భూసేకరణ పూర్తి చేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో జాతీయ రహదారి భూసేకరణ పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేసి, భూ యజమానులకు వెంటనే పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమ వారం జిల్లాలో 365 బిజి (గ్రీన్ ఫీల్డ్ హైవే), 165 జాతీయ రహదారుల నిర్మాణ, భూసేకరణ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారులకు భూములు అందించిన వారికి వెంటనే పరిహారం అందించి, భూములు స్వాధీనం చేసుకుని రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలన్నారు.
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలందరూ వడదెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ హాలులో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎంహెచ్‌ఓ ఆర్.మాలిని, డీసీహెచ్‌ఎస్ డా.పాల్ సతీష్ కుమార్‌తో కలెక్టర్ సమీక్షించారు. వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన పరచాలన్నారు.


