కోకిల వెళ్లిపోయింది!

Editorial On Legendary Singer Lata Mangeshkar Passed Away - Sakshi

వసంతంలో కోకిల గొంతు సవరించుకుంటుంది. పంచమ శ్రుతిలో తన స్వరమాధుర్యాన్ని జనాలకు అయాచితంగానే పంచిపెడుతుంది. ఇది ప్రకృతి ధర్మం. కానీ, వసంత పంచమితో పాటూ ఆ గాన కోకిల వెళ్ళిపోయింది. ఎంత చేటుకాలం ఇది! ఎంత పాడుకాలం ఇది! మాయదారి మహమ్మారి ఇప్పటికే ఎందరెందరినో గద్దలా తన్నుకుపోయింది. మనసులకు మారాకులు వెయ్యనివ్వని ఆశ రాలుకాలం ఇది. కోకిలను పోగొట్టుకున్న అశేష సంగీతాభిమానులకు అకాల బాష్పవర్షాకాలం ఇది. ‘కరోనా‘ కరాళకాలం మొన్నటికి మొన్న మన గానగంధర్వుడిని గల్లంతు చేసింది.

అభిమానులు ఆ విషాదం నుంచి తేరుకుంటూ ఉన్నారనేలోగానే, మిగిలి ఉన్న గాన కోకిలనూ ఇప్పుడు తీసుకుపోయింది. వసంత పంచమి మరునాటి ఉదయమే అస్తమించిన గానకోకిల లతామంగేష్కర్‌ భారతీయ సినీసంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాణి. స్వతంత్ర భారతదేశంలో పుట్టిన వారిలో ఆమె స్వరఝరిలో తడిసి తరించనివారంటూ ఎవరూ ఉండరు. ఇది అతిశయోక్తి కాదు. స్వభావోక్తి మాత్రమే! ఆమె స్వరప్రస్థానం భారతదేశ స్వాతంత్య్ర ప్రస్థానంతో పాటే సాగింది. ఇన్నేళ్లలోనూ స్వాతంత్య్ర భారతం ఎన్నో ఎగుడుదిగుళ్లను చవిచూసింది గాని, లతా గాత్రం మాత్రం ఏనాడూ చెక్కుచెదరలేదు. వన్నెతరగని ఆమె స్వరమాధుర్యం దాదాపు ఏడున్నర దశాబ్దాలుగా కొన్నితరాల శ్రోతలను సేదదీర్చింది, ఊరడించింది, ఉర్రూతలూపి ఓలలాడించింది. లతా పాట ఎల్లలులేని పిల్లతెమ్మెర. ఆమె అభిమానుల్లో దేశాధినేతలు మొదలుకొని అమిత సామాన్యుల వరకు కోట్లమంది ఉన్నారు. లతా పాట గలగలల సెలయేరు. ఆమె అభిమానుల్లో ఉద్దండ పండితులూ ఉన్నారు, పరమ పామరులూ ఉన్నారు. లతా పాట జోలలూపే ఉయ్యాల. ఆమె అభిమానుల్లో పసిపిల్లలూ ఉన్నారు, పండు ముదు సళ్లూ ఉన్నారు. లతా పాట ఒక అమృత« దార. అక్షరాలా ఆబాలగోపాలాన్నీ అలరించిన అద్భుత గానమాధుర్యం ఆమెది. 

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో లతా మంగేష్కర్‌ ఒక హిమవత్‌ శిఖరం. సినీ సంగీత రంగంలో రాణించాలనుకునే ఔత్సాహిక గాయనీగాయకులకు ఆమె ఒక అత్యున్నత ప్రమాణం. ఆమెతో గొంతు కలిపితే చాలు, తమ జన్మ చరితార్థమైనట్లే అనుకునే యువ గాయకులు ఎందరో! ఆమె స్థాయిలో పదోవంతును అందుకోగలిగినా చాలు, తమ కెరీర్‌కు తిరుగుండదని భావించే కొత్తతరం గాయనీమణులు ఎందరో! ఆమె పాటలకు స్వరకల్పన చేసే అవకాశం దొరకడమంటే నవ తరం సంగీత దర్శకులకు అదొక హోదాచిహ్నం! ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరానికి చేరు కోవడం అంత ఆషామాషీ పని కాదు. ఒకసారి చేరుకున్నాక, కడవరకు ఆ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడం మరెంతటి కఠోరదీక్షతో సాధించిన ఘనత అయి ఉండాలి! ఆ ఘనత కారణంగానే దేశంలోని అత్యున్నత సత్కారమైన ‘భారతరత్న’ సహా అసంఖ్యాకమైన అవార్డులు, బిరుదులు, రాజ్యసభ సభ్యత్వం వంటి గౌరవ పదవులు ఆమెను కోరి మరీ వరించాయి. రాజ్యసభలో కొన సాగిన ఆరేళ్లూ రూపాయి వేతనమైనా తీసుకోకుండా సేవలందించిన అరుదైన వ్యక్తిత్వం ఆమెది.

