Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం! 

India Has Become 5th Largest Economy In The World Key Issues - Sakshi

భారత ఆర్థిక వ్యవస్థకు దక్కిన కొత్త కిరీటం ఇది. దేశంలో సామాన్యుల స్థితిగతులు ఎలా ఉన్నా, పరిమాణ రీత్యా విశ్వవేదికపై మన ఆర్థిక వ్యవస్థ ఏకంగా 5వ స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీల తర్వాత స్థానం ఇప్పుడు భారత్‌దేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) గత వారం వెల్లడించింది. భారీగా పెరిగిన జీవన వ్యయంతో సతమతమవుతున్న బ్రిటన్‌ ఆరో స్థానానికి నెట్టేసి, గత ఆర్థిక సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో భారత్‌ ముందుకు దూసుకు వచ్చింది. దశాబ్ది క్రితం ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో బ్రిటన్, 11వ స్థానంలో భారత్‌ ఉండేవి. ఆ దశ నుంచి ఇంత పైకి ఎగబాకడం ఆనందమే. సంపద పెంపులో ముందుండడం సంతోషమైనా, సామాన్యులకు సంపద పంపిణీలో ఎక్కడున్నామన్నది ఆలోచించుకోవాలి. 

బ్రిటన్‌ వెనుకబాటుకూ, భారత్‌ ముందంజకూ అనేక కారణాలున్నాయి. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వేగంగా బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరుగుతోంది. 2024 దాకా ఆ దేశానికి ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ లాంటివే అంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం మొన్న మార్చితో ముగిసిన త్రైమాసికంలో ‘నామమాత్రపు’ నగదు లెక్క ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ 854.7 బిలియన్‌ డాలర్ల వద్ద ఉంటే, బ్రిటన్‌ 814 బిలియన్‌ డాలర్ల స్థాయిలోనే మిగిలింది. డాలర్‌ మారకం రేటు ప్రకారం ఈ లెక్క కట్టారు. ఇక, వర్తమాన ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనూ అమెరికన్‌ డాలర్ల లెక్కన భారత్‌ ముందంజ కొనసాగించినట్టు ఐఎంఎఫ్‌ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) గణాంకాల మాట. మరోపక్క ఈ ఏడాది భారత రూపాయితో పోలిస్తే బ్రిటన్‌ పౌండ్‌ 8 శాతం పడిపోయింది. వెరసి, వార్షిక ప్రాతిపదికన కూడా ఈ ఏడాది బ్రిటన్‌ను భారత్‌ దాటేస్తుందని ఐఎంఎఫ్‌ అంచనా. 

బ్రిటన్‌లోని పరిస్థితికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది కనీసం 7 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని చెబుతున్నారు. రెండొందల ఏళ్ళు ఎవరి పాలనలో ఉన్నామో ఆ పాలక దేశాన్ని, పాలిత భారతదేశం అధిగమించడం విధి వైచిత్రి. అదీ బ్రిటీష్‌వారిపై పోరాడి, స్వాతంత్య్రం సాధించి 75 వసంతాలు నిండిన వేళ ఇలాంటి కిరీటం విశేషమే. నిజానికి, ఇలా బ్రిటన్‌ను వెనక్కి నెట్టి, భారత్‌ ముందుకు రావడం ఇటీవల ఇది రెండోసారి. 2019లో తొలిసారిగా భారత్‌ ఆ ఘనత సాధించింది. తర్వాత ఆ స్థానాన్ని భారత్‌ చేజార్చుకుంది. ఇంతలో బ్రిటన్‌ చిక్కుల్లో పడిపోవడంతో మనం మళ్ళీ ముందుకొచ్చాం. ‘వలస పాలకులపై ఇది స్వీట్‌ రివెంజ్‌’ అని కొందరి వ్యాఖ్య. అలా సంతోషపడ వచ్చేమో కానీ, అంతటితో సరిపెట్టుకొని అనేక ఇతర సూచికలను పట్టించుకోకుంటేనే కష్టం. 

