మాటల వెనుక మూటలున్నాయ్‌!

Sakshi Editorial On Social Media Influencer Marketing

ఏం కొనాలి? ఎక్కడ తినాలి? ఎందులో డబ్బులు పెట్టాలి? పెరిగిన సోషల్‌ మీడియా పుణ్యమా అని కంపెనీల నుంచి కాసుల కోసమో, కానుకల కోసమో ఇవన్నీ చెబుతున్న అపర డిజిటల్‌ ఆర్థిక మేధావులకు ఇక కళ్ళెం పడనుంది. సామాన్యుల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తున్న సోషల్‌ మీడియా ప్రజాభిప్రాయ పరికల్పకులకు సర్కార్‌ మార్గదర్శకాలు ప్రకటించింది. అమాయకులను తప్పుదోవ పట్టిస్తున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడానికీ, సోషల్‌ మీడియా ప్రభావిత మార్కెట్‌ విస్తరిస్తున్న వేళ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికీ ఇది మరో ముందడుగు.

సోషల్‌ మీడియా ప్రభావశీలురలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో తమకున్న అనుచరగణమే పెట్టు బడిగా, సంస్థల నుంచి భారీ రుసుము తీసుకుంటూ, అడ్డమైనవాటినీ కొనుక్కోమని సిఫార్సులు చేస్తున్నారు. రోజువారీ వినియోగ వస్తువుల నుంచి క్రిప్టోకరెన్సీలు, నాన్‌–ఫంగిబుల్‌ టోకెన్లు, క్రిప్టో డిపాజిట్ల దాకా అన్నిటికీ ఈ జాడ్యం సోకింది. వారికి పోయేదేమీ లేదు కానీ, వారి మాట నమ్మి డబ్బులు పెట్టిన అమాయకులకే నష్టం. అందుకే, ఎలాంటి కానుకలు, హోటల్‌ బసలు, ఈక్విటీలు, రాయితీలు, అవార్డులందుకొని ఈ ఉత్పత్తులు, సేవలు, పథకాలను సిఫార్సు చేస్తున్నదీ ఈ మిడి మేలపు మేధావులు వెల్లడించాలని సర్కారు షరతు పెట్టింది. ఈ చర్య సహేతుకం, స్వాగతనీయం.

ఇవాళ ప్రపంచమంతా స్థానిక నుంచి బహుళజాతి సంస్థల వరకు అన్నీ తమ బ్రాండ్లు, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లను చురుకుగా వాడడం తాజా ధోరణి. సదరు వ్యక్తుల అడ్డగోలు సమర్థనలు, మరీ ముఖ్యంగా ఆర్థిక ఉత్పత్తులు, మదుపులకు సంబంధించినవి బాగా పెరిగాయి. వీటికి సర్కార్‌ పగ్గాలు వేయనున్నట్టు గత సెప్టెంబర్‌ నుంచి వార్తలొస్తూనే ఉన్నాయి. ఈ జనవరి 20న అవి నిజమయ్యాయి. సోషల్‌ మీడియాలో వివిధ ఉత్పత్తుల్ని సమర్థిస్తూ ప్రకటనలిస్తున్నప్పుడు ప్రముఖులు, ప్రభావశీలురు, వర్చ్యువల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు (అవ తార్‌ లాంటి కంప్యూటర్‌ పాత్రలు) ఎలాంటి విధివిధానాల్ని పాటించాలనేది సర్కార్‌ తేల్చేసింది.

నిరుడు రూ. 1275 కోట్లున్న సోషల్‌ మీడియా ప్రభావశీలుర విపణి ఏటా 20 శాతం వంతున పెరగనుంది. 2025 నాటికి అది రూ. 2800 కోట్లకు ఎగబాకుతుందని తాజా అంచనా. అందుకే, సోషల్‌ మీడియాను సందుగా చేసుకొన్న నవతరం ప్రసిద్ధులు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి మార్గదర్శకాలు పెట్టడం మంచి పని. ఈ పండితమ్మన్యులు సదరు ఉత్పత్తుల్ని వాడకుండానే, స్వీయ లబ్ధికై వాటిని ప్రోత్సహిస్తున్నారని తెలుసుకోక సామాన్యులు ఉచ్చులో పడిపోవడం సహజం. ఇప్పుడు సదరు బ్రాండ్లతో తమకున్న బంధాన్ని ఇన్‌ఫ్లుయెన్సర్లు సామాన్య భాషలో, ఫోటోలతో సహా ఎలా బయటపెట్టాలో నిర్దేశించారు. అవి జనం దృష్టిని తప్పించుకోలేవన్నది లాభం. ఈ సరి కొత్త పారదర్శకతతో, తుది కొనుగోలు నిర్ణయం వినియోగదారుల విచక్షణకు వదిలేసినట్టవుతుంది.

