
ఎన్నో కీలక ఘట్టాలకు వేదికైన పాత పార్లమెంటు భవనం చరిత్ర ముగిసి, కొత్త పార్లమెంటు భవనం అందుబాటులోకొచ్చింది. అయిదురోజులపాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సోమవారం పాత భవనంలోనే ప్రారంభమైనా, రెండోరోజు కొత్త భవనంలోకి మారాయి. ఇకపై పాత భవనం సంవిధాన్ భవన్‌గా పేరు మార్చుకుని భవిష్యత్తు తరాలకు ఉత్తేజాన్నందిస్తూంటుందని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆయనన్నట్టు దేశ ప్రజాతంత్ర యాత్రలో సామాన్య పౌరుల సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొన్న చరిత్ర పార్లమెంటుది. ఇక్కడే వేలాది చట్టాలపై ఎడతెగని చర్చలు జరిగాయి.
ఎన్నో కీలక నిర్ణయాలు రూపుదిద్దుకున్నాయి. ఈ క్రమంలో రాజకీయ పక్షాల మధ్య వాగ్యుద్ధాలు చోటుచేసుకున్నాయి. రాజీలేని ధోరణిలో వాద ప్రతివాదాలు సాగాయి. ఎన్నెన్నో భావోద్వేగాలకు అది వేదికైంది. అదే సమయంలో కీలక సందర్భాల్లో బలమైన స్వరాన్ని వినిపించలేని దాని అశక్తత నిరంకుశ చట్టాలకు కూడా కారణమైంది. అది మౌనం వహించటంవల్ల పాలకపక్షం ఆత్యయిక స్థితి పేరిట దేశ ప్రజల గొంతు నొక్కటానికి అవకాశం ఏర్పడింది. తొలినాళ్లలో ఆరోగ్యకరమైన చర్చలకు చోటిచ్చిన సభే రాను రాను ఉత్త ఉపన్యాస వేదికగా, అప్పుడప్పుడు బలప్రదర్శన రంగస్థలిగా మారుతోంది.
దేశ ప్రజాస్వామ్య నిర్మాణంలో తమకూ భాగస్వామ్యం ఉన్నదని... తమ ఆశలూ, ఆకాంక్షలూ వ్యక్తమవుతున్నాయని సామాన్యులు భావించటానికి వీల్లేని స్థితిగతులు నెలకొంటున్నాయి. ఏ విధాన నిర్ణయంలోని మంచిచెడ్డలనైనా ఆరోగ్యకరమైన చర్చల ద్వారా నిగ్గుతేల్చాల్సి వుండగా చాలా నిర్ణయాలు అరుపులూ, కేకల మధ్య మూజువాణి ఓటుతో గట్టెక్కుతున్నాయి. అంతకన్నా దారుణం లక్షల కోట్ల రూపాయలు వ్యయం కాగల ఆర్థిక పద్దులు సైతం గిలెటిన్ అవుతున్నాయి. అవతలి పక్షాన్ని అవహేళన చేయటం, స్వోత్కర్షలకు పోవటం నిత్యకృత్యమైంది.
ఇవన్నీ గమనిస్తే నూతన పార్లమెంటు భవనం సరికొత్త ఆశలకూ, విశ్వాసాలకూ అద్దం పడుతుందా అన్నది సందేహాస్పదమే. అది సాధ్యమేనని ప్రధాని తన ప్రసంగంలో బలంగా చెప్పారు. కానీ అధికార, విపక్షాల మధ్య అంతటి సామరస్యత ఏర్పడుతుందా? మన పార్లమెంటు నడతను నిర్దేశిస్తున్న నిబంధనలు సంతృప్తికరంగా లేకపోవటం కూడా సమస్యలకు దారితీస్తోంది. దేన్ని చర్చించాలి...ఏ రూపంలో చర్చించాలన్న అంశాలు తరచు వివాదాస్పదమవుతున్నాయి. సభాధ్యక్షులకుండే విచక్షణాయుత అధికారాలు ఇందుకు దోహదపడుతున్నాయి.
