మన్యం బంద్ ప్రశాంతం
బుట్టాయగూడెం: గిరిజన నిరుద్యోగులకు ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని కోరుతూ గిరిజన సంఘాల పిలుపు మేరకు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో శుక్రవారం మన్యం బంద్ ప్రశాంతంగా జరిగింది. ఉద యం నుంచే గిరిజన సంఘాల నాయకులు బంద్ లో పాల్గొన్నారు. దుకాణాలు, పాఠశాలలు, ప్రభు త్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బుట్టాయగూ డెం బస్టాప్ సెంటర్‌లో బైటాయించిన ఏపీ గిరిజన సంఘం నాయకులు తెల్లం రామకృష్ట, మొడియం నాగమణి, పోలోజు నాగేశ్వరరావు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు జీఓ 3కి ప్రత్యామ్నాయంగా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ వల్ల గిరిజన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. జీలుగుమిల్లి మండలంలో బంద్ విజయవంతమైంది.
వేలేరుపాడులో..
వేలేరుపాడు: వేలేరుపాడులో బంద్‌ను గిరిజన సంఘాలు ప్రశాంతంగా నిర్వహించాయి. తొలుత వేలేరుపాడు నుంచి భూదేవిపేట వరకు బైక్ ర్యాలీ జరిగింది. అనంతరం అంబేడ్కర్ సెంటర్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మడివి దుర్గారావు అధ్యక్షతన సభ జరిగింది. గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కారం దారయ్య, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ధర్ముల రమేష్, ఏఎస్‌పీ మండల అధ్యక్షులు ఊకె ముత్యాలరావు మాట్లాడు తూ షెడ్యూల్ ఏరియా ఆదివాసీ ప్రాంతంలో 100 శాతం రిజర్వేషన్ నియామక చట్టం చేయాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు కారం వెంకట్రావు, కరటం ప్రకాష్, గిరిజన సమైక్య జిల్లా నాయకులు పిట్టా వీరయ్య, బంధం అర్జున్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు సొడే సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.
కుక్కునూరులో..
కుక్కునూరు: కుక్కునూరు మండలంలో బంద్ ప్రశాంతంగా ముగిసింది. హోటళ్లు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. గిరిజన సంఘం నాయకులు శ్యామల లక్ష్మణ్‌రావు, సీఐటీయూ నాయకులు యర్నం సాయికిరణ్, వలీపాషా బంద్‌లో పాల్గొన్నారు.
పోలవరంలో..
పోలవరం రూరల్: ప్రత్యేక డీఎస్సీ కోసం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఆదివాసీ యువతకు న్యాయం చేయాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మన్యం బంద్‌లో భాగంగా ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోలవరం ఏటిగట్టు సెంటర్ వద్ద మానవహారం చేపట్టి నిరసన తెలిపారు. మెగా డీఎస్సీలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,035 పోస్టులకు ఎస్టీలకు కేవలం 61 మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు బొరగం భూచంద్రరావు, నాయకులు యం.చలపతి, జి.పాండవులు, కె.పోసిరత్నం తదితరులు పాల్గొన్నారు.