కరోనా, ఉక్రెయిన్‌లో యుద్ధం లాంటి వాటితో ద్రవ్యోల్బణం, ఇంధన సంక్షోభం బ్రిటన్‌ లాంటి పాశ్చాత్యదేశాల్ని చుట్టుముట్టాయి. ఆ సంక్షోభాలను తట్టుకొని మన దేశం ఈ మేరకు నిలబడడం విశేషమే. కానీ ఇది చాలదు. మనం ఇవాళ్టికీ బ్రిటన్‌తో పోలిస్తే తలసరి జీడీపీలో వెనకబడే ఉన్నాం. ఇప్పటికీ మన దగ్గరే దారిద్య్ర స్థాయి ఎక్కువ. బ్రిటన్‌ తలసరి ఆదాయం 47 వేల డాలర్లు కాగా, మనమింకా 2.5 వేల డాలర్ల దగ్గరే ఉన్నాం. విద్య, వైద్యం, జీవన ప్రమాణాల మేళవింపైన మానవాభివృద్ధి సూచిలోనూ ఇండియా వెనకబడి ఉంది. మన దేశం త్వరితగతిన అడుగులు వేస్తున్నా, కనీసం 1980లో బ్రిటన్‌ ఉన్న స్థాయికి మనం చేరాలన్నా మరో దశాబ్ది పడుతుందట. దేశ సంపన్నతకు చిహ్నం జీవన నాణ్యత గనక ‘సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కవరేజ్‌’ (యూహెచ్‌సీ) లెక్కన చూసినా భారత్‌ సుదూరం ప్రయాణించాల్సి ఉంది. 

2016 నాటికే బ్రిటన్‌ను దాటి మన దేశం అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఒకప్పటి అంచనా. తీరా అది ఇంత ఆలస్యమైంది. కానీ, పెరుగుతున్న యువభారత జనాభా, పటిష్ఠ మవుతున్న డిజిటల్‌ వ్యవస్థ రీత్యా రాగల కాలంలో భారత్‌ మరింత వృద్ధి సాధించవచ్చని ఓ ఆశాభావం. ఈ దశాబ్ది చివరికే భారత్‌ మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ మాట. అలాగే, వచ్చే 2027 కల్లా ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ల లక్ష్యం చేరుస్తామంటున్న పాలకులు అది నిజం చేయాలంటే ఆలోచన, ఆచరణలో చిత్తశుద్ధి అవసరం. ఉదాహరణకు, జీడీపీలో 4 నుంచి 6 శాతం విద్యారంగంపై ఖర్చు చేయాలని యునెస్కో అభ్యర్థన. కానీ, మన కేంద్రం, రాష్ట్రాలన్నీ కలి పినా గత ఆర్థిక వత్సరం విద్యారంగంపై బడ్జెటరీ వ్యయం జీడీపీలో 3 శాతమే. ఇలాంటివి మారాలి. 

అలాగే, దేశ జీడీపీ పెరుగుతున్నా, ఆర్థిక అసమానతలూ పెరుగుతూ పోవడం ఆందోళనకరం. ఇప్పటికీ అల్ప–మధ్య ఆదాయ దేశమైన భారత్‌లో సంపద సృష్టితో పాటు సంపద పంపిణీపైనా దృష్టి పెట్టాలి. జీడీపీకి తగ్గట్టు దేశంలోని కోట్లాది నిరుపేదలను సంపన్నుల్ని చేయడం పాలకుల బాధ్యత. స్వాతంత్య్ర శతవసంతాల 2047 నాటికి భారత్‌ను మధ్య ఆదాయ  దేశంగా నిలబెట్టి, తలసరి ఆదాయం 10 వేల డాలర్లు చేయాలంటే, నిలకడగా 7 నుంచి 7.5 శాతం వృద్ధి రేటు అవసరం. అందుకు మనకున్న అతి పెద్ద యువ జనాభాను సానుకూల అంశం చేసుకోవాలి. బ్రిటన్‌ (78 శాతం), అమెరికా (62 శాతం)తో పోలిస్తే, మన దగ్గర శ్రామికశక్తి భాగస్వామ్యం రేటు తక్కువ (48 శాతం). కానీ నిరుద్యోగమేమో ఎక్కువ (8 నుంచి 9 శాతం). దీన్ని మార్చాలి. ప్రైవేట్‌ రంగంలో ఉపాధి పెరిగేలా చూడాలి. అవసరమైన అన్ని సంస్కరణలూ చేపట్టాలి. ‘సాధించినదానికి సంతృప్తిని చెంది, అదే విజయమనుకొంటే పొరపాటోయి’ అన్న కవి వాక్కే నిత్యం దిశానిర్దేశం కావాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top