ద్వారకాతిరుమల: తన కుమారుడి మృతిపై అనుమానాలున్నాయంటూ తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ఖననం చేసిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఎం.నాగులపల్లికి చెందిన చవటపల్లి రవితేజ (24) ట్రక్కు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 6న భీమవరం కిరాయికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. మరుసటిరోజు తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. మృతికి కారణాలు తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు అదే రోజు మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా.. నాలుగు నెలల క్రితం వివాహమైన ఇదే గ్రామానికి చెందిన యువతి.. రవితేజ మృతి చెందిన రోజు నల్లజర్ల మండలంలోని తన పుట్టింటికి వెళ్లి ఈ నెల 9న ఆత్మహత్యకు పాల్పడింది. రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో రవితేజ మృతికి ఆత్మహత్య కాకుండా మరేదైనా కారణం ఉందా అనే అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో అతడి తల్లి ఈ నెల 14న ద్వారకాతిరుమల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా ఎస్సై టి.సుధీర్, 15న భీమడోలు సీఐ పి.కృష్ణతో కలిసి రవితేజ ఇంటిని పరిశీలించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. ఖననం చేసిన రవితేజ మృతదేహాన్ని మంగళవారం వెలికితీసి వైద్య బృందంతో పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ జేవీ సుబ్బారావు, సీఐ కృష్ణ, ఎస్సై సుధీర్ పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా మృతికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని, అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పొదల్లో పసికందు
మృతదేహం
పిఠాపురం రూరల్: రాపర్తి గ్రామంలోని పొదల సమీపంలో మంగళవారం కొన్ని కుక్కలు గుంపుగా చేరి దేనినో పీక్కుతినడాన్ని స్థానికులు గమనించారు. మొదటి పట్టించుకోకపోయినా అనుమానం వచ్చి దగ్గరకు వెళ్లి చూడగా అది శిశువు మృతదేహమని గుర్తించారు. వెంటనే కుక్కలను చెదరగొట్టి దగ్గరకు వెళ్లి చూడగా అది ఆడ శిశువు మృతదేహంగా తేలింది. వెంటనే ఈ విషయాన్ని గ్రామ వీఆర్వోకు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు, రెవెన్యూ, ఐసీడీఎస్, అంగన్‌వాడీ సిబ్బంది ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఆడ శిశువు జన్మించిందనే కారణంతో ఎవరైనా చిన్నారిని పొదల్లో వదిలివెళ్లి ఉంటారా? అన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గత పది రోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది గర్భిణులు ఉన్నారు, వారిలో ఎంతమందికి ప్రసవాలు జరిగాయి అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


