పాశ్చాత్య దేశాల ‘ప్రాయశ్చిత్తం’ | Sakshi Editorial On Western countries about Gaza | Sakshi
Sakshi News home page

పాశ్చాత్య దేశాల ‘ప్రాయశ్చిత్తం’

May 29 2025 12:57 AM | Updated on May 29 2025 12:58 AM

Sakshi Editorial On Western countries about Gaza

గాజాలో కళ్లముందు 19 నెలలుగా మారణహోమం సాగుతున్నా గుడ్లప్పగించి చూసిన పాశ్చాత్య దేశాలు ఇప్పటికి తెలివి తెచ్చుకున్నాయి. ఇజ్రాయెల్‌ సాగిస్తున్న ఊచకోత ‘నైతికంగా సమర్థించ లేనిది, పూర్తిగా అసమతౌల్యమైనద’ంటూ కొత్త రాగం అందుకున్నాయి. మొదట బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు ఇజ్రాయెల్‌ తీరును వ్యతిరేకిస్తూ ప్రకటన చేయగా, కాస్త ఆలస్యంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ), జర్మనీ శ్రుతి కలపడం కొత్త పరిణామం. 

ఇన్నాళ్ల పాపానికిది ప్రాయశ్చిత్తం అనుకోవచ్చా? అనుమానమే. గాజాలో ఏణ్ణర్ధం నుంచి అదే పనిగా బాంబుల వర్షం కురి పిస్తూ వేలాదిమంది ప్రజలనూ... వారికి తిండి నీళ్లూ ఇచ్చేందుకూ, చికిత్స అందించేందుకూ వచ్చినవారిని సైతం హతమారుస్తుంటే ఈ దేశాల్లో ఎవరికీ నోరు పెగల్లేదు. ఇప్పటికీ వాటి  వైఖరి పెద్దగా మారినట్టు కాదు. ఎందుకంటే... ఊచకోత సమర్థనీయం కాదంటూనే ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉన్నదని ఎప్పటిలా మర్కట తర్కానికి దిగుతున్నాయి. 

2023 అక్టోబర్‌ 7న పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు ప్రారంభించింది మొదలు పాశ్చాత్య దేశాలు ఈ వాదనే చేస్తున్నాయి. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొచ్చుకెళ్లి 1,200 మంది ఇజ్రాయెల్‌ పౌరుల్ని కాల్చిచంపి, 251 మందిని అపహరించుకు వెళ్లినప్పటి నుంచీ ఇజ్రాయెల్‌ ప్రతీకారం మొదలైంది. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి దేశానికీ వుంటుంది. 

కానీ దానికుండే పరిమితి మాటే మిటి? ఎన్ని నెలలపాటు బాంబుల వర్షం కురిపిస్తే... ఎన్ని వేలమందిని చంపితే ఆత్మరక్షణ చేకూరు తుంది? 2,000 పౌండ్ల (907 కిలోల) బంకర్‌ బస్టర్‌ బాంబులు ఒక చిన్న ప్రాంతమైన గాజాపై ప్రయోగిస్తుంటే, ఆ దాడుల్లో వేలాదిమంది అమాయక పౌరులూ, ముఖ్యంగా పిల్లలూ, స్త్రీలూ చని పోతుంటే ఎవరూ మాట్లాడలేదు. 

ఇజ్రాయెల్‌ దళాలు మూడు నెలలుగా గాజాను పూర్తిగా దిగ్బంధించి అక్కడికి అంతర్జాతీయ సహాయ బృందాలు అడుగుపెట్టకుండా పహారా కాస్తున్నాయి. తామే ఆ సాయాన్ని అందిస్తామంటూ అమెరికా, ఇజ్రాయెల్‌ ప్రకటించాయి. అదెంత బూటకమో తరచూ మీడియాలో వస్తున్న కథనాలే చెబుతున్నాయి. రోజుల తరబడి ఆహారం, మంచినీరూ లభించక వేలాదిమంది మృత్యుముఖంలో వున్నారని ఆ కథనాలు వివరిస్తున్నాయి. 

ఆకలికి తాళలేక వాహ నాల వెంబడి పరుగులు తీస్తున్నవారిని కూడా నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన ఉదంతాలు వెలుగులో కొచ్చాయి. చివరకు అమెరికా–ఇజ్రాయెల్‌ సహాయ బృందాలను పర్యవేక్షించే చీఫ్‌ జేక్‌ ఉడ్‌ ఆ బాధ్య తల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ బృందాల సాయమంతా కూడా ఇజ్రాయెల్‌ అధీనంలోని దక్షిణ గాజాలో నాలుగు శిబిరాల ద్వారా  మాత్రమే అందుతోంది. సాయం కావాల్సిన వాళ్లు కిలోమీటర్ల దూరం నడిచిపోవాల్సి వస్తోంది. ఉత్తర గాజాకు ఆ మాత్రం సాయం కూడా లేదు.

