వరిస కష్టాలు | - | Sakshi
Sakshi News home page

వరిస కష్టాలు

Nov 18 2026 12:14 AM | Updated on Nov 18 2026 12:14 AM

అన్నదాతలను వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రెండు తుపానుల ధాటికి తీవ్రంగా నష్టపోయిన వారిని ఇప్పుడు ఆక్వాన్‌ తుపాను హెచ్చరికలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉన్న వరి పంటను ఒబ్బిడి చేసుకునే పనిలో పడడంతో కోత యంత్రాలు, కూలీలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో రైతులపై అదనపు భారం పడింది.

ఆలమూరు: ఖరీఫ్‌ సీజన్‌లో వరిసాగును చిన్నాభిన్నం చేసిన అర్నబ్‌, మురసు తుపానుల బీభత్సాన్ని మరువకు ముందే మరోసారి ఆక్వాన్‌ తుపాన్‌ సంభవిస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అన్నదాతలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే నేలకొరిగిన వరి పంటను నిలబెట్టి కోత కోసేందుకు సిద్ధపడుతుండగా మరి కొందరు వరి కోత యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. అంతలోనే ఈ నెల 19, 20 తేదీల్లో అక్వాన్‌ తుపాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇప్పటికే దెబ్బతిన్న పంటను ఏవిధంగానైనా సంరక్షించుకోవాలని కోనసీమ జిల్లాలోని పలు మండలాల్లోని రైతులు వరికోత యంత్రాలు, కూలీలపై ఒకేసారి ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వరికోత యంత్రాలకు భారీ డిమాండ్‌ నెలకొంది. వర్షాలు కురిస్తే చేలల్లో యంత్రాలు తిరగవనే భయంతో రైతులు రేయింబవళ్లు వరి కోతలు కోయిస్తున్నారు. దీనివల్ల రెండు రోజుల నుంచి ఒక్కసారిగా రికార్డు స్థాయిలో కూలి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. అలాగే నేలనంటిన వరిచేలను కోసేందుకు వరి కోత యంత్రాలకు అధిక సమయం పట్టడంతో పెట్టుబడి తీవ్రత అధికమవుతోంది. ఖరీఫ్‌లో దెబ్బతిన్న పంటకు పరిహారం అందిస్తామన్న ప్రభుత్వం ఇంకా స్పందించక పోవడంపై రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

వేధిస్తున్న కూలీల కొరత

ఆక్వాన్‌ తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో ఖరీఫ్‌ సీజన్‌లో పండించిన పంటను ఒబ్బిడి చేసుకోవాలన్న రైతుల ఆశలపై కూలీల కొరత నీళ్లు చల్లుతోంది. కొత్తపేట, రామచంద్రపురం, పి,గన్నవరం నియోజకవర్గాల పరిధిలోని తమ పంటను కోయిస్తున్నారు. పురుషులకు రూ.1100, మహిళలకు రూ.800 వరకూ కూలి చెల్లిస్తున్నారు. సాధారణ పరిస్థితుల్లో వ రికోతకు ఎకరాకు ఆరుగురు కూలీలు సరిపోగా ప్రస్తుతం ఆ సంఖ్య 11కి చేరింది.

అందుబాటులో లేని యంత్రాలు

రైతులందరకూ ఒకేసారి కోతలు కోస్తుండటంతో వరి కోత యంత్రాలకు అధిక డిమాండ్‌ ఏర్పడింది. గతంలో మాదిరిగా ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి వరికోత యంత్రాలను తీసుకువచ్చే పరిస్థితులు లేకపోవడంతో స్థానికంగా అందుబాటులో ఉండే వరికోత యంత్రాలనే ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల వరికోత యంత్రాలు దొరికితే చాలు అనే పరిస్థితి రైతుల్లో నెలకొంది. గతంలో సుమారు గంట సమయంలో ఎకరం చేనును కోసే వీలుండగా ప్రస్తుతం ఆ సమయం మూడున్నర గంటలకు చేరింది. దీంతో ఎకరానికి రూ.పది వేలకు అదనపు భారం పడుతోంది.

అన్నదాతలకు వరుస కష్టాలు

ఆక్వాన్‌ తుపాను హెచ్చరికలతో బెంబేలు

వరి పంటను కాపాడుకునేందుకు తంటాలు

కోత యంత్రాలు, కూలీలకు డిమాండ్‌

ఎకరానికి రూ.పదివేలు అదనపు భారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement