
శ్రీమహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహస్వామి రూపంలో వెలిశాడని లక్షలాదిమంది భక్తులు విశ్వ సించే సింహాచల క్షేత్రం గురించి తెలియని వారెవరూ లేరు. ఏటా గంధం అమావాస్య తర్వాత వచ్చే అక్షయ తృతీయనాడు ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవం సందర్భంగా భక్తజనం పోటెత్తుతారు. భక్తుల విశ్వాసాలతో అంతగా ముడిపడి వుండే ఈ చందనోత్సవ సమయంలో చిన్న దుర్ఘటనైనా చోటుచేసుకున్న ఉదంతం ఆలయ చరిత్రలో లేదు. అలాంటిచోట కళ్లుమూసుకుపోయిన పాలకుల సాక్షిగా అపచారం జరిగిపోయింది.
కొత్తగా నిర్మించిన గోడ కూలి బుధవారం వేకువజామున ఏడు గురు భక్తులు మరణించటం అందరినీ కలచివేసింది. అసలు చందనోత్సవంనాడు అడుగడుగునా చోటుచేసుకున్న అరాచకం గమనిస్తేనే ఈ ప్రభుత్వానికి పవిత్రోత్సవాలపై భక్తిశ్రద్ధల మాటఅటుంచి ఏదైనా అనుకోనిది సంభవిస్తుందేమోనన్న భయం కూడా లేదని అందరికీ అర్థమైంది. వీఐపీ టిక్కెట్లు, పాస్‌లు పంచుకోవటానికి పెట్టిన శ్రద్ధలో వెయ్యోవంతైనా భక్తులకు సౌకర్యాల కల్పనలో, వారి భద్రతకు చర్యలు తీసుకోవటంలో లేవు. ప్రమాదాలు చెప్పి రావు.
అందుకేముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. అంబులెన్స్‌లు, పారా మెడికల్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్‌బృందాలు అందుబాటులో ఉంచుతారు. కానీ విషాదం సంభవించిన క్షణాల్లో బాధితులది అరణ్య రోదనే అయింది. ప్రమాదంలో చిక్కుకున్నవారూ, ఇతరులూ ఆర్తనాదాలు చేస్తుండగా అరగంటకు అధికారులు వచ్చారు. ప్రయోజనం ఏముంది? 3.05 గంటలకు ప్రమాదం జరిగితే ఆ తర్వా తెప్పుడో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది అడుగుపెట్టారు. ముందస్తు ఏర్పాట్లుంటే ఆ ఏడుగురూ... లేదా కనీసం వారిలో కొందరైనా ప్రాణాలతో బయటపడేవారు.
వెనక్కి తిరిగిచూస్తే ఈ తరహా విషాద ఉదంతాలు ఆయన అధికారం వెలగబెట్టే సమయంలో ఎన్నో జరిగాయని తెలుస్తుంది. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ప్రారంభంనాడే తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం ఎవరూ మరిచిపోలేరు. చిన్నపిల్లలూ, వృద్ధులూ తెల్లారుజామున 4 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తుండగా చంద్ర బాబు సకుటుంబ సమేతంగా ఉదయం 8.30కు స్నానాదికాలు ముగించుకుని నిష్క్రమించేవరకూ ఎవరినీ అనుమతించలేదు. తర్వాత హఠాత్తుగా స్నానఘట్టానికున్న ఏకైక ప్రవేశ ద్వారాన్ని తెరి చారు.
తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకొని భక్తులు కన్నుమూశారు. కృష్ణా పుష్కరాల్లో సుందరీకరణ పేరిట వందల ఆలయాలను కూల్చి, వాటిల్లోని విగ్రహాలను చెత్తబండ్లలో తరలించటం కూడా బాబు హయాంలోని ముచ్చటే. మళ్లీ ఈ పదకొండు నెలల కాలంలో వరస విషాద ఉదంతాలు చోటుచేసుకున్నాయి. బాధ్యతాయుత స్థానంలో వున్నానన్న ఇంగితం కూడా లోపించి తిరుమల వేంకటేశుని లడ్డూ కల్తీ జరిగిందంటూ ఆయనే తప్పుడు ప్రచారాన్ని లంకించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముందస్తు ఏర్పాట్ల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆరుగురు భక్తులు మరణించారు.
ఇక టీటీడీ గోశాలలో గోవుల మృతిఉదంతం సాధారణ భక్తుల ఊహకందనిది. అసలు అలాంటిదేమీ లేదని బాబు బుకాయించగా టీటీడీ చైర్మన్, ఈవోలు మృతిచెందిన గోవుల సంఖ్య గురించి తోచిన అంకెలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దశాబ్దాలుగా హైందవ ధర్మానికీ, దాతృత్వానికీ ప్రతీకగా వున్న కాశీ నాయన ఆశ్రమాన్ని ఈ ప్రభుత్వమే స్వహస్తాలతో నేలమట్టం చేసింది. పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం క్షేత్రంలో ఇటీవల తాబేళ్లు చనిపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది.
ఏమైంది ఈ సర్కారుకు? పగలూ, ప్రతీకారాలూ తీర్చుకోవటానికి పదకొండు నెలల సమయం చాల్లేదా? పాలనపై దృష్టి పెట్టేదెప్పుడు? అసలు చందనోత్సవం వంటి ముఖ్య ఘట్టం కోసం ప్రభుత్వపరంగా చేసిందేమిటి? ఇందుకోసం నియమించిన కమిటీలో మంత్రులకు లోటులేదు. అయిదుగురున్నారు. హైలెవెల్ కమిటీ అన్నారు. అందులో ఒక్కరంటే ఒక్కరికి కొత్తగా కట్టిన గోడ ఎలా వుంటుందో తెలియదు. ఎలాంటిచోట నిర్మించారో, దేంతో నిర్మించారో, నిర్మించి ఎన్నాళ్ల యిందో అంతకన్నా తెలియదు. చందనోత్సవంనాడు వాన పడటం అక్కడ రివాజని కూడా తెలిసి వుండదు.
కొండధారలు, ఆకాశగంగ, మాడవీధుల్లో పడిన వర్షమంతా ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలోని మెట్లపై నుంచి కిందకు పోతుందని తెలిసే గతంలోనే రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ పునర్నిర్మాణం పేరిట పాత గోడను తొలగించి అత్యంత నాసిరకంగా నిర్మించిన పర్యవసానంగా ఘోరం జరిగిపోయింది. ఒకరిద్దరు పెద్దలతోపాటు బంగారు భవిష్యత్తుగల యువభక్తులు కూడా తప్పించుకునే మార్గం దొరక్క సజీవసమాధి అయ్యారు. కూలిన గోడ వెనకున్న గూడుపుఠాణీ కథే వేరు. సొంత మీడియా సైతం దాచలేని కంతలు అందులో ఎన్నెన్నో! మంత్రులు దీనికి బాధ్యత వహించాలి.
కానీ, వర్షం మీదా, చిన్న ఉద్యోగుల మీదా దీనిని నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. తీరి కూర్చుని ఇలాంటి వరస విషాద ఉదంతాలకు కారణమవుతున్న సర్కారుకు ఒక్కరోజైనా అధికారంలో కొనసాగే నైతికార్హత వుందా? లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిని, మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొని రెండ్రోజులైనా గడవకముందే ఆర్భాటంగా అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం జరిపారు. కానీ మరణించిన భక్తులస్మృతిలో ఒక్క నిమిషం మౌనం పాటించాలన్న స్పృహ, కనీసం నివాళులర్పించాలన్న ఇంగితం ఒక్కరికీ లేకపోయింది. ఇదే అసలైన విషాదం.