
పెదవాగు బాధితులకు న్యాయం చేయాలి
ఏలూరు (టూటౌన్) : గత ఏడాది గుమ్మడిపల్లి పెదవాగు ప్రాజెక్టుకు గండిపడటంతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం స్పందనలో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్బగా కమిటీ కార్యదర్శి ఎస్‌కె గౌస్ మాట్లాడుతూ వేలేరు పాడు, కుకునూరు మండలాల్లోని 50 గ్రామాలలో పంట భూముల్లో ఇసుక మేటలు వేసి, గండ్లు పడ్డాయని అన్నారు. నష్టపోయిన ప్రజలకు ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అనేక సార్లు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్య పరిస్కారం కాలేదన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి 50 గ్రామాలలో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. అల్లూరి నగర్ పంపుహౌస్ లో ఉన్న నీటిని మోటార్లతో మేడేపల్లి, రామవరం గ్రామ పంచాయతీ గ్రామాలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల నాయకులు సిరికొండ రామారావు, కట్టాం వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.