స్వీయ నియంత్రణ సంస్థ అయిన అడ్వరై్టజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 2021లోనే పెయిడ్‌ ప్రమోషన్‌ను స్పష్టంగా పేర్కొనాలంది. కానీ, ఆ సంస్థ వద్దకు వస్తున్న ఉల్లంఘనల్లో మూడో వంతు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్లవే. సోషల్‌ మీడియాతో ఎవరైనా రాత్రికి రాత్రి ఫేమసవుతున్న వేళ పెరుగుతున్న తప్పుడు ప్రకటనలపై కొరడా తీస్తూ, వినియోగదారుల వ్యవహారాల విభాగం పక్షాన ఈ తాజా నిబంధనలు వచ్చాయి. వీటిని ఉల్లంఘిస్తే, వినియోగదారుల పరిరక్షణ చట్టం– 2019 కింద జరిమానా తప్పదు. అది కాక ఉత్పత్తిదారులు, ప్రకటనకర్తలు, సమర్థకులకు రూ. 10 లక్షల దాకా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ జుల్మానా వేస్తుంది. మళ్ళీ తప్పు చేస్తే, 50 లక్షలు. తప్పుదోవ పట్టిస్తూ ఒక ఉత్పత్తిని సమర్థిస్తే, ఏడాది పాటు ఆ వ్యక్తిపై నిషేధం. మరోసారి గీత దాటితే, ఆ వేటును మూడేళ్ళు పొడిగించవచ్చు.

యూ ట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాలలో కంటికి నదురుగా కనిపిస్తూ, మాటలతో బుట్టలో వేసే ప్రభావశీలురకు చేతిలో పైసలు, సమాజంలో ప్రాచుర్యం, సక్సెస్‌లకు కొదవ ఉండదు. కానీ, ఫలానా ఉత్పత్తిని సమర్థించడానికీ, సిఫార్సు చేయడానికీ వారికి ఉన్న అర్హత, అపరిమిత జ్ఞానం ఏమిటంటే ప్రశ్నార్థకమే. ఒకప్పుడు ప్రభావశీలురంటే– అనుభవం గడించి, ఆలోచనల్ని ఆచరణలో పెట్టిన మేధావులు, సామాజిక కార్యకర్తలు, పరిణామ చోదకులు. వారి మాటకెంతో విలువ. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియాలో లైకులు, షేర్లు చేసే అనుచరులు కనీసం లక్ష మంది ఉన్న కాలేజీ కుర్ర కారు, చదువులో డింకీ కొట్టినవాళ్ళూ ఇన్‌ఫ్లుయెన్సర్లే. పుస్తకాలు, సిన్మాలు, ఉత్పత్తుల రివ్యూల నుంచి ఆర్థికసలహాల దాకా ఎవరైనా, ఏదైనా చెప్పచ్చు. లేని మేధావితనం చూపచ్చు. అదే పెద్ద చిక్కు.

చేతిలో స్మార్ట్‌ఫోన్లు, చేతి నిండా ఇంటర్నెట్‌తో డబ్బులెలా మదుపు చేయాలన్న ఆర్థిక పరిజ్ఞానం కోసం సాధారణంగా యువతరం సోషల్‌ మీడియా వేదికలను ఆశ్రయిస్తోంది. మదుపరుల్లో చైతన్యం పెంచే అధికారిక సెమినార్లు, వ్యాసాల కన్నా ఆకర్షణీయంగా ఈ వేదికలు సమాచారాన్ని అందించడమే అందుకు ప్రధాన కారణం. 25 లక్షల మంది కంటెంట్‌ క్రియేటర్లున్న మార్కెట్‌లో నూటికి 60 సంస్థలు దీన్ని ఆసరాగా చేసుకొని ఎదుగుతున్నాయట. అందుకే, జనం తేలిగ్గా మోసపోకుండా ఉండాలంటే, ఇన్‌ఫ్లుయెన్సర్లకు మార్గదర్శకాలిస్తే చాలదు. మదుపరుల్ని ఆర్థిక విద్యావంతుల్ని చేసి, పరిజ్ఞానంతో పాటు చైతన్యం పెంచే ప్రణాళికలను చేపట్టాలి. ప్రముఖులెవరో చెప్పారు కదా అని అడ్డమైన మాటల్నీ అతిగా నమ్మితే అసలుకే మోసమని అందరూ గ్రహించాలి. ఎందుకంటే, ఒక ప్రకటనలో ఓ పెద్దమనిషి నిత్యం చెబుతున్నట్టు డబ్బులు ఎవరికీ ఊరికే రావు! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top