వాచాలతకు మూల్యం ఎంత?

Sakshi Editorial On Nupur Sharma Remarks On Muhammad Prophet

నోటికి మాట తెగులు... నీటికి పాచి తెగులు అని జన వ్యవహారం. టీవీ చర్చల్లో మాట్లాడమన్నారు కదా అని అదుపు తప్పి మాట్లాడితే, అదే ఎదురు తంతుందని ఇద్దరు బీజేపీ నేతలకు ఆదివారం తెలిసొచ్చింది. జ్ఞానవాపి మసీదు వ్యవహారంలో మహమ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నూపుర్‌ శర్మపై, పార్టీ ఢిల్లీ శాఖ మీడియా హెడ్‌ నవీన్‌ జిందాల్‌పై బీజేపీ పెద్దలు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఖతార్, కువైట్, ఇరాన్‌ సహా పలు అరబ్‌ దేశాల నుంచి సదరు అభ్యంతర వ్యాఖ్యలకు నిరసన ఎదురవడంతో, అధికార బీజేపీ సొంతపార్టీ వాళ్ళపైనే కొరడా జుళిపించక తప్పని పరిస్థితి వచ్చింది. సదరు అభ్యంతరకర వ్యాఖ్యలు కాన్పూర్‌ లాంటి చోట్ల శుక్రవారమే హింసాకాండకు దారి తీస్తే, వ్యాఖ్యలు చేసి పదిరోజులవుతున్నా వాటిని ఖండించని అధికారపక్షపు దిలాసా ఆదివారం విదేశాల నిరసనకు కారణమైంది. మరోపక్క పశ్చిమాసియా దేశాల్లో లక్షలాది భారతీయుల ఉద్యోగాలకూ, సూపర్‌ మార్కెట్లలో భారతీయ ఉత్పత్తులకూ ఉద్వాసన లాంటి వార్తలు వస్తున్నాయి. విద్వేషపు వాచాలతకు ఇదీ మూల్యం! 

గల్ఫ్‌లోని భాగస్వామ్య దేశాలతో పెరుగుతున్న భారత సంబంధాలకు ఈ వ్యాఖ్యలు ఇబ్బంది తెచ్చాయి. భారత ఉపరాష్ట్రపతి మూడు రోజుల ఖతార్‌ పర్యటన వేళ మరింత ఇరుకునపెట్టాయి.  గల్ఫ్‌లో 90 లక్షల మంది భారతీయులు పని చేస్తున్న సంగతి మర్చి పోతే ఎలా? మనకు అత్యధిక విదేశీ మారక ద్రవ్యం చేకూర్చే తొలి 7 దేశాల్లో 5 గల్ఫ్‌ దేశాలేనని విస్మరించగలమా? అందుకే, చివరకు అభ్యంతర వ్యాఖ్యలు చేసినవారు ‘ప్రధాన స్రవంతిలో లేని అనధికారిక అతివాద శక్తులు’ అంటూ ప్రభుత్వం పరువు కాపాడుకొనే ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నిజానికి, ప్రధాని సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే నూపుర్‌ కానీ, నవీన్‌ కానీ బీజేపీలో భాగమే తప్ప వేరొకటి కాదని ప్రపంచానికీ తెలుసు. చివరకు, బీజేపీ ఆత్మరక్షణలో పడి, అన్ని మతాలూ తమకు సమానమేననీ, వివాదాస్పద వ్యాఖ్యల్ని సమర్థించబోమనీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. వారిపై వేటు వేయాల్సి వచ్చింది. అయితే, వ్యాఖ్యలు చేసి పది రోజులయ్యాక, అదీ అరబ్‌ ప్రపంచంతో ముడిపడిన భారత చమురు, వాణిజ్య, దౌత్య ప్రయోజనాల ఒత్తిడితో బీజేపీ ఈపాటి చర్యకు దిగిందన్నది చేదు నిజం. 

