జొకోవిచ్‌ లడాయి

Editorial About Novak Djokovic Issue Australian Government Controversy - Sakshi

కరోనా అనంతర ప్రపంచంలో దేశాల మధ్య తలెత్తగల విభేదాల గురించి నిపుణులు కొన్నాళ్లక్రితం చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి. టెన్నిస్‌ చాంపియన్‌ జొకోవిచ్‌ వ్యవహారం ఆ విభేదాలను  బయటపెట్టింది. ఈ నెల మొదట్లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనేందుకు వచ్చిన జొకోవిచ్‌ను ఆ దేశ సరిహద్దు భద్రతా దళం అడ్డగించింది. అతని వీసా రద్దయినట్టు ప్రకటించి, వెనక్కు పంపించేందుకు ప్రయత్నించింది. దానికి ముందు బోలెడు ప్రశ్నలతో వేధించింది. దీన్ని అక్కడి న్యాయస్థానం ఈ నెల 10న తోసిపుచ్చి జొకోవిచ్‌ను అనుమతించింది. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం శుక్రవారం మరోసారి వీసాను రద్దు చేసింది. మూడేళ్ల నిషేధం విధించేందుకు సిద్ధపడుతోంది.

ఈ మొత్తం వ్యవహారంపై జొకోవిచ్‌ అభిమానులతోపాటు అతని మాతృదేశమైన సెర్బియా కూడా తీవ్రంగానే స్పందించడం గమనించదగ్గ అంశం. జొకోవిచ్‌ ఇప్పటికి తొమ్మిదిసార్లు ఆస్ట్రేలియా ఓపెన్‌ టైటిల్‌ గెల్చుకున్నాడు. పదోసారి సైతం సొంతం చేసుకొనేందుకు తగిన అనుమతులతోనే అడుగుపెట్టాడు. ఇతర టెన్నిస్‌ దిగ్గజాలైన నాడల్, రోజర్‌ ఫెదరర్‌లకు భిన్నంగా మైదానంలోనూ, వెలుపలా తన దురుసు ప్రవర్తనతో జొకోవిచ్‌ పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ కరోనా వ్యాక్సిన్‌ విష యంలో అతని అభిప్రాయాలు ఎక్కువమందికి మింగుడుపడనివి. అవి ఎందుకూ పనికిరావనీ, పైపెచ్చు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయనీ అతని నిశ్చితాభిప్రాయం. సైన్సును కూడా జొకోవిచ్‌ కొట్టిపారేస్తాడు. అయితే ప్రస్తుత వివాదం వ్యాక్సిన్‌పై కాదు. ఈమధ్యే కోవిడ్‌ వచ్చి తగ్గిందని, కనుక వ్యాక్సిన్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలంటున్నాడు. కానీ కోవిడ్‌ వచ్చిందని చెబుతున్న తేదీల్లో అతను వివిధ కార్యక్రమాల్లో మాస్క్‌ సైతం లేకుండా పాల్గొన్నట్టు చూపే వీడియోలున్నాయి. 

వ్యాక్సిన్‌ల విషయంలో వ్యతిరేకత ప్రదర్శించేవారు ప్రపంచవ్యాప్తంగా గణనీయంగానే ఉన్నారు. కానీ జొకోవిచ్‌ లాంటి సెలబ్రిటీ ఆ మాట అంటే దానికుండే ప్రభావం వేరు. నిజానికి వ్యాక్సిన్ల పని తీరుపై శాస్త్రవేత్తల అంచనాలకూ, వాస్తవ పరిస్థితులకూ పొంతన లేని స్థితి ఉండటం ఎవరూ కాదనలేనిది. వైరస్‌ కారణంగా తలెత్తే వ్యాధులను ఎదుర్కొనే క్రమంలో ఇది వింతేమీ కాదు. కొరకరాని కొయ్యలాంటి కరోనా సంపూర్ణంగా అర్థం కావడానికి, దాన్ని పూర్తి స్థాయిలో అదుపు చేయడానికి మరికొంత సమయం పట్టినా ఆశ్చర్యంలేదు. మొత్తం జనాభాకు రెండు డోస్‌ల వ్యాక్సిన్‌లతోపాటు బూస్టర్‌ డోస్‌ కూడా అందించిన ఇజ్రాయెల్‌ వంటి దేశాలను ఈ మహమ్మారి పోకడ అయోమయంలోకి నెట్టింది. తాజాగా ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటంతో అక్కడి జనాభాకు నాలుగో డోస్‌ కూడా ఇవ్వకతప్పడం లేదు. బూస్టర్‌ డోస్‌ సైతం వేయించుకున్నవారిని మాత్రమే అనుమతించిన ప్రదేశాల్లో కూడా ఒమిక్రాన్‌ వ్యాప్తి చెందుతున్నట్టు పలు దేశాల్లో గుర్తిం చారు. అందుకే మనతోపాటు అనేక దేశాలూ పౌరులకు మరోసారి వ్యాక్సిన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. 

