర్‌తో అనుబంధాన్ని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేతలు గుర్తుచేసుకున్నారు. పలు చోట్ల అన్నదానాలు, దుస్తుల పంపిణీ, ఇతర కార్యక్రమాలు నిర్వహించారు.
వాడవాడలా ఘనంగా నివాళులు
● పార్టీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కై కలూరులో వైఎస్సార్ సంస్మరణ కార్యక్రమాలు జరిగాయి. కై కలూరు సంత మార్కెట్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలనకు వైఎస్సార్ వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు, ఫీజు రీయింబర్స్‌మెంటు, ఉచిత కరెంటు, రుణ మాఫీ ఇలా అనేక పథకాలతో పేదల కష్టాలను తీర్చిన మహానుభావుడని కీర్తించారు.
● నూజివీడు నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప అప్పారావు నేతృత్వంలో చినగాంధీ బొమ్మ సెంటరులో నివాళి కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు మండలం రేగుంటలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించి పేదలకు మందులు పంపిణీ చేశారు.
● పోలవరం నియోజకవర్గంలో బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీ.నర్సాపురం, కొయ్యలగూడెం, పోలవరం మండలాల్లో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లిలో పేదలకు సొసైటీ మాజీ అధ్యక్షుడు, పార్టీ నేత ఘంటశాల గాంధీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు.
● ఉంగుటూరులో మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు దివంగతనేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణపవరం, భీమడోలు, నిడమర్రు ఆయా మండలాల్లో నాయకులు వైఎస్సార్‌కు నివాళులర్పించారు.
● చింతలపూడి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త కంభం విజయరాజు నేతృత్వంలో నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కార్యక్రమాలు నిర్వహించారు. చింతలపూడిలో అన్నదాన కార్యక్రమం, జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెం, శ్రీనివాసపురంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. అలాగే కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో నివాళి కార్యక్రమాలు నిర్వహించారు.
● ద్వారకాతిరుమల, పంగిడిగూడెం గ్రామాల్లో జరిగిన వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ హోం మంత్రి తానేటి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకున్న ప్రతి పేదవాడి గుండె చప్పుడులో వైఎస్సార్ చిరస్మరణీయంగా ఉన్నారన్నారు. చివరి శ్వాస వరకు పేదల సంక్షేమానికి ఆయన కృషి చేశారని కొనియాడారు. తండ్రి బాటలో సంక్షేమ పాలన సాగించి ప్రజలకు మేలు చేసిన ఘనత జగనన్నకే దక్కిందన్నారు.
● దెందులూరు మండలం శ్రీరామవరంలో పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో ఆయా మండల నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు.
● ఏలూరు నగరంలో పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, పార్టీ నాయకులు జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఫైర్‌స్టేషన్ సెంటరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.