అధికార ప్రతినిధిపై వేటుతో బీజేపీ పిరికిగా వ్యవహరించిందంటూ కాషాయబృందంలో ఓ వర్గం విమర్శ. నిజానికి, ఎన్నికల్లో ఓ పార్టీకి మెజారిటీ ఇచ్చినంత మాత్రాన ప్రతి పనికీ, మాటకూ జనం మద్దతు ఉందనుకోవడం పొరపాటు. కేంద్రంలో వరుసగా రెండు ఎన్నికల్లో బీజేపీ గెలిచాక కాషాయ అజెండాతో స్వామి భక్తులు మైనారిటీ వ్యతిరేక వ్యాఖ్యలకూ, చర్యలకూ దిగడం పెరిగింది. తొలి రోజుల్లోనే పరిస్థితిని అదుపులో పెట్టాల్సిన పెద్దలు వ్యూహాత్మక మౌనం పాటించారు. ఇప్పుడు విషయం ప్రపంచ వేదికపైకి ఎక్కేదాకా వచ్చింది. కాలు జారినా తీసుకోవచ్చేమో కానీ, నోరు జారితే తీసుకోలేమని పాలక పక్షీయులకు పదే పదే గుర్తు చేయాల్సి రావడం దురదృష్టకరం. అయితే, ఇదే అదనుగా పాకిస్తాన్, తాలిబన్ల పాలనలోని అఫ్ఘానిస్తాన్‌ లాంటి దేశాలు భారత్‌కు సూక్తి ముక్తావళిని వినిపించడానికి ప్రయత్నించడం విడ్డూరం. సామాన్యుల స్వేచ్ఛకే గౌరవమివ్వని దేశాలు భారత్‌ను వేలెత్తి చూపుతూ, ఉపన్యాసాలిచ్చే పరిస్థితి తెచ్చుకోవడం మన స్వయంకృతాపరాధం.

ఒక వర్గం అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినంత మాత్రాన, రెండో వర్గం హింసాకాండకు పాల్పడడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. వివాదాస్పద వ్యాఖ్యలే సాకుగా వీవీఐపీల పర్యటన వేళ గత శుక్రవారం కాన్పూర్‌లో జరిగిన మత ఘర్షణలు దురదృష్టకరం. దీని వెనుక దేశవ్యాప్తంగా నిద్రాణ రహస్య యంత్రాంగం ఉన్న ‘పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా’ (పీఎఫ్‌ఐ) లాంటి సంస్థలు ఉన్నాయట. ఇది మరింత ఆందోళనకరం. ఇలాంటివి జరగకుండా తక్షణ, కఠిన చర్యలు తీసుకోక పోతే కష్టం. ఆ మాటకొస్తే – ప్రవక్త మీద వ్యాఖ్యలు చేయడం ఎంత తప్పో, శివలింగాల మీద ఎవ రైనా విపరీత వ్యాఖ్యలు చేస్తే, అవీ అంతే తప్పు. తప్పొప్పుల తరాజు ఎటు మొగ్గిందని చూసే కన్నా, ఈ వ్యాఖ్యల వల్ల దేశ సమైక్యతా చట్రానికి ఎదురయ్యే ముప్పును అర్థం చేసుకోవడం ముఖ్యం. 

కాన్పూర్‌ హింసాకాండకు ఒక రోజు ముందర జూన్‌ 2న ఆరెస్సెస్‌ అధినేత మోహన్‌ భాగవత్‌ మాట్లాడుతూ, ‘ప్రతి మసీదులో శివలింగాల గురించి వెతికి, తవ్వాల్సిన పని లేదు’ అంటూ స్వయం సేవకులకు హితవు చెప్పారు. దేశంలో ముస్లిమ్‌ల పట్ల విద్వేషానికీ, హిందూ అతివాద సైద్ధాంతి కతకూ మూలకందమని భావించే ఆరెస్సెస్‌ నుంచి ఆ సంస్థ అధినేత నోట ఇలాంటి మాటలు ఆహ్వానించదగ్గవే. కానీ, గతంలో ప్రార్థనా స్థలాలపై హిందూ, ముస్లిమ్‌ వివాదాల్లో ఆరెస్సెస్‌ పోషిం చిన పాత్ర చూశాం. కాబట్టి, భాగవత్‌ తాజా మాటలను నమ్మగలమా అన్నది విమర్శకుల ప్రశ్న. 

విద్వేషపూరిత వ్యాఖ్యలు దేశానికీ, దేశ ప్రయోజనాలకూ భంగం కలిగిస్తాయి. ఆ విషయం గల్ఫ్‌ మిత్ర దేశాలు, చిచ్చురేపి చలి కాచుకుందామని చూస్తున్న పొరుగు దేశాలు చెబితే కానీ అర్థం కాని స్థితిలో మనం ఉన్నామా? ప్రపంచంలో ముస్లిమ్‌ జనాభా అధికంగా ఉన్న రెండో దేశం మనదే. ప్రజల మధ్య ప్రేమ పంచితే ప్రేమ వస్తుంది. ద్వేషాన్ని పెంచితే ద్వేషమే మిగులుతుంది. ఇవాళ దేశంలో నెలకొన్న అతి సున్నిత పరిస్థితులకు తామెంత కారణమో పాలకుల మొదలు ప్రతిపక్షీయుల దాకా అందరూ ఆత్మ విమర్శ చేసుకోవాలి. మతసామరస్యాన్ని చెడగొట్టేవారిపై తక్షణ, కఠినచర్యలు తీసుకోవాలి. ప్రపంచ వేదికపై భారత గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top