బాండ్ పేపర్‌పై
ఎన్నికల హామీ
రాజవొమ్మంగి: స్థానిక గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న కనిగిరి దుర్గాప్రసాద్ సోమవారం వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. తనకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్పంచ్‌గా గెలిస్తే తాను చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఓ బాండ్ పేపర్‌పై రాసి వాటి ప్రతులను ఓటర్లకు పంచిపెట్టారు. ముఖ్యంగా రాజవొమ్మంగి పంచాయతీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు చెక్ పెడతానని హామీ ఇచ్చారు. రాజవొమ్మంగి శాంతినగర్ మధ్య వట్టిగెడ్డ వాగుపై వంతెన, రాజవొమ్మంగి పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేసే ప్రయత్నం, స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి, పారిశుధ్య కార్మికుల సంఖ్య పెండడం, ఇంటింటికి పైపులైన్లు, కుళాయిల ఏర్పాటు తదితర హామీలు ఇచ్చారు. వైఎస్సార్ సీపీ మద్దతుతో ఆయన బరిలోకి దిగారు.
అంబాజీపేట: ఓటర్లకు ఎన్నికల సేవలను మరింత చేరువ చేసేందుకు భారత ఎన్నికల సంఘం ’ఈసీఐనెట్’ యాప్‌ను ప్రవేశపెట్టింది.
గతంలో ఎన్నికల సేవల కోసం అనేక యాప్‌లు, పోర్టర్లను ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పెడుతూ, 40కి పైగా ఎన్నికల సేవలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకొచ్చారు.
ప్రధాన సేవలు
కొత్త ఓటు – సవరణలు: కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునేవారు ఫారం–6, అలాగే వివరాల్లో మార్పులు లేదా చిరునామా మార్పు కోసం ఫారం–8 ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓటరు జాబితా: ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తనిఖీ చేసుకోవడంతో పాటు, డిజిటల్ ఓటరు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తు స్థితి: మనం చేసుకున్న దరఖాస్తు ఏ దశలో ఉందో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు.
అధికారులతో అనుసంధానం: తమ ప్రాంత బూత్‌స్థాయి అధికారి, ఇతర ఎన్నికల అధికారుల వివరాలు తెలుసుకోవడం, అవసరమైతే బీఎల్డీఓతో కాల్ బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.
ఫిర్యాదులు అభ్యర్థుల వివరాలు: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు చేయడంతో పాటు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్లు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఉపయోగపడుతుంది.


