26 రోజుల్లోనే మనసు మార్చుకున్న రజనీకాంత్‌

Sakshi Editorial On Rajinikanth Cancels Political Plans

కొమ్ములు తిరిగిన నాయకులు సైతం ఎందుకొచ్చిన రాజకీయాలు అనుకునే ఏడు పదుల వయసులో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్టు ఈనెల 3న హఠాత్తుగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 26 రోజుల్లోనే మనసు మార్చుకున్నారు. రాజకీయాల్లోకి రావటంగానీ, పార్టీ స్థాపించే ఆలోచనగానీ ఇక లేదని మంగళవారం తేల్చిచెప్పారు.  హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌ తర్వాత అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఈ మధ్యే డిశ్చార్జి అయినందువల్ల పార్టీ ఆవిర్భావం తేదీని ముందనుకున్నట్టు ఈ నెల 31న ప్రకటించకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఏకంగా పార్టీ ప్రసక్తే లేదని చెప్పటం అభిమానుల్ని నిరాశానిస్పృహల్లో ముంచెత్తింది. రాకపోవడానికి గల కారణాల గురించి రజనీకాంత్‌ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. అది ఆయన పడిన అంతస్సంఘర్షణకు అద్దం పడుతోంది.

తాను అస్వస్థుణ్ణి కావటం ఆయన ‘దైవలీల’ అన్నారు. వైద్యులు, శ్రేయోభిలాషులు వద్దన్నా వినకుండా హైదరాబాద్‌కు షూటింగ్‌కని వెళ్తే అక్కడ అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకున్నా నలుగురికి కరోనా సోకడం, ఆతర్వాత తనకు హైబీపీ రావటం ఇవన్నీ దేవుడి హెచ్చరికలుగా ఆయన పరిగణించారు. ఎన్నో జాగ్రత్తలమధ్య 120మంది వున్నచోటే కరోనా వస్తే రాష్ట్రమంతా తిరగటం, వేలాదిమందితో ర్యాలీల్లో పాల్గొనటం కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న తనకూ, తన కోసం రాజకీయాల్లోకి దిగేవారికీ  ఎంత ప్రమాదకరమో అంచనా వేసుకున్నారు. వీటన్నిటినీ బేఖాతరు చేసి ఇచ్చిన మాట నిలుపుకోవటం కోసమంటూ రాజకీయాల్లోకి దిగడమంటే తనను నమ్ముకున్నవారిని బలిపశువుల్ని చేయటమే అవుతుందన్నదే ఆయన ఆలోచన. అటు వైద్యుల హెచ్చరిక, ఇటు ఇంట్లోవారి ఒత్తిళ్లు ఆయనలో అంతస్సంఘర్షణను ప్రేరేపించి తాజా నిర్ణయానికి దారి తీసివుండొచ్చునని కొందరి అంచనా.

రజనీకాంత్‌లో ఆధ్యాత్మిక చింతన మొదటినుంచీ ఎక్కువే. కొన్నేళ్లక్రితం రాజకీయాల్లోకి రాద ల్చుకున్నట్టు ప్రకటన చేసినప్పుడు తనవి ‘ఆధ్యాత్మిక రాజకీయాల’ని చెప్పారు. అంతకు చాన్నాళ్ల ముందు ఒకసారి ఆధ్యాత్మిక చింతనతో ఆయన హిమాలయాలకు వెళ్లొచ్చారు. ఒక సాధారణ వ్యక్తిగా చెన్నైకు వచ్చిన తనకు సినిమాల్లో నటించాలనే ఉద్దేశమే లేనప్పుడు అనుకోకుండా బాలచందర్‌ చిత్రంలో సహాయపాత్ర నటించే అవకాశం రావటం, అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎద గటం–వీటన్నిటి వెనకా ఆయన ఒక అతీత శక్తిని చూశారు. రాజకీయాల్లో సైతం అదేవిధంగా విజయం సాధిస్తానన్న నమ్మకం ఆయనకు ఏదో ఒకమూల వుండిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ప్పుడు ఒకసారి డీఎంకేకు, మరోసారి అన్నాడీఎంకేకు మద్దతు పలికి వారి విజయానికి దోహద పడ్డారు.

