మద్యం మత్తులో చంపేశాడు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో చంపేశాడు

Nov 18 2026 12:14 AM | Updated on Nov 18 2026 12:14 AM

● వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ

● నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

తుని: సంచలనం సృష్టించిన తునిలో మహిళ హత్య కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. తుని పట్టణంలోని గాంధీ సత్రం వంటశాల గది వద్ద గత నెల 3వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఎన్‌ఎస్‌ వెంకటాపురం గ్రామానికి చెందిన గుడాల వెంకటలక్ష్మి (60) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె కుమారుడు సత్తిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుని టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.గీతా రామకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఎస్పీ జి. బిందు మాధవ్‌ ఆదేశాల మేరకు, అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఎం.కిశోర్‌ కుమార్‌, పెద్దాపురం ఎస్‌డీపీవో ఏబీజీ తిలక్‌ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ఈ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో గాలించి, సాంకేతికతను ఉపయోగించి విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గజ్జలవలస గ్రామానికి చెందిన నిందితుడు గొర్లి సింహాచలాన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి వెంకటలక్ష్మికి చెందిన ఒక జత పట్టీలు, చీరతో పాటు అతడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హత్యకు జరిగిన తీరు

కుటుంబ కలహాల కారణంగా భార్యకు దూరంగా ఉంటున్న సింహాచలం తుని, కాకినాడ, హైదరాబాద్‌ ప్రాంతాల్లో కూలి పనులు చేసుకుంటూ రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో తలదాచుకునేవాడు. మద్యం బానిసైన అతడు అక్టోబర్‌ 3న తుని రైల్వే స్టేషన్‌ పరిధిలో వెంకటలక్ష్మితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ఆమెను గాంధీ సత్రం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత జరిగిన ఘర్షణలో కోపోద్రిక్తుడై వెంకటలక్ష్మి దవడపై కొట్టి, చీరతో గొంతు బిగించి, తలను గచ్చుకేసి గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె వద్ద ఉన్న పట్టీలు, చీరను తీసుకుని పారిపోయాడు.

నిందితుడిపై పలు కేసులు

సింహాచలంపై 2024లో మన్యం జిల్లా సీతంపేట పోలీస్‌ స్టేషన్‌లో రేప్‌, పోక్సో కేసు నమోదైంది. అరెస్ట్‌ వారెంట్‌ పెండింగ్‌లో ఉంది. 2020లో కొమరాడ పోలీస్‌ స్టేషన్‌లో భార్య ఫిర్యాదు మేరకు వేధింపుల కేసు నమోదు చేశారు. 2018లో అరిలోవ పోలీస్‌ స్టేషన్‌లో యాక్సిడెంట్‌, 2018లో విజయనగరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. కాగా.. తునిలో మహిళ హత్య కేసును చేధించిన తుని సీఐ గీతా రామకృష్ణ, ఎస్సై జె.విజయబాబు, సిబ్బంది చిటికెల అప్పల నాయుడు, గొర్లి నాని, సుభాష్‌ చంద్రబోస్‌, సమాన శివయ్య, ఎన్‌ జ్యోతిలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement