‘ఫిఫా’కు అమెరికా గండం! | Sakshi Editorial On USA Effect To FIFA | Sakshi
Sakshi News home page

‘ఫిఫా’కు అమెరికా గండం!

Jun 11 2026 12:46 AM | Updated on Jun 11 2026 12:46 AM

Sakshi Editorial On USA Effect To FIFA

మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్త సాకర్‌ అభిమానులను 39 రోజులపాటు ఊగించి, శాసించే క్రీడా సంరంభం మొదలుకాబోతోంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సంఘాల సమాఖ్య(ఫిఫా) నేతృత్వంలో గురువారం అర్ధరాత్రి 12.30 దాటాక (భారత కాలమానం ప్రకారం చెప్పాలంటే శుక్రవారం) ప్రపంచ ప్రసిద్ధ మెక్సికో సిటీ స్టేడియం(ఎస్టాడియో అజకా) వేదికగా మెక్సికో–దక్షిణాఫ్రికా జట్ల మధ్య సాగే తొలి పోరుతో ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. 96 యేళ్ల వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఇలా మూడు దేశాల్లో ఈవెంట్లు నిర్వహించటం ఇదే తొలిసారి. అమెరికా, కెనడా, మెక్సికో ‘ఐక్యంగా, ఒక్కటిగా’ నినాదంతో కలిసికట్టుగా బిడ్‌ వేసి గెల్చుకున్నాయి. ఈసారి జట్ల సంఖ్య 32 నుంచి 48కి పెరగటంతో 104 మ్యాచ్‌లు జరుపుతున్నారు. వీటన్నిటినీ ఈ మూడు దేశాల్లోని 16 నగరాల్లో నిర్వహించనుండగా, ఇందులో 78 మ్యాచ్‌లు, కీలక ఈవెంట్లు తమ దగ్గరే ఉండేలా అమెరికా చూసుకుంది. మెక్సికో, కెనడా చెరి 13 నిర్వహిస్తాయి.

‘క్రీడలు ప్రపంచాన్ని ఏకం చేస్తాయి... దేశాల మధ్య సరిహద్దులు చెరిపేస్తాయి’ అని క్రీడల నిర్వాహకులు తరచు చెప్పేదంతా బడాయి తప్ప నిజం కాదని మళ్లీ  రుజువైంది. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడ’న్నట్టు ఈమధ్య శ్వేతజాతి దురహంకారాన్ని ఒళ్లంతా పులుముకుంటున్న అమెరికా, అతిగా వ్యవహరిస్తూ ఈ సంరంభాన్ని నీరుగార్చే పోకడ లకు పోతోంది. ఫిఫా రిఫరీ, సోమాలియా క్రీడాకారుడు ఒమర్‌ అర్టన్‌ ఈ సంరంభం కోసం మయామీలో దిగిన వెంటనే ఆయన్ను వెనక్కి పంపింది. ఒమర్‌కు దౌత్య వీసా కూడా ఉంది. అతను ‘జాతీయ భద్రత’కు ముప్పు తెస్తాడంటోంది అమెరికా. ఇరాన్‌ బృందానికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అరిజోనాలో శిక్షణ మ్యాచ్‌లు నిర్వహించుకోవాల్సిన ఆ బృందం ఈ కారణంగా మెక్సికోకు మార్చుకోవాల్సి వచ్చింది. మ్యాచ్‌ జరిగే రోజున వచ్చి వెనుదిరగాలట! ఇలాంటి ఆంక్షలు సహజంగానే ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. 

అమెరికా ఉన్మాదం అక్కడితో ఆగలేదు. మ్యాచ్‌లలో ఇరాన్‌ అభిమానులుగా వచ్చే వారికి సైతం వీసాలు ఎగ్గొట్టింది. షికాగో విమానాశ్రయంలో దిగిన ఇరాక్‌ బృందం వైస్‌ కెప్టెన్‌ ఆయమాన్‌ హుస్సేనీని నిర్బంధించి, ఏడుగంటలపాటు ప్రశ్నలతో వేధించి, సోదాలు జరిపి విడిచిపెట్టింది. ఆయనతో వచ్చిన బృందం ఫొటోగ్రాఫర్‌ని వెనక్కి పంపింది. సెనెగల్, మొరాకో, ఉజ్బెకిస్తాన్‌ బృందాల్ని దుస్తులు విప్పించి నేరగాళ్ల మాదిరిగా పరిగణించారు. 90 మంది మొరాకో అభిమానులకూ ఈ ‘మర్యాదే’ ఎదురైంది. వారి రాకపై సందేహాలున్నాయట! దక్షిణాఫ్రికా బృందం వీసాల కోసం దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా ఇంతవరకూ తేల్చలేదు. ఇప్పటికే అమెరికాలో హోటల్‌ గదులు రిజర్వ్‌ చేయించుకోవటంతో పలువురికి లక్షల డాలర్లు వృథా అయ్యాయి.

చిత్రమేమంటే... ఈ క్రీడాకారులూ, వారి అభిమానుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా నేరచరిత్ర లేదు. నిజానికి ఉగ్రవాదమంటే వణికే అమెరికా ఈ దేశాలన్నిటిపైనా పలు సందర్భాల్లో దురాక్రమణలకు దిగింది. వాటిని వల్లకాళ్లుగా మార్చింది. అధినేతలను కాల్చిచంపింది. దీన్ని ఏమనాలి? చేసిందంతా చేసి దొంగే ‘దొంగ... దొంగ’ అని అరిచి నట్టు ఇప్పుడీ వికృత చర్యలేమిటి? విషాదమేమంటే ఇదంతా చూస్తూ కూడా ఫిఫా నోరుమూసుకుని కూర్చోవటం! అమెరికాలో ఫిఫా ఈవెంట్లు జరిగితే సమస్యలొస్తాయే మోనని 2017లో ఒక సందర్భంలో ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్‌ఫాంటినోను అడిగితే... ‘ఫిఫా ఏం చెప్తే అదే చెల్లుతుంది. 

అమెరికా మొండికేస్తే అక్కడ వేడుకలు రద్దవుతాయి’ అని గంభీరంగా చెప్పారు. ఇప్పుడు వీసా నిరాకరణలూ, వేధింపులూ ఆతిథ్యం ఇచ్చే దేశానికి సంబంధించినవని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకీ పిరికితనం? 2013లో బ్రెజిల్‌నూ, 2022లో ఖతార్‌నూ వరల్డ్‌ కప్‌ ఈవెంట్‌లు రద్దవుతాయని బెదిరించి, ప్రత్యేక చట్టాలు చేయించినప్పుడు ఈ ‘విశాల హృదయం’ ఎటుపోయింది? దక్షిణార్ధగోళ దేశాలంటే చులకనా? అప్పట్లో ఖతార్‌లో స్వేచ్ఛ లేదంటూ నోళ్లు నొక్కుకుని నిరసన తెలిపిన జర్మనీ ఆటగాళ్లు ఈసారి అమెరికాలో ఆ సాహసం చేయగలరా? కడివెడు పాలల్లో విషపు చుక్కలా ఉన్న అమెరికా తీరుపై కళ్లుమూసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి ఈవెంట్లపై అందరిలోనూ ఆసక్తిపోతుందని ఫిఫా గుర్తించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement