రైలు పుస్తకం

Sakshi Editorial On Indian Train

ఈ దేశానికి స్వాతంత్య్రం రైలు వల్లే వచ్చిందంటే ఉలిక్కిపడవలసిన అవసరం లేదు. జూన్  7, 1893 రాత్రి– సౌత్‌ ఆఫ్రికా డర్బన్  నుంచి ప్రెటోరియాకు గాంధీ ప్రయాణిస్తున్నప్పుడు, ఆయన దగ్గర మొదటి తరగతి టికెట్‌ ఉన్నా, అది ‘వైట్స్‌ ఓన్లీ క్యారేజ్‌’ కావడాన పీటర్‌మార్టిస్‌బర్గ్‌ అనే చిన్న స్టేషన్ లో కిందకు ఈడ్చేశారు. వివక్షతో కూడిన ఆధిపత్యం ఎంతటి క్రూరమైనదో గాంధీకి అవగాహన వచ్చిన సందర్భం అది.

భారతదేశం వచ్చాక ఇక్కడ బ్రిటిష్‌వారి పాలనలో అంతకన్నా ఘోరమైన వివక్షను, ఆధిపత్యాన్ని దేశ జనులు అనుభవిస్తున్నారని ఆయనకు తెలియచేసింది రైలే. ‘మూడవ తరగతి పెట్టెల్లో విస్తృతంగా తిరిగాక ఈ దేశమంటే ఏమిటో అర్థమైంది’ అని ఆయన చెప్పుకున్నాడు. తర్వాత స్వాతంత్య్ర సంకల్పం తీసుకున్నాడు. నిజానికి గాంధీ రైలు ప్రయాణాలే జనం చెప్పుకుంటారుగాని నెహ్రూ కూడా ‘నేను ఈ దేశాన్ని రైలులో తిరగడం ద్వారానే ఆకళింపు చేసుకున్నాను’ అని ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’లో రాసుకున్నాడు.

‘గవర్నర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’గా వాసికెక్కిన లార్డ్‌ డల్హౌసీ బ్రిటిష్‌ రాజ్యం, పాలన బలపడాలంటే భారతదేశంలో రైళ్ల వ్యవస్థ సమర్థంగా విస్తరించాలని భావించాడు. అయితే డల్హౌసీ ఒకటి తలిస్తే దేశ జనులు మరొకటి తలిచారు. ఏనాడు కనని, వినని ప్రాంతాలను రైలు ద్వారా సగటు భారతీయుడు తెలుసుకున్నాడు. బహు జాతులతో, సంస్కృతులతో సంపర్కంలోకి వచ్చాడు. అలా మనదంతా ఒక జాతి, ‘భారత జాతి’ అనే భావన పాదుకొనడానికి, అందరూ ఏకమై బ్రిటిష్‌ వారిపై పోరాడటానికి మొదటి భూమికను ఏర్పరించింది ఈ దేశంలో రైలే. 

‘భారతీయులు తమ పల్లెటూళ్లను రైల్వేస్టేషన్ లోకి తీసుకొస్తారు. పల్లెల్లో వాళ్ల ఇళ్లల్లోకి రానీయకపోవచ్చు. కాని పల్లె స్వభావం మొత్తం స్టేషన్ లో ప్రదర్శనకు పెడతారు’ అని అమెరికన్  ట్రావెల్‌ రైటర్‌ పాల్‌ థెరూ ‘ది గ్రేట్‌ రైల్వే బజార్‌’ (1975) పుస్తకంలో రాశాడు. నిజమే. గడ్డి మోపులు, ధాన్యం బస్తాలు, కోళ్ల గంపలు, కుండలు, గిన్నెలు, కట్టెలు, పాల క్యాన్లు, సైకిళ్లు, పనిముట్లు, అరుపులు, కేకలు, అక్కరలు, మక్కువలు... వారు స్టేషన్ కు తేనిది ఏమిటి? బండి ఎక్కించనిది ఏమిటి? ‘భారతదేశంలో రైలు కంపార్ట్‌మెంట్‌ అంటే ఇల్లే. అందులో ప్రతి ఒక్క ఇంటి సభ్యుణ్ణి చూడొచ్చు. రైలులో వారు అక్క, తమ్ముడు, అమ్మ, నాన్నలుగానే ఎక్కువగా ప్రయాణి స్తారు. ప్రయాణికులుగా తక్కువగా మారుతారు’ అని మరొక పాశ్చాత్య రచయిత రాశాడు. 

