గెలిచి తీరాల్సిన యుద్ధం 

Sakshi Editorial On Corona Vaccine In India

దేశంలో కోవిడ్‌ టీకామందు (వాక్సిన్‌) అవసరం, కొరత తీవ్ర స్థాయికి చేరింది. పలు రాష్ట్ర ప్రభు త్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర–రాష్ట్రాల మధ్య ఒత్తిడి వాతావరణం పెంచుతోంది. తన నియంత్రణలోనే, జనాభా దామాషా ప్రకారం ఈ ప్రక్రియ సాగాలని కేంద్ర ప్రభుత్వం అంటోంది. ఈ విషయమై నిపుణులు, రాష్ట్రప్రభుత్వాలతో తాము చర్చించే ఒక విధానం రూపొందించామని, న్యాయజ్యోక్యానికి కూడా తావులేదని కేంద్రం సుప్రీంకోర్టుకే తెలియజెప్పింది. మాకు తగినంత టీకామందు సరఫరా చేయండని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ కేంద్రాన్ని నిత్యం వేడుకుం టున్నాయి. నేరుగా సరఫరా చేయండని టీకా ఉత్పత్తి కంపెనీలను కోరుతున్నాయి. కేంద్ర కేటా యింపుల ప్రకారం, దాదాపు పదిహేను రాష్ట్రాలకు నేరుగా టీకామందు పంపిణీ చేస్తున్నామనేది ఉత్పత్తిదారుల మాట! కానీ, అవసరాలకు సరిపడా ఉత్పత్తిలేక, కోరిన మేర సరఫరా జరుగటం లేదు. కేంద్రం ఏమీ చేయలేని అచేతన స్థితి. ఏ అవసరానికైనా 70 ఏళ్లు ఈ దేశంలో సార్వత్రిక టీకా పంపిణీ పద్ధతి కేంద్ర ప్రభుత్వమే నిర్వహించేది. రాష్ట్రాలు తమ వ్యవస్థలతో సహకరించేవి. ఇప్పుడు టీకామందు కేంద్రానికో ధర, రాష్ట్రప్రభుత్వాలకొక ధర, ప్రయివేటు సంస్థలకింకో ధర... వివాదాస్ప దమైంది. సుప్రీం కూడా తప్పుబట్టింది. దీన్ని పునస్సమీక్షించమని రాష్ట్రాలు కోరుతున్నాయి. ధర పక్కన పెడితే, అవసరాలు తీర్చేలా సరఫరా అడుగుతున్నాయి. అరడజన్‌ రాష్ట్రాలు ఇంకొక అడుగు ముందుకు వేసి, గ్లోబల్‌ టెండర్ల ద్వారా టీకా మందును అంతర్జాతీయ ఉత్పత్తిదారుల నుంచి సమకూర్చుకునే యత్నాల్లో పడ్డాయి. ఆయా కంపెనీల టీకా మందుకు దేశంలో అనుమతి అంశం నుంచి, గ్లోబల్‌ టెండర్ల ప్రక్రియ సాధకబాధకాల వరకు... రాష్ట్ర అధికారులు ఇప్పుడు కేంద్ర ఉన్నతా ధికారులతో సంప్రదిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ ఈ జాబితాలో ఉన్నాయి. టీకాల ప్రక్రియ వేగం పెంచకుంటే రెండో ఉధృతిని తట్టుకోవడం కష్టమని నిపుణులూ హెచ్చరిస్తున్నారు. దేశ ప్రధాన శాస్త్రసలహాదారు చెప్పినట్టు, కోవిడ్‌ మూడో ఉధృతి ముంచుకు వచ్చే ప్రమాదమూ ఉంది. అది మొదలవక ముందే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవాలంటే వైరస్‌ వ్యాప్తి నిలువరించడం ఎంత ముఖ్యమో, టీకా ప్రక్రియను పూర్తి చేయడం అంతే ముఖ్యమన్నది నిపుణుల హెచ్చరిక. 

