ఫ నేటి కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు
ఫ రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
అన్నవరం : రత్నగిరి వాసుడు సత్యదేవుని గిరి ప్రదక్షిణ మహోత్సవానికి వేళయ్యింది. మంగళవారం జరిగే ఈ కార్యక్రమానికి రెండు లక్షలకు పైగా భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, సత్యదేవుని గిరిప్రదక్షిణకు భద్రతా ఏర్పాట్లను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందుమాధవ్ సోమవారం పరిశీలించారు. చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీకి ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు వివరించారు. గిరి ప్రదక్షిణ జరిగే విధానాన్ని దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఇదిలా ఉంటే, గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై సాయంత్రం దేవదాయ శాఖ ఆర్‌జేసీ (రాజమహేంద్రవరం) వి.త్రినాథరావు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన గిరిప్రదక్షిణ రోడ్డును కూడా పరిశీలించారు. విభాగాల వారీగా చేసిన ఏర్పాట్లను తెలుసుకుని తగు ఆదేశాలిచ్చారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ చక్రధరరావు, లోవ దేవస్థానం ఈఓ విశ్వనాథరాజు పాల్గొన్నారు.
కార్యక్రమాల ప్రణాళిక ఇలా..
ఉదయం 7–30 గంటలకు సత్యదేవుడు, అమ్మవారిని పల్లకిపై కొండ దిగువన తొలిపావంచా వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఊరేగింపు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సత్యదేవుని ప్రచారరథం సత్యదేవుని తొలిపావంచా వద్దకు చేరుకుంటుంది. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు పూజలు చేసిన అనంతరం 1.15 గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. తొలి పావంచా నుంచి హైవే ఆర్చి వరకు రెండు కిలోమీటర్ల అన్నవరం మెయిన్ రోడ్డు మీద, ఆర్చి నుంచి బెండపూడి శివారు పుష్కర కాలువ వరకు 1.5 కిలోమీటర్ల జాతీయ రహదారి –16పై రాజమహేంద్రవరం –విశాఖపట్నం లైన్‌లో గిరిప్రదక్షిణ కొనసాగుతుంది. జాతీయ రహదారి పక్కన నిర్మించిన సర్వీస్ రోడ్డు నుంచి పుష్కర కాల్వ రోడ్డు వరకు, అక్కడి నుంచి పంపా నది వరకు ఐదు కిలోమీటర్ల మెటల్ రోడ్డుపై గిరిప్రదక్షిణ సాగుతుంది. మార్గం మధ్యలో 12 చోట్ల మంచినీరు, పాలు, బిస్కెట్లు, పులిహోర, పండ్లు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. అదే విధంగా ఐదు చోట్ల టాయిలెట్స్, భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా నాలుగు చోట్ల సౌకర్యాలు కల్పించారు. గిరిప్రదక్షిణ పూర్తయ్యేటప్పటికి సాయంత్రం ఆరు గంటలు దాటే అవకాశం ఉండడంతో మార్గంలో విద్యుత్ దీపాలు అమర్చారు. సాయంత్రం ఆరు గంటలకు పంపా నది వద్ద తెప్పోత్సవ పంటుపై సత్యదేవుని పంపా నదీ హారతుల కార్యక్రమం నిర్వహించనున్నారు. సత్యదేవునికి తొలుత పూజల అనంతరం అర్చకస్వాములు పంపా నదికి చీర, సారె సమర్పిస్తారు. రాత్రి ఏడు గంటలకు తొలి పావంచా వద్ద సత్యదేవుని జ్వాలాతోరణం జరుగుతుంది.
అన్నవరంలో ట్రాఫిక్ ఆంక్షలు
సత్యదేవుని గిరి ప్రదక్షిణ సందర్భంగా మంగళవారం లక్షలాదిగా భక్తులు తరలి రానున్నందున అన్నవరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు గ్రామంలోకి లారీలు, టిప్పర్లు, గూడ్స్ వ్యాన్లకు అనుమతి ఉండదు. విశాఖపట్నం వైపు నుంచి ఆర్టీసీ బస్సులు అన్నవరంలోకి సాధారణ మార్గంలో కాకుండా జాతీయ రహదారి మీదుగా బెండపూడి వైపు జంక్షన్ నుంచి అన్నవరం జూనియర్ కళాశాల మైదానం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి తిరిగి అదే మార్గంలో వెనక్కి వచ్చి జాతీయ రహదారిని చేరుకోవాలి. అదే విధంగా కాకినాడ– రాజమహేంద్రవరం నుంచి వచ్చే బస్సులు కూడా జూనియర్ కళాశాల మైదానం వరకు మాత్రమే అనుమతిస్తారు. అక్కడి నుంచి తిరిగి అదే దారిలో వెనక్కి వచ్చి జాతీయ రహదారిని చేరుకోవాలి. గిరి ప్రదక్షిణకు భక్తులు బైకులపై రాకూడదని, ఆటోలను కూడా గిరిప్రదక్షిణ రోడ్డుపైకి అనుమతించరని ఎస్సై తెలిపారు.


