బాయ్‌కాట్‌ చేయాల్సింది ఇదీ! | Sakshi
Sakshi News home page

బాయ్‌కాట్‌ చేయాల్సింది ఇదీ!

Published Wed, Jan 25 2023 4:30 AM

Sakshi Editorial PM Modi On Boycott Bollywood

ఇది నిజంగా అసాధారణమే. ఒక జాతీయ పార్టీ కీలక సారథి, అందులోనూ ప్రధానమంత్రి హోదాలో దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి ఈ తరహా సూచన చేయడం మునుపెన్నడూ కనలేదు, వినలేదు. సినిమాల లాంటి అసంగతమైన వాటిపై అనవసర వ్యాఖ్యలు చేసి, మన కఠోరశ్రమపై నీలినీడలు కమ్ముకొనే పరిస్థితి తేవద్దని ప్రధాని నరేంద్ర మోదీ అధికార బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఇటీవల అన్నారన్న వార్త అందుకే ప్రధానమైనది. మోదీ వ్యాఖ్యలకు తాజా ప్రేరణ – షారుఖ్‌ ఖాన్‌ నటించిన తాజా హిందీ చిత్రం ‘పఠాన్‌’పై కొందరు బీజేపీ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు, వివాదాలు. ఒకపక్క సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ ప్రచారాలు, మరోపక్క సినీ ప్రముఖుల గత చరిత్రలు, సినిమాల్లో దుస్తులపై అత్యుత్సాహ రాజకీయ దుమారాలు కలసి కొన్నేళ్ళుగా హిందీ చిత్ర సీమ ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ మోదీ మాట ఒకింత ఊరట. 

ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంతో ఇచ్చినప్పటికీ ఆ స్థాయి వ్యక్తి ఇలాంటి సలహా ఇవ్వాల్సిన పరిస్థితి రావడం దేశంలో నెలకొన్న అసహన వాతావరణానికి అద్దం పడుతోంది. సోషల్‌ మీడియాలో హిందీ సినీ పరిశ్రమను కొన్నాళ్ళుగా వెంటాడుతున్న భూతం – బాయ్‌కాట్‌ ప్రచారం. విమర్శలు, ట్రోలింగ్‌ల నుంచి చివరకిది సంక్షోభం స్థాయికి వెళ్ళింది. ఆ మాటకొస్తే కొన్ని సినిమాలపై విద్వేష ప్రచారాలు, బాయ్‌కాట్‌ పిలుపులతో గడచిన 2022 ‘బాయ్‌కాట్‌ బాలీవుడ్‌’ నామ సంవత్సరంగా పాపులరైంది. చిత్రంగా బాయ్‌కాట్లేవీ జనంలో నుంచి తమకు తాము వచ్చి నవి కాదు. కొన్ని ట్విట్టర్‌ ఖాతాలు, వెబ్‌సైట్లు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల తతంగం. ప్రత్యేకించి నిర్ణీత సినిమాలపైనే, వాటి రిలీజ్‌ వేళే సోషల్‌ మీడియా విద్వేషం వెళ్ళగక్కడం, మతోన్మాదపు మాటలతో లక్షలకొద్దీ ట్వీట్లు వెల్లువెత్తడం ఓ పకడ్బందీ పథకమే. నిరుడు అలియా భట్‌ ‘డార్లింగ్స్‌’, ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌సింగ్‌ చడ్ఢా’, విజయ్‌ దేవరకొండ ‘లైగర్‌’, రణబీర్‌ కపూర్‌ ‘బ్రహ్మాస్త్ర’– ఇలా అనేకం బాయ్‌కాట్‌ విద్వేషం బారిన పడ్డవే. ఆ వరుసలో తాజా చేరిక ‘పఠాన్‌’. ఈ యాక్షన్‌–థ్రిల్లర్‌ గూఢచారి చిత్రం 57 ఏళ్ళ వయసులో షారుఖ్‌ కెరీర్‌తో పాటు కరోనా నుంచి కుదేలైన హిందీ చిత్రసీమనూ మళ్ళీ పట్టాలెక్కిస్తుందని ఓ ఆశ. ఆ పరిస్థితుల్లోఅందులోని ‘బేషరమ్‌’ పాటపై, ఆ పాటలో నాయిక ధరించిన ఆరెంజ్‌ రంగు బికినీపై, పాటలోని కొన్ని పదాలపై మధ్యప్రదేశ్‌ మంత్రి సహా విశ్వహిందూ పరిషత్‌ తదితర మితవాద సంస్థలు నిరసనల మొదలు నిషేధాల బెదిరింపుల దాకా వెళ్ళారు. చివరకు తమ నియామకమైన సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌ ప్రసూన్‌ జోషీ చేతనే ధర్మోపన్యాసాలు చెప్పించి, భావప్రకటనా స్వేచ్ఛను గాలికొదిలి సినిమాలో మార్పులు చేయించడం అప్రజాస్వామికమే. 