మధ్యమధ్యన ఊగిసలాటలు లేకపోలేదుగానీ, రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తిని పాతి కేళ్లుగా ప్రకటిస్తూనే వున్నారు. ఈసారి ఎంతో దృఢంగా ఆ మాట చెప్పినట్టు కనబడిన రజనీకాంత్‌ చివరకు మరోసారి కూడా వెనక్కి తగ్గారు. ఈ ఊగిసలాటలకు తన  అస్వస్థతే కారణమని ఆయన చెబుతున్నమాటను కొందరు విశ్వసించటం లేదు. ఆయన ప్రైవేటుగా చేయించుకున్న సర్వేలో రెండెంకెలకు మించి సీట్లు వచ్చే అవకాశం లేదని తేలటం వల్లే ఆయన ఈ నిర్ణయానికొచ్చివుండొచ్చు నని ఊహాగానాలు బయల్దేరాయి. వాటి సంగతలావుంచి తమిళనాడు ప్రస్తుత రాజకీయాలు అంత స్పష్టంగా లేవు. ఇప్పటికే అనేకానేక రాజకీయ పార్టీలతో కిక్కిరిసివున్న ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఒంటరిగా పోటీ చేయదల్చుకున్న మరో పార్టీకి స్థానం వుండటం అనుమానమే. అసెంబ్లీ ఎన్నికలు మరో నాలుగైదు నెలల్లో జరగాల్సివుంది. ఇంత తక్కువ వ్యవధిలో పార్టీని స్థాపించి, దాన్ని విజయవంతంగా అధికారంవైపు నడిపించటం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది.

పైగా రాజకీయాల్లో తలపడటం గురించి రజనీకాంత్‌కు కొన్ని విలక్షణమైన ఆలోచనలున్నాయి. తమిళనాట వ్యవస్థలు నాశనమయ్యాయని, ద్రవిడ పార్టీలే అందుకు కారణమని ఆయన నమ్మినా...అందుకు సంబంధించి ఎవరిపైనా విమర్శలు చేయదల్చుకోలేదని అన్నారని ఈమధ్యే ఆయన సన్నిహితుడు రాశారు. తప్పులు ఎత్తి చూపకపోతే ఎలా అని అడిగితే, ఆ తప్పులేమిటో ప్రజలందరికీ తెలుసు గనుక వాటిని ప్రస్తావించనవసరం లేదని జవాబిచ్చారట. తప్పొప్పుల సంగతి వదిలిపెట్టినా తన ప్రత్యర్థి పార్టీల విధివిధానాల గురించి తన అభిప్రాయాలు చెప్పటం, వారికి తానెట్లా భిన్నమో వివరించటం తప్పనిసరవుతుందని గ్రహించలేదని ఆయన మాటలు చూస్తే అర్థమవుతుంది. వర్తమాన రాజకీయ దుస్థితి చూసి ఆగ్రహం కలగటంతో రాజకీయాల్లోకి రావాలనిపించిందన్నది ఆయన చెప్పిన మాటే. ఎవరినీ శత్రువులుగా భావించనని రజనీ అనడం స్వాగతించదగ్గదే. అయితే ప్రత్యర్థులుగానైనా పరిగణించకపోతే, వారి విధానాల్లోని డొల్లతనాన్ని ఎత్తి చూపకపోతే ప్రజలకు అవగాహన కలిగేదెలా?

ఎవరి మాటెలావున్నా ఆయన ‘ఆధ్యాత్మిక రాజకీయాలు’ తమకు లాభిస్తాయని బీజేపీ బాగానే ఆశలు పెట్టుకుంది. అయిదు దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు కాస్తయినా చోటీయని తమిళనాట రజనీ రాకతో మారుతుందని అనుకుంది. ఈలోగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్వరం మారింది. ఆదివారంనాటి ర్యాలీలో ఆయన బీజేపీకి హెచ్చరికలాంటి ప్రకటన చేశారు. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా గుర్తిస్తేనే కూటమిలో కొనసాగనిస్తామని, అధికారం పంచుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఇప్పుడు అర్థాంతరంగా రజనీ వెనక్కి తగ్గారు గనుక ఈ సమీకరణాల్లో మార్పు తథ్యం. రజనీ వెనక్కు తగ్గటం ఎంతో కొంత డీఎంకేకు లాభించే పరిణామం. రాజకీయాల్లోకి రావడమైనా, రాకపోవటమైనా రజనీ వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించింది. తనకున్న సమస్యలరీత్యా పునరాలోచన తప్పలేదంటున్నారు గనుక ఆయన నిర్ణయాన్ని అందరూ గౌరవిం చాల్సిందే. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top