
ప్రారంభమైంది మొదలు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు పోటెత్తుతున్న జనవాహినిని చూసి పుట్టగతులుండవని ఎంచిన ప్రత్యర్థులు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పన్నిన కుట్ర వెంట్రుకవాసిలో భగ్నమైంది. పైనున్న దేవుడి ఆశీస్సులూ, అశేష ఆంధ్ర ప్రజానీకం ఆశీర్వాదాలూ తనకు పుష్కలంగా వున్నాయని జగన్ తరచు చెబుతుంటారు.
విజయవాడ సింగ్ నగర్‌లో గుర్తుతెలియని దుండగులు చీకటిచాటున పదునైన వస్తువును గురిచూసి ప్రయోగించినప్పుడు అదే రుజువైంది. నేరుగా కణతకు గురిపెట్టి హాని తలపెట్టాలన్న ఉన్మాదుల పన్నాగం ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ పక్కకు తిరగటంతో త్రుటిలో తప్పింది. ఎడమకన్ను పైభాగాన గాయమైంది. పక్కనే వున్న వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సైతం ఈ దాడిలో గాయపడ్డారు.
అంతక్రితం పాలనానుభవం లేని ఒక ముఖ్యమంత్రి అయిదేళ్ల అనంతరం ‘మీ ఇంట్లో మంచి జరిగుంటేనే ఓటేయండి’ అని అడుగుతుంటే ఇంత పెద్దయెత్తున ప్రజలు ఎదురేగి నీరాజనాలు పట్టడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అందుకే కూటమి నేతలు తట్టుకోలేకపోయారు. ఎడమవైపు కనుబొమ్మ పైభాగాన లోతుగా పడిన గాయం బాధిస్తున్నా... వాపు పూర్తిగా తగ్గకపోయినా జగన్ సోమవారం యధావిధిగా కొనసాగించిన బస్సుయాత్రకూ, గుడివాడలో నిర్వహించిన బహిరంగసభకూ మరిన్ని రెట్లు ఎక్కువగా జనవాహిని తరలిరావటం గమనించాక త్రికూటమికి, ప్రత్యేకించి టీడీపీకి తత్వం బోధపడి వుండాలి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారాన్నీ, పార్టీనీ కబ్జా చేసినప్పటికన్నా చాలా ముందే చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య, కాపు నాయకుడు వంగవీటి రంగాను అత్యంత దారుణంగా హతమార్చటం, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి దుర్మరణం వగైరాల్లో బాబుపై ఆరోపణలు రావటం యాదృచ్ఛికం కాదు.
కేంద్రంలో తొలి ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించిన వాజపేయి అంతటి నాయకుడే బాబు తీరుతెన్నులు గమనించి దిగ్భ్రాంతి చెందేవారని ఆ రోజుల్లో కథనాలొచ్చేవి. తెరవెనక పావులు కదపడం, జరిగింది ఒకటైతే బయటకు వేరేలా చూపటం, మంచిని తన ఖాతాలో వేసుకుని, పొరపాట్లు అవతలివారిపై రుద్దటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఫలానావారిని ప్రధానిని చేశాను... ఇంకొకరిని రాష్ట్రపతిని చేశాను అని చెప్పుకోవటం ఆయనకు అలవాటైన విద్య.
రాజకీయాల్లో శత్రువులుండరని, ప్రత్యర్థులు మాత్రమే వుంటారని ఇన్నేళ్ల అనుభవం తర్వాత కూడా బాబు గ్రహించలేకపోయారని ఆయన తరచుగా మాట్లాడే మాటలు, చేసే ప్రసంగాలు రుజువు చేస్తున్నాయి. కనీసం ఈ అవసాన దశలోనైనా నలుగురికీ ఆదర్శంగా వుండాలన్న ఇంగితజ్ఞానం లేకపోగా మరింత అధమస్థాయి రాజకీయాలు చేసే సినీ నటుడు పవన్ కల్యాణ్‌ను వెంటేసుకుని ఆయన ఉన్మాదిలా రెచ్చిపోతున్న తీరు అందరికీ దిగ్భ్రాంతి కలిగిస్తోంది.