అధికార పక్షానికి దగ్గరైన సినీ పెద్దలకూ ఈ సెగ తగిలి, కథ విదేశీ మీడియా దాకా వెళ్ళిందంటే తప్పెవరిది? ఎప్పుడూ పెదవి విప్పని అమితాబ్‌ సైతం కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేదికపై పౌరహక్కులు, భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడాల్సి వచ్చింది. హీరో సునీల్‌ శెట్టి అస్తుబిస్తయిన చిత్రసీమ అవస్థను యూపీ సీఎంకు మొరపెట్టుకోవాల్సి వచ్చింది. పరిస్థితి చేయిదాటినప్పటికీ, ఇప్పటికైనా ప్రధాని తన వారికి సుద్దులు చెప్పడం చిరు సాంత్వన. అయినా సరే గోల పూర్తిగా సద్దుమణగలేదు. హిందూ స్వామీజీ అవిముక్తేశ్వరానంద సరస్వతి ఏకంగా ‘ధర్మ సెన్సార్‌ బోర్డ్‌’ పెట్టి, సినిమాల్లో సనాతన ధర్మ వ్యతిరేకత ఉంటే అడ్డుకుంటామనడం పరాకాష్ఠ. 

జన్మనిచ్చిన తల్లితండ్రుల నుంచి ఇస్లామ్‌ ధర్మాన్ని గ్రహించి, క్రైస్తవ పాఠశాలలో చదువుకొని, ఢిల్లీ రామ్‌లీలా ఉత్సవాల్లో వానర వీరుడిగా నటించి, ‘జై సీతారామ్‌కీ’ అని నినదించి, హిందూస్త్రీని వివాహమాడి, పిల్లల్ని లౌకిక భారతీయులుగా పెంచుతున్న షారుఖ్‌ ఇవాళ ఈ ఉన్మాదులకు తన నిజాయతీని నిరూపించుకోవాల్సి రావడం సమాజానికే సిగ్గుచేటు. సెన్సారైన సినిమాలు సైతం కొన్నేళ్ళుగా చిక్కుల్లో పడుతున్నాయి. ఇందిరా గాంధీ కాలపు ‘ఆంధీ’, ‘కిస్సా కుర్సీకా’ నుంచి టీవీ సీరియల్‌ ‘తమస్‌’ (1988) మీదుగా ఇటీవలి ‘పద్మావత్‌’ (2018) దాకా అనేక చిత్రాలు కుల, మత, రాజకీయాల పేర అభ్యంతరకర చిత్రీకరణ అంటూ మూకస్వామ్యం పాలబడ్డాయి. 

సెన్సార్‌ సర్టిఫికెట్లకూ, చట్టానికీ అతీతంగా వ్యవహరిస్తున్న రాజకీయ, నైతిక పోలీసు మూకల ముందు మోకరిల్లాల్సి వస్తున్న సినీసీమ ఇకనైనా ఒక్కతాటిపైకి రావాలి. సెన్సార్‌ బోర్డ్‌ సంస్క రణలపై మళ్ళీ చర్చ లేవనెత్తాలి. ఒకప్పుడు సెన్సార్‌ బోర్డ్‌ నిర్ణయాలపైనా అప్పీల్‌ చేసుకొనేందుకు అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఉండేది. ఘనత వహించిన సర్కార్‌ గత ఏడాది దాన్ని ఏకపక్షంగా రద్దు చేసేసింది. ఇక, 2016 నాటి శ్యామ్‌బెనెగల్‌ కమిటీ, 2013 నాటి జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌ కమిటీల సిఫార్సులకు అతీగతీ లేదు. వాటిని అమలు చేసేలా పాలకులను ఒప్పిస్తే మంచిది.  

ఏమైనా, దేశంలో అన్నిటికీ అసహనం పెరిగిపోతున్న వేళ కళను కళగా చూడడం నేర్చుకోవాలి. అసభ్యాలు, అభ్యంతరాలుంటే అడ్డుకోవడానికి ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన సెన్సార్‌ బోర్డ్, పోలీసు వ్యవస్థ ఉండనే ఉన్నాయి. వాటిని తోసిరాజని రాజ్యాంగేతర నైతిక సెన్సారింగ్, పోలీసింగ్‌ చేయాలనుకోవడమే పెద్ద తప్పు. వీటికి తక్షణం అడ్డుకట్ట పడకపోతే... అనేక కులాలు, ధర్మాలు, భావజాలాల సహజీవనంతో రంగురంగుల ఇంద్రచాపమైన మన సంస్కృతి మొత్తానికీ ఒకే దేశం – ఒకే భావజాలం – ఒకే సంస్కృతి అనే దురవస్థ పడుతుంది. అప్పుడు కళ కాంతి తప్పుతుంది. వేల ఏళ్ళ చరిత్ర గల భారతావని కళవళ పడుతుంది. తస్మాత్‌ జాగ్రత్త! 

Advertisement
 
Advertisement
 
Advertisement