దొరలు ఎక్కే ఈ పొగబండి జన సామాన్యానికి అందుబాటులోకి వచ్చాక కథ, కవిత, నవల, సినిమా, నాటకాల్లో దీని ప్రస్తావన లేకుండా సృజన సాగలేదు. భారతీయ రైళ్లను, వాటి కిటికీల గుండా కనిపించే దేశాన్ని మొదట రడ్‌యార్డ్‌ కిప్లింగ్‌ ‘కిమ్‌’ (1901) నవలలో రాశాడు. అయితే రైలును ఒక చారిత్రక సాక్ష్యంగా కుష్వంత్‌ సింగ్‌ మలిచాడు. మనో మజ్రా అనే చిన్న సరిహద్దు గ్రామంలో జనం ఒక ట్రైన్  ఆ ఊరి మీదుగా వెళితే నిద్ర లేస్తారు.

మరో ట్రైను కూత వినిపిస్తే మధ్యాహ్నం కునుకు సమయం అని గ్రహిస్తారు. ఇంకో ట్రైన్  శబ్దం వచ్చాక రాత్రయ్యింది పడుకోవాలి అని పక్కల మీదకు చేరుతారు. 1947లోని ఒక వేసవి రోజు వరకూ వారి దినచర్య అలాగే ఉండేది. కాని ఆ రోజున వచ్చిన ఒక రైలు వారి జీవితాలను సమూలంగా మార్చేసింది. ఆ ఊరి వాళ్లు ఆ రైలు రాకతో హిందువులుగా, ముస్లింలుగా, సిక్కులుగా విడిపోయారు. ఆ తర్వాత? ‘ట్రైన్  టు పాకిస్తాన్ ’ నవల చదవాలి.

రైలు ప్రయాణాన్ని నేపథ్యంగా తీసుకుని ‘గాలి వాన’ అనే గొప్ప కథ రాశారు పాలగుమ్మి పద్మరాజు. మనుషుల ప్రాథమిక సంవేదనల ముందు వారు నిర్మించుకున్న అహాలు, జ్ఞానాలు, ఆస్తులు, అంతస్థులు, విలువలు గాలికి లేచిన గడ్డిపోచల్లా కొట్టుకుని పోతాయి అని చెప్పిన కథ ఇది. చాసో ‘ఏలూరెళ్లాలి’ కథ రైలు పెట్టెలోనే మనుగడ రహస్యాన్ని విప్పుతుంది. రైలు చుట్టూ ఎన్నో ప్రహసనాలు, పరిహాసాలు. తిలక్‌ రాసిన ‘కవుల రైలు’లో కవులందరూ ఎక్కి కిక్కిరిసిపోతారు. పాపం ప్లాట్‌ఫారమ్‌ మీద ఒక యువతి మిగిలిపోతుంది. ‘నీ పేరేమిటమ్మా’ అంటాడు స్టేషన్  మాస్టరు. యువతి జవాబు– ‘కవిత’!

‘షోలే అంత పెద్ద హిట్‌ ఎందుకయ్యింది’ అని ఎవరో అడిగితే ‘రైలు వల్ల’ అని సమాధానం ఇచ్చాడు అమితాబ్‌. ‘షోలే’ సినిమా రైలుతో మొదలయ్యి రైలుతో ముగుస్తుంది. అందులోని ట్రైన్  రాబరీ వంటిది ఇప్పటికీ మళ్లీ సాధ్యపడలేదు. ‘సగటు ప్రేక్షకుడికి రైలు కనపడగానే కనెక్ట్‌ అయిపోతాడు’ అని అమితాబ్‌ ఉద్దేశం. ‘ఆరాధన’లో రైలు కిటికీ పక్కన పుస్తకం చదువుకుంటున్న షర్మిలా టాగోర్‌ను, రోడ్డు మీద జీప్‌లో పాడుకుంటూ వస్తున్న రాజేష్‌ ఖన్నాను మర్చిపోయామా మనం? ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే’ క్లయిమాక్స్‌– కదిలిపోతున్న రైలులోని హీరోను అందుకోవడానికి హీరోయిన్  పరుగులు– సూపర్‌హిట్‌ ఫార్ములా!

అందుకే రైలు ఈ దేశ ప్రజల జీవనంలో అవిభాజ్యం. అంతేనా? రైలు ఈ దేశంలో ఎన్నో బరువుల, బాధ్యతల, మమతల, కలతల, కలల వాహిక. గమ్యంపై ప్రయాణికుడు పెట్టుకునే నమ్మకం. ‘చేరి ఫోన్  చేస్తారు’ అని కుటుంబం పెట్టుకునే భరోసా. బెర్త్‌పై నిశ్చింతగా ముసుగు తన్నే నిద్ర. దానికి దెబ్బ తగిలితే భారతీయుడు విలవిల్లాడతాడు.

‘నువ్వు ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటు’ అన్నాడు ఆరుద్ర. మృత్యుశకటం లాంటి రైలు కంటే ఎప్పటికీ రాని రైలు మేలైనది అనిపిస్తే ఆ నేరం ఎవరిది? 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top