పదమూడేళ్ల పసిప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న ఒక సాదాసీదా అమ్మాయి అంచెలంచెలుగా ఎదిగి, ఎవరూ అందుకోలేనంత స్థానానికి చేరుకోవడం దాదాపు ఊహాతీతం. సినిమాను తలపించే లతా జీవితంలో ఇది వాస్తవం. తొలినాళ్లలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూనే, సంగీత సాధన కొనసాగించేది. సినీ అవకాశాల కోసం ప్రయత్నించే తొలినాళ్లలో ‘పీల గొంతు’ అనే పెదవి విరుపులతో తిరస్కారాలనూ ఎదుర్కొంది. తిరస్కారాలకు చిన్నబుచ్చుకుని అక్కడితోనే ఆగిపోయి ఉంటే, ఆమె లతా అయ్యేదే కాదు. పట్టువదలని దీక్షతో ముందుకు సాగడం వల్లనే ఆమె రుతువులకు అతీతమైన ‘గానకోకిల’ కాగలిగింది.

మాతృభాష మరాఠీ, హిందీ పాటలకే పరిమితమై ఉంటే, లతా మంగేష్కర్‌కు ఇంతటి ప్రఖ్యాతి దక్కేది కాదు. ఆమె మన తెలుగు సహా అనేక భారతీయ భాషల్లో పాటలు పాడింది. అందుకే, దేశవ్యాప్తంగా మారుమూల పల్లెల్లోనూ ఆమెకు అభిమానులు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో సినిమా పాటలు పాడిన గాయనిగా 1974లోనే గిన్నిస్‌ రికార్డు సాధించిన ఘనత ఆమెకే దక్కింది. అప్పటికే ఆమె వివిధ భాషల్లో పాతికవేల పైగా పాటలు పాడింది. శతాధిక సంగీత దర్శకుల స్వరకల్పనలకు తన గాత్రంతో ప్రాణం పోసింది. నాలుగు తరాల గాయకులతో గొంతు కలిపింది. ఐదు చిత్రాలకు సంగీతం అందించడమే కాక, 4 చిత్రాలను నిర్మించింది. తన సుదీర్ఘ ప్రస్థానంలో ఆమె అందుకోని విజయాల్లేవు. ఆమె గొంతు పలకని భావోద్వేగాలు లేవు. ఆమె గాత్రంలో ఒదగని సంగతులు లేవు. 

భారతదేశంలో లతా భాషాతీతంగా ప్రతి ఇంటి అభిమాన గాయని. అందుకే, ఆమె మరణవార్త యావత్‌ దేశాన్ని్న విషాదసాగరంలో ముంచేసింది. ఆమె మరణవార్త వెలువడిన మరునిమిషం నుంచే సామాజిక మాధ్యమాల్లో సంతాప సందేశాల ప్రవాహం మొదలైంది. ఆమె జ్ఞాపకాలను తలచుకుంటూ అభిమానులు ఆమె పాటల వీడియోలతో పెట్టిన పోస్టులతో సామాజిక మాధ్య మాలు హోరెత్తిపోవడం మొదలైంది. లతానే ప్రేరణగా తీసుకుని, ఆమె స్ఫూర్తితోనే సినీసంగీత రంగంలోకి అడుగుపెట్టిన సంగీత కళాకారులంతా ఆమె మరణవార్తకు కన్నీరు మున్నీరయిన దృశ్యా లను టీవీల్లో చూసిన అభిమానులూ కన్నీటి పర్యంతమయ్యారు. భారతీయ సినీ సంగీతరంగంలో ఎందరో గాయనీమణులు ఉన్నా, లతా మంగేష్కర్‌ది ఒక అత్యున్నత ప్రత్యేకస్థానం. ఇప్పుడది ఖాళీ అయిపోయింది. దానినెవరూ ఎప్పటికీ భర్తీ చేయలేరు!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top