సరిగ్గా ముఖ్యమంత్రిపై దాడి జరగడానికి కొన్ని గంటల ముందు తాడికొండలో బాబు చేసిన ప్రసంగమే అందుకు తార్కాణం. ‘ప్రతి ఒక్కరూ రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని ఆ దున్నపోతుపై దాడి చేయండి’ అంటూ ఆయన రెచ్చగొట్టారు. సొంత పార్టీ కార్యకర్తలను ఇలా గూండాలుగా, హంతకు లుగా మార్చాలనుకోవటం ఏ మార్కు రాజకీయమో ఆయనకు అవగతమవుతున్నట్టు లేదు. వయసు ముదిరిన ఈ దశలో బాబుకు పరిణతి రావటం అసంభవం.
కనీసం చట్టమైనా దుండ గులను శిక్షించగలిగితే ఇతరులకు జ్ఞానోదయమవుతుంది. ‘ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేయదు’ అంటారు. రాజకీయాల్లోకొచ్చి దాదాపు పదేళ్లవుతున్నా, ఒకటి కాదు– రెండు మంత్రి పదవులు వెలగబెట్టినా ఏ భాషలోనూ తప్పుల్లేకుండా పలకడంరాని లోకేష్ వంచనలో, వాచాలత్వంలో మాత్రం తండ్రిని మించారు. ఇలాంటివారంతా ప్రజాస్వామ్యం మాటున వీరంగం వేస్తుంటే అవాంఛనీయ ఉదంతాలు జరగటంలో ఆశ్చర్యమేముంది?
ఏం నేరం చేశారు జగన్? ఏ పథకం పెట్టినా దళారుల భోజ్యంగా మారే తీరును సమూలంగా మార్చారు. వాలంటీర్ల వ్యవస్థను నెలకొల్పి నేరుగా నిరుపేదల ముంగిటకే పథకాలు వెళ్లే సరికొత్త విధానం తీసుకొచ్చారు. గ్రామసచివాలయాలు ఏర్పాటుచేశారు. ఇళ్లులేని పేదలను గుర్తించి దరఖాస్తు చేయించి రూ. 10 నుంచి 15 లక్షల విలువైన ఆస్తుల్ని కట్టబెట్టారు.
వాగ్దానం చేసిన నవరత్నాలే కాదు... మరిన్ని పథకాలు ప్రజలకందించారు. విద్య, వైద్యరంగాల ప్రక్షాళనకు నడుం బిగించారు. రైతుభరోసా కేంద్రాలు నెలకొల్పారు. రైతులకు అండగావున్నారు. విలేజ్ క్లినిక్‌లు, ఆరోగ్యశ్రీ తదితరాలతో జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అలాంటి నేతను దుర్భాషలతో, దుశ్చర్యలతో ప్రజలకు దూరం చేయాలని చూడటం తెలివితక్కువతనమని ఆ ముఠాకు మరో నెలరోజుల్లో అర్థమవుతుంది.
సత్సంకల్పంతో రాజకీయాలు నెరపేవారినీ, మంచి పాలన అందిస్తున్నవారినీ ప్రజలనుంచి వేరుచేయటం అసాధ్యం. మండుటెండల్ని సైతం లెక్కచేయకుండా బస్సు యాత్ర పొడవునా బడి పిల్లలు మొదలుకొని వృద్ధులవరకూ అన్ని తరాలవారూ, అన్ని వర్గాలవారూ కనబడటం జగన్ మంచి పనులకు నిదర్శనం. విజయవాడ దురంతం వెనకున్న సూత్రధారులనూ, పాత్రధారులనూ సత్వరం బంధించి, కఠినశిక్ష పడేలా చేసినప్పుడే హత్యారాజకీయాలకు అడ్డుకట్టపడుతుంది. నాయకులు బాధ్యతాయుతంగా మెలగటం నేర్చుకుంటారు.