భూ కబ్జాపై టీడీపీ నేతల దొంగాట
● ఆక్రమణలపై ఆరోపణలు
● పట్టించుకోని రెవెన్యూ అధికారులు
ద్వారకాతిరుమల: ప్రభుత్వ పోరంబోకు భూమి కబ్జా వ్యవహారంపై టీడీపీ నేతలు దొంగాట ఆడుతున్నారు. భూకబ్జా నువ్వే చేశావంటే.. కాదు నువ్వే చేశావంటూ ఆరోపణలు చేసుకుంటున్నా రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా రు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండ లం తిమ్మాపురంలోని ఆర్‌ఎస్ నం.220లో 9 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిని టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని కబ్జా చేశారని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు తూంపాటి పద్మవరప్ర సాద్ ఆరోపించారు. భూమిలో చేపల చెరువు తవ్వతున్నారని అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై ‘సాక్షి’లో గురువారం ‘ఈ భూ కబ్జాను అడ్డుకునేదెవరూ?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో శ్రీనివాసరావు వర్గీయులు అసలు కబ్జాదారుడు పద్మవరప్రసాదే అంటూ ఆరోపణాస్త్రాలను సంధిస్తున్నారు. వరప్రసాద్ తన తల్లి సత్యవతి పేరున ఈ ఏడాది అక్టోబర్‌లో వివాదాస్పద భూమి తనదేనంటూ రెవెన్యూ అధికారులు, కలెక్టర్‌కు పెట్టిన అర్జీ పత్రాన్ని శ్రీనివాసరావు వర్గీయులు బహిర్గతం చేశారు. హైకోర్టులో సైతం దీనిపై కేసు వేశారని చెబుతున్నారు. శ్రీనివాసరావు కబ్జా చేశారని చెబుతున్న అదే భూమి తనదంటూ వరప్రసాద్ తల్లి సత్యవతి పేరున అర్జీ ఎలా పెట్టారని ప్రశ్నిస్తున్నారు. ఆర్‌ఎస్ నం.220లోని 11 ఎకరాల భూమిలో 5 ఎకరాల భూమిని దశాబ్దాల క్రితం శ్రీనివాసరావు ఒక ఎక్స్ సర్వీస్‌మెన్ నుంచి కొనుగోలు చేశారని, భూమిలో కొంత దారులకు పోగా, మిగిలిన భూమిని వరప్రసాద్ కబ్జా చేశారని ఆరోపిస్తున్నారు. ఏదిఏమైనా వీరి గొడవల కారణం ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం బయటపడిందని స్థానికులు అంటున్నారు.
వివాదాస్పద భూమి తనదేనంటూ వరప్రసాద్ తల్లి సత్యవతి పెట్టిన అర్జీ