గడిచిన కాలాన్ని బేరీజు వేసుకోకుండా, జరిగిన తప్పొప్పులను నిజాయితీగా సమీక్షించుకోకుండా సరికొత్త ప్రయాణం సులభం కాదు. అధికార, విపక్షాల మధ్య విభేదాలుండటం, అవి ఒక్కో సారి తీవ్ర రూపం దాల్చటం అసాధారణమేమీ కాదు. కానీ సమష్టిగా ఉండటానికి ముందుకు రావలసిన తరుణంలో సైతం పాక్షిక దృక్పథంతో వ్యవహరించే ధోరణి ప్రబలుతోంది. ఎదురు పడినప్పుడు మర్యాదపూర్వకంగా పలకరించుకునే సంస్కృతి కూడా ఆవిరవుతోంది.
ఇవన్నీ పార్ల మెంటుపై దేశ ప్రజలకుండే విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. మొన్నటికి మొన్న దేశం మొత్తం సిగ్గుతో తలవంచుకోవాల్సిన మణిపుర్ అకృత్యాలపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాలు రెండూ వ్యవహరించిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. దీన్ని తప్పించుకునే ధోరణిగా చూడాలా లేక ప్రజల మనోభావాలను అవగాహన చేసుకోవటంలోని అశక్తతగా పరిగణించాలా? సమాజంలో భిన్న వర్గాలున్నప్పుడూ, వాటికి భిన్న ప్రయోజనాలున్నప్పుడూ పార్లమెంటులో అవి ప్రతిబింబించటం వింతేమీ కాదు.
నిజానికి అలాంటి వైరుధ్యాలకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనటమే ప్రజాతంత్ర సంస్థల లక్ష్యం. కానీ బలం ఉంది కదా అని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, వాటి మంచిచెడ్డల విశ్లేషణకు అవకాశమీయకుండా అసమ్మతికి పాతరేయటం ఇటీవలి కాలంలో రివాజైంది. పార్లమెంటు సజావుగా సాగటానికి, అక్కడ ఆరోగ్యవంతమైన చర్చలు జరగటానికి ప్రస్తుత పాలక్ష పక్ష కూటమికి నేతృత్వం వహిస్తున్న పార్టీగా బీజేపీపై ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికార పక్షంనుంచి అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు దాన్ని స్వాగతించి తమ వంతుగా సకారాత్మక దృక్పథాన్ని ప్రదర్శించటం విపక్షాల వంతు.
స్వరూపం, సదుపాయాల కోణంలో మాత్రమేకాదు...స్వభావరీత్యా వర్తమాన ప్రగాఢ ఆకాంక్ష లకు కూడా నూతన పార్లమెంటు భవనం అద్దం పడుతుందన్న గ్రహింపు ఏర్పడినప్పుడు ఇరు పక్షాలూ విజ్ఞతతో మెలుగుతాయి. ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయంటే, ఒక బిల్లు విషయంలో, ఒక విధాన నిర్ణయం విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయంటే దాన్ని కేవలం రాజకీయకోణంలో కాక, ప్రజానీకంలో ఏర్పడిన అభిప్రాయానికి ప్రతిబింబంగా చూడగలిగితే చాలా సమస్యలకు పరిష్కారాలు సాధ్యమవుతాయి. ప్రస్తుత పార్లమెంటు భవనం లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చొనటానికి అనువుగా ఉంది.
సెంట్రల్ హాల్ లేకున్నా, ఉభయసభల ఉమ్మడి సమావేశాల సమయంలో 1,272 మంది కూర్చొనేందుకు లోక్‌సభలో అవకాశం ఉంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కల్పించే బిల్లు రాజ్యసభలో మంగళవారం ప్రవేశించటం శుభపరిణామం. బిల్లు ఆమోదం పొంది చట్టమైనా నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే ఇది అమల్లోకి వస్తుందనటం కొంత నిరాశ కలిగిస్తుంది. ఏదేమైనా కొత్త సభా భవనం సరికొత్త ఆచర ణకు, సమున్నత సంప్రదాయాలకు వేదిక కాగలదని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. దాన్ని నెరవేర్చ వలసిన బాధ్యత శాసనకర్తలదే.