అన్నదాత సుఖీభవ అర్హులను గుర్తించాలి
ఏలూరు(మెట్రో): అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులైన రైతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం జూన్ నుంచి అమలు జరిగే అవకాశం ఉన్నందున, మండలాల వారీగా అర్హులైన రైతుల జాబితాను నెలాఖరులోగా పంపాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్నదాత సుఖీభవ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఏలూరు జిల్లా జీడీపీని పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వర్షాలు ప్రారంభంలోగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి జాతీయ ఉపాధి హామీ పథకంలో పనులను వెంటనే పూర్తిచేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో పని అడిగిన ప్రతి ఒక్కరికీ కల్పించాలన్నారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ విధానంలో మరింత ఎక్కువగా సాగు జరిగేలా అవగాహన కల్పించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ జేడీ హబీబ్ బాషా, ఉద్యానవన శాఖ డీడీ రామ్మోహన్, డ్వామా పీడీ సుబ్బారావు పాల్గొన్నారు.
స్వచ్ఛ ఓటర్ల జాబితాకు సహకరించాలి
జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.వెట్రిసెల్వి కోరారు. మంగళవారం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నియోజకవర్గంలోని పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించాలని తెలిపారు. ముందుగానే ఓటర్ల జాబితా స్వచ్ఛీకరణ, మార్పులు, చేర్పులు, ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వంటి అంశాలపై ఆయా రాజకీయ పార్టీలు తమ సూచనలు, సలహాలు అందించాలని కోరారు. ప్రతి మున్సిపాలిటీలో డోర్ నెంబర్లను సరిచేయాల్సి ఉందని సీపీఎం జిల్లా ప్రతినిధి ప్రసాద్ కోరారు.


