పేదోడిపై ప్రతాపం.. బడాబాబులపై కనికరం
ఉండి: ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటే ఎవరైనా ఉపేక్షించం అంటూ ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అయితే సామాన్యులు, పేదలు ఏళ్ల తరబడి ఉంటున్న ఇళ్లను కూలగొట్టి వారిని రోడ్డున పడేశారు. వారికి ప్రత్యామ్నాయాలు చూపకుండా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. అయితే బడాబాబులు, అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్న స్థలాల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. పొట్టకూటికోసం రోడ్ల పక్కన చిన్న బడ్డీ కొట్లు, రేకులతో తాత్కాలికంగా షెడ్లు నిర్మించుకున్న వారిపై, రోడ్ల పక్కన చేపలు, మాంసం దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారిపై ప్రతాపం చూపించారు. ఆకివీడు, పాలకోడేరు మండలాల్లో నిరుపేదల ఇళ్లను కూలగొట్టారు. పరీక్షల సమయం దయచేసి కరెంటు ఇవ్వండి.. తరువాత ఏదో చోటికి వెళ్ళిపోతాం అని విద్యార్థులు వేడుకున్నా కనికరించలేదు. నిరుపేదలు, చిరువ్యాపారులపై ప్రతాపం చూపించిన అధికారులు బడాబాబులు ప్రభుత్వ స్థలాలు, పంటబోదెలు ఆక్రమించుకున్నా అవి ఆక్రమణలు కావు అన్నట్లు కన్నెత్తి కూడా చూడటం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇవన్నీ ఆక్రమణలు కావా ?
ఉండి గణపవరం రోడ్డులో పంటబోదెను ఆక్రమించుకుని భారీ షెడ్డు నిర్మించగా.. పక్కనే ఉన్న ఓ రొయ్యల ఫ్యాక్టరీ యజమాని పంటబోదెను ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసినా, మద్యం దుకాణం ఏర్పాటు చేసి బోదె ఆక్రమించుకున్నా గానీ అధికారులకు కనిపించడం లేదు. బడాబాబులపై ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తున్నారని విమర్శిస్తున్నారు. భారీ ఆక్రమణలకు ఎదురుగా కాలువ పక్కగా కొంతకాలం క్రితం పూరిపాకలు నిర్మించు కుని జీవిస్తున్న కొందరి ఇళ్ళను పీకి పారేశారు. ఎదురుగా ఉన్న భారీ ఆక్రమణలు మాత్రం కనిపించలేదా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత వేసవి ఎండల్లో చేసేది లేక చిరువ్యాపారులు ఎండల్లోనే పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు.
రోడ్ల వెంట చిరు వ్యాపారులు, పేదల షెడ్ల తొలగింపు
పంట బోదెలు ఆక్రమించుకున్న పెద్దలపై మెతక వైఖరి
పేదోడిపై ప్రతాపం.. బడాబాబులపై కనికరం
పేదోడిపై ప్రతాపం.. బడాబాబులపై కనికరం