నదురూ బెదురూ లేకుండా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న మారణకాండపై సంపన్న రాజ్యాలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాయి? ఒక నెత్తుటి హోమానికి తాము మౌన సాక్షులుగా మిగిలిపోయా మన్న నింద పడకూడదని, తమ చేతులు కూడా నెత్తుట తడిశాయని చరిత్రలో నమోదు కారాదని అవి తహతహలాడుతున్నాయి. ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్‌కు ఎడాపెడా సైనిక సామగ్రి తరలించినవే. కోట్లాది డాలర్లు కుమ్మరించినవే. భద్రతా మండలిలో దాన్ని సమర్థించినవే. 

ఇప్పుడు బ్రిటన్‌ ఇజ్రాయెల్‌పై ఆంక్షలు విధిస్తామని ప్రకటించింది. కొనసాగుతున్న వాణిజ్య చర్చలను నిలుపుదల చేసింది. పాలస్తీనా ఏర్పాటు అంశంపై వచ్చే నెలలో సౌదీ అరేబియాతో కలిసి సదస్సు నిర్వహించ నున్నట్టు ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఇవి నిజానికి కంటి తుడుపు చర్యలు. కానీ ఈమాత్రం చర్యలు కూడా సమ్మతం కాదంటోంది ఇజ్రాయెల్‌. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడాలు పరోక్షంగా హమాస్‌ బలపడేందుకు దోహదపడుతున్నాయని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఆరోపించారు. 

ఇప్పటికి 594 రోజులుగా ఏకపక్షంగా ఇజ్రాయెల్‌ సాగిస్తున్న నరమేథానికి ఇంతవరకూ 61,700 మంది మరణించగా, అందులో 20,000 మంది పసివాళ్లని అంచనా వేస్తున్నారు. శిథిలాల కింద కన్నుమూసిన వారెందరో ఇంకా తెలియలేదు. వేలాదిమంది పిల్లలు అనాథలుగా మిగిలిపోగా, మరిన్ని వేలమంది పిల్లలు కాళ్లూ చేతులూ పోగొట్టుకుని వైద్యసాయం సక్రమంగా అందక రోదిస్తున్నారు. 

ఈ మారణహోమానికి ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. రోజుల తరబడి ధర్నాలు సాగాయి. పాశ్చాత్య దేశాల్లో పాలస్తీనా ప్రధాన చర్చనీయాంశమైంది. కానీ ఇవేవీ ఇజ్రా యెల్‌నుగానీ, దానికి అండగా వుంటున్న సంపన్న రాజ్యాల పోకడలనుగానీ మార్చలేకపోయాయి. ఇజ్రాయెల్‌ వాణిజ్యంలో మూడోవంతు వాటా యూరప్‌ దేశాలదే. 

ఆ దేశాలు తల్చుకుంటే, చిత్త శుద్ధితో ఆంక్షలు అమలు చేస్తే ఇజ్రాయెల్‌ మనుగడ ఇబ్బందుల్లో పడుతుంది. మొదటి నుంచీ అండగా ఉంటున్న అమెరికా ఆ దేశాలతో చేతులు కలిపితే దాని పరిస్థితి మరింత దిగజారుతుంది. కనీసం అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఆదేశాలను పాటిస్తే ఇజ్రాయెల్‌కు ఊపిరాడదు. 

కానీ అవి నిజంగా అంత పని చేస్తాయా? అసలు ఇజ్రాయెల్‌లోనే నెతన్యాహూపై తీవ్ర వ్యతిరేకత బయల్దేరింది. ఇప్పుడు ఆయన్ను సమర్థించేవారు 25 శాతం మించరని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ను ఏమాత్రం తక్కువ చేసినా అది ఇరాన్‌కు బలం చేకూరుస్తుందన్న భయం పాశ్చాత్య దేశాలకుంది. 

ఆ దేశాల్లో రెండో ప్రపంచ యుద్ధానంతర రాజకీయాలన్నీ ఇజ్రాయెల్‌తో ముడిపడి వున్నాయి. దాన్ని తెంచుకోవటమంటే ఒక కొత్త ఒరవడికి తెరతీయడమే. అంత సాహసం చేయలేక కంటితుడుపు చర్యలు ప్రకటించాయి. కానీ ఇప్పటికే సమయం మించిందని ఆ దేశాలు గ్రహిస్తే మంచిది. 

Advertisement
 
Advertisement
Advertisement