అయితే జొకోవిచ్‌ వ్యవహారం పూర్తిగా వ్యాక్సిన్‌కు సంబంధించిందేనా, కాదా అనే అంశంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి. వచ్చే మే నెలలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ కావాలని దీన్నొక సమస్యగా మార్చారన్న ఆరోపణలున్నాయి. ఆ సమయానికల్లా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య పెరిగితే, జొకోవిచ్‌ విషయంలో కఠినంగా ఉన్న తనకు అది లాభిస్తుందన్న అభిప్రాయం ఉందంటున్నారు. కరోనా నియంత్రణకు అనుసరించే విధానాలు ప్రపంచమంతటా ఒకే మాదిరి లేవు. అలాంటి ప్రొటోకాల్‌ అవసరమని అనేక దేశాలు చాన్నాళ్లుగా కోరుతున్నాయి. అయినా పట్టించుకునేవారు లేరు. ఆస్ట్రేలియా ప్రస్తుత వీసా నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి.  

తన పౌరులతోపాటు విదేశాలనుంచి వచ్చేవారి విషయంలోనూ ఆస్ట్రేలియా చాలా నిర్దయగా ఉంటుందన్న పేరుంది. అక్కడ వివిధ రాష్ట్రాల మధ్య కూడా వ్యత్యాసాలున్నాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో అడుగుపెట్టినవారు  పశ్చిమ ఆస్ట్రేలియాకు లేదా విక్టోరియాకు వెళ్లాలనుకుంటే మధ్యలో ప్రతి రాష్ట్రంలోనూ క్వారంటైన్‌ పాటించక తప్పదు. ఇలా పాటిస్తూ గమ్యస్థానం చేరాలంటే ఒకటి రెండు నెలలు పడుతుంది. విదేశీయుల సంగతలా ఉంచి వేరే దేశాల్లో చిక్కుబడిన పౌరులు స్వదేశం రావడానికి కూడా అవకాశంలేని స్థితి ఏర్పడింది. అలాగని క్వారంటైన్‌ కేంద్రాలు సక్రమంగా ఉంటున్నాయన్న నమ్మకం లేదు. మెల్‌బోర్న్‌లోని ఒక క్వారంటైన్‌ కేంద్రం దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తికి ప్రధాన కారణమైందని తేల్చారు. ఇప్పుడు జొకోవిచ్‌ను ఆ  కేంద్రంలోనే ఉంచారు. 

తమ పౌరులు సురక్షితంగా ఉండాలని, అందుకు అనువుగా విదేశీయులను నియంత్రించాలని ఆస్ట్రేలియా భావిస్తే తప్పుబట్టాల్సిన అవసరం లేదు. కానీ ప్రపంచీకరణ తర్వాత దేశాలమధ్య రాకపోకలు పెరిగిన వర్తమానంలో ఇది అంత సులభమేమీ కాదు. ఆ మాదిరి ఆంక్షలు దేశాల మధ్య అపోహలకూ, అపార్థాలకూ దారితీస్తాయి. అవి ముదిరి వైరంగా కూడా మారొచ్చు. ఇప్పుడు సెర్బియా వైఖరి ఆవిధంగానే ఉంది. జొకోవిచ్‌ ను అడ్డగించడం ద్వారా తమ ఆత్మాభిమానాన్ని ఆస్ట్రేలియా దెబ్బతీసిందని సెర్బియా భావిస్తోంది. వ్యాక్సిన్‌ల విషయంలో తలెత్తుతున్న సందే హాలు, వివిధ దేశాల వీసా నిబంధనలపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు మున్ముందు ఇంకా పెరగ వచ్చు. కనుక ప్రపంచ దేశాలన్నీ సాధ్యమైనంత త్వరగా అందరికీ ఆమోదయోగ్యమైన నిబంధనలు రూపొందించుకోవటం మేలు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top