వేర్వేరు కారణాల వల్ల టీకాలిచ్చే ప్రక్రియ దేశంలో మందగించింది. చివరకు, 18 ఏళ్లు పైబడ్డ వారికి మే1 నుంచి టీకా ఇవ్వాలన్న కేంద్ర నిర్ణయం అమలూ వీగిపోయింది. చాలా రాష్ట్రాల్లో 18–44 ఏళ్ల మధ్య వయస్కులకు టీకాలిచ్చే ప్రక్రియ వాయిదా పడింది. పేర్లు నమోదు చేసుకొని, ఎక్కడి కక్కడ టీకా మందు కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా కేటాయించిన కోటాలను కూడా, తొలి డోసు టీకా తీసుకొని రెండో డోసు నిరీక్షణలో ఉన్నవారికి ప్రాధాన్యతా క్రమంలో ఇవ్వాలని కేంద్రం ఉత్తర్వులిచ్చింది. అరకొరగా అందుతున్న టీకామందుతో... ఇప్పుడా ప్రక్రియ కుంటినడకన సాగుతోంది. తొలిడోసు, మలిడోసు నడుమ నిర్దిష్ట గడువు ముగిసినా ప్రమాదమేమీ లేదని, చిన్న పాటి జాప్యం వల్ల తొలిడోసు నిరుపయోగమేమీ కాదని, అవగాహన కల్పిస్తూ జనాన్ని ఊరడిం చాల్సి వస్తోంది. సరైన వ్యూహం, ముందు చూపు కొరవడటం వల్లే ఈ దుస్థితి. ఔషధ ఉత్పత్తి, ముఖ్యంగా టీకామందుల స్వర్గధామంగా చెప్పుకునే భారత్‌కు ఈ పరిస్థితి వస్తుందని తామెప్పుడూ అనుకోలేదని అంతర్జాతీయ సమాజం నివ్వెరపోతోంది. వచ్చే జూన్‌ 4 నాటికి 70 శాతం జనాభాకు కనీసం ఒక డోసు టీకా పూర్తి చేసే కార్యాచరణతో ఉన్న అమెరికా, పౌరులపై కోవిడ్‌ ఆంక్షలన్నీ సడలించే యోచనతో ఉంది. ఏ రకంగానూ అగ్రదేశాలతో సరితూగని ఇజ్రాయల్‌ వంద శాతం టీకామందు వేసి, దేశ ప్రజలెవరూ ఇక మాస్క్‌లు ధరించనవసరం లేదని ప్రకటించింది. ఇంత చేస్తే... మన దేశంలో ఇప్పటికి 12 శాతం జనాభాకు మాత్రం ఒక డోసు టీకాలిచ్చాం. రోజూ సగటున 90 లక్షల నుంచి కోటి టీకా డోసుల ఉత్పత్తి అవసరమున్న స్థితిలో, రోజువారీ ఉత్పత్తి 20 నుంచి 30 లక్షల స్థాయిలోనే ఉంది. 

ఈ నెలలో టీకామందు ఉత్పత్తి పెంచి, సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయికి చేరుకుంటామని దేశంలో ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు భారత్‌ సీరమ్‌ (కొవీషీల్డ్‌), భారత్‌ బయోటిక్స్‌ (కోవాక్సిన్‌) చెబుతున్నాయి. ఆ రెండు కంపెనీలకే ఎందుకు పరిమితం కావాలి? అన్న ప్రశ్నకు పాలకుల నుంచి సమాధానం లేదు. దేశంలో టీకామందు పంపిణీ చేస్తామని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌వో) ఆమోదించిన ఫైజర్, మొడెర్నా వంటి కంపెనీల నుంచి వచ్చిన వినతులు గత డిసెంబర్‌ నుంచి భారత ఔషధ నియంత్రణ సంచాలకుడి (డీజీసీఐ) వద్ద పడున్నాయి. జాప్యానికి అధికారిక యంత్రాంగమా? రాజకీయ వ్యవస్థా? ఎవరు కారణం! ఇటీవలే స్పుత్నిక్‌–వి కంపెనీకి భారత్‌ అనుమతించినా సాంకేతిక, నిర్వహణా అంశాల అడ్డంకి తొలగలేదు. పోనీ, దేశంలో హక్కులున్న రెండు కంపెనీలు, సామర్థ్యం కలిగిన ఇతర కంపెనీలకు సాంకేతికత బదలాయించేలా చూడమని  ఏపీ, ఢిల్లీ ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. తద్వారా ఉత్పత్తిని పెంచాలని, టీకాలిచ్చే ప్రక్రి యను వేగిరం చేయాలన్నది వారి వినతి. ఏం చేసైనా... ఒక వంక వైరస్‌ వ్యాప్తిని నిలువరించడం, మరోవంక సంపూర్ణ టీకా ప్రక్రియతో కోవిడ్‌ గ్రాఫ్‌ రేఖని వంచి, కిందకు దించడం ఇప్పుడు భారత్‌ ముందున్న లక్ష్యం, అదే తొలి కర్తవ్యం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top