ప్రమాదకర పోకడలు | Hundreds of innocent civilians are dying every day in the war | Sakshi
Sakshi News home page

ప్రమాదకర పోకడలు

Mar 21 2026 3:36 AM | Updated on Mar 21 2026 3:36 AM

Hundreds of innocent civilians are dying every day in the war

అమెరికా, ఇజ్రాయెల్‌–ఇరాన్‌ల మధ్య సాగుతున్న యుద్ధంలో రోజూ వందల సంఖ్యలో అమాయక పౌరులు మరణిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టున్న ప్రపంచ దేశాధినేతలు పశ్చిమాసియాలో గత రెండు రోజుల పరిణామాలతో మేల్కొన్నట్టు కనబడుతోంది. చమురు, సహజవాయు క్షేత్రాలపై పరస్పరం చేసుకుంటున్న దాడుల్లో అయిదు దేశాల్లోని ఆరు క్షేత్రాలు తీవ్రంగా దెబ్బతినటమే అందుకు కారణం. 

దక్షిణ ఇరాన్‌లోని సహజ వాయు క్షేత్రం పార్స్‌ను ఇజ్రాయెల్‌ గురిచూసి కొట్టిన వెంటనే ప్రపంచంలోనే అతి పెద్ద ఖతార్‌ సహజవాయు క్షేత్రం రస్‌ లఫాన్‌పైనా, దాంతోపాటు సౌదీ అరేబియా, కువైట్, ఇజ్రాయెల్‌ చమురుశుద్ధి కర్మాగారాలపైనా ఇరాన్‌ దాడులకు దిగింది. ఈ దాడుల వల్ల ఒక్క ఖతార్‌ సహజవాయు క్షేత్రం రస్‌ లఫాన్‌లోని 17 శాతం నిక్షేపాలు ఆవిరయ్యాయి. 

యుద్ధం పరిసమాప్తమయ్యేవరకూ దాన్ని చక్కదిద్దటం అసాధ్యం. ఆ పనులకు దాదాపు అయిదేళ్లు పడుతుందంటున్నారు. అంటే అయిదేళ్ల ఖతార్‌ ఆదాయం 10,000 కోట్ల డాలర్లు మాయమైనట్టు! దీనివల్ల మన దేశంతో సహా ఆసియా, యూరప్‌ దేశాలు తీవ్రసంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే బ్రెంట్‌ ముడిచమురు బ్యారెల్‌ ధర 116 డాలర్లను దాటింది. అది 130కి చేరిందంటే అమెరికాతోపాటు అందరికీ కష్టాలు మొదలవుతాయి. 

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పరస్పర విరుద్ధ ప్రకటనలతో నవ్వులపాలవుతున్నారు. ఇరాన్‌ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్‌ ఇక దాడి చేయబోదని ఆ దేశం తరఫున ఆయన హామీ ఇచ్చారు. మరికొన్ని గంటలకే హార్మూజ్‌ దిగ్బంధాన్ని ఛేదించేందుకు ఇరాన్‌కు చెందిన ఖర్గ్‌ దీవిని స్వాధీనం చేసుకునే పథక రచన సాగిస్తున్నట్టు లీకులిచ్చారు. అసలు ఇజ్రాయెల్‌ తన ఆదేశం పాటిస్తుందని నిజంగా ట్రంప్‌ భావిస్తున్నారా? అది ఎప్పుడో ఆ స్థితిని దాటిపోయింది. 

ప్రస్తుతం ఇజ్రాయెల్‌ శక్తిమంతమైన సేవకుడిగా మారితే, అమెరికా బలహీనమైన యజమానిగా మిగిలిపోయింది. పశ్చిమాసియాలో ‘గ్రేటర్‌ ఇజ్రాయెల్‌’ ఆవిర్భవించటానికి వీలుగా చుట్టూవున్న ముస్లిం దేశాల్ని పాదాక్రాంతం చేసుకోవాలని 1996లోనే ఇజ్రాయెల్‌ పథక రచన చేసింది. గత అమెరికా అధినేతల దగ్గర దాని ఎత్తులు పారలేదు. తెలిసీ తెలియని ట్రంప్‌ ఆ కొరతను తీర్చారు. 

తమకు క్షిపణులకు కొరతేమీ లేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌ ఇస్లామిక్‌  రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రతినిధి అలీ మహమ్మద్‌ నైనిపై ఇజ్రాయెల్‌ దాడిచేసి హతమార్చింది. ఇలాంటి చర్యలు యుద్ధ విరమణను జటిలం చేస్తాయి తప్ప సాధించేదేమీ ఉండదు. యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించిన దశలో కూడా ఆ రెండు దేశాలూ అతిగా అంచనా వేసుకుంటూ, ఇరాన్‌పై తప్పుడు లెక్కలు కడుతున్నాయి. 

చట్టవిరుద్ధ మైన ఈ యుద్ధానికి మరో 20,000 కోట్ల డాలర్లు కావాలంటూ అమెరికన్‌ కాంగ్రెస్‌ను పెంటగాన్‌ అభ్యర్థించింది. ఇప్పటికే అమెరికన్‌ కుబేరులకు కోట్లాది డాలర్ల పన్ను రాయితీలిచ్చిన ప్రభుత్వం, సాధారణ ప్రజానీకానికి అందే అరకొర సదుపాయాలకు సైతం కోత పెడితే తప్ప ఈ నిధులు సమకూర్చుకోలేదు. ఈ అకారణ యుద్ధానికి ఇన్ని వేల కోట్లు దుర్వినియోగం చేయటం అవసరమా?

వీటి సంగతలా ఉంచి అత్యంత అమానవీయ పద్ధతుల్లో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ప్రాణాలు తీస్తున్న అమెరికా, ఇజ్రాయెల్‌ దుశ్చర్యల పర్యవసానాలేమిటో కనబడుతూనే ఉన్నాయి. ఓపెన్‌ ఏఐ, పాలంటీర్‌ కలిసి ఆంత్రోపిక్‌ రూపొందించిన క్లాడ్‌ ఆసరాతో మారణహోమానికి తోడ్పడుతున్నాయి. పదేళ్లుగా పాఠశాల నడుస్తున్న ఒక ఆవరణను ఏఐ ఇరాన్‌ సైనిక స్థావరంగా అర్థం చేసుకుని చూపితే, దాని ఆధారంగా అమెరికా క్షిపణి దాడికి పాల్పడి ఒకేసారి 170 మంది బాలబాలికల ప్రాణాలు తీసింది. 

సైనిక దాడులకోసం తమ సాఫ్ట్‌వేర్‌ ఇచ్చేది లేదని ట్రంప్‌కు చెప్పిన ఆంత్రోపిక్‌ అయినా, ఆ కాంట్రాక్టును చేజిక్కించుకుని లాభపడిన ఓపెన్‌ ఏఐ అయినా సారాంశంలో ఈ ప్రాణాంతక దాడులకు వ్యతిరేకం కాదు. ఆంత్రోపిక్‌ అభ్యంతరమల్లా ఆ సాఫ్ట్‌వేర్‌మరింత పదునుదేరాలన్నదే. ఆ తర్వాతే అందుబాటులోకి తీసుకురావాలని దానిఉద్దేశం. ప్రపంచ మనుగడ ఎంత ప్రమాదకరంగా మారిందో దీన్నిబట్టే గ్రహించవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement