కోరుకొండ జెడ్పీటీసీ కౌంటింగ్‌పై వివాదం
సాక్షి, రాజమహేంద్రవరం: పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరగాల్సిన కౌంటింగ్ ప్రక్రియలో పక్షపాత ధోరణి ప్రదర్శించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి పార్టీల నాయకులు, అభ్యర్థులు అడిగిందే తడవుగా రీకౌంటింగ్‌కు అనుమతించిన అధికారులు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు అభ్యర్థించిన చోట మాత్రం కనీసం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితాలు వెలువడిన తర్వాత కూడా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన అభ్యర్థులు రీకౌంటింగ్ కోరడం సహజం. అలాంటి సందర్భాల్లో నిబంధనల ప్రకారం అభ్యర్థనను పరిశీలించి, న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాల్సిన అధికారులు.. ఏకపక్షంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కొన్ని చోట్ల రీకౌంటింగ్ పేరుతో ఫలితాలు తారుమారయ్యాయని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తుండగా, మరికొన్ని చోట్ల తమ అభ్యర్థనలను తిరస్కరించి కూటమి అభ్యర్థుల విజయానికి అధికారులు సహకరించారని మండిపడుతున్నారు.
చెల్లని ఓట్లతో అధికారుల చెలగాటం
చాగల్లు మండలం చంద్రవరం ఎంపీటీసీ స్థానం ఓట్ల లెక్కింపులో అధికారుల తీరు, ముఖ్యంగా ఆర్‌వో సీహెచ్ శ్రీనివాస్ తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి సత్యనారాయణ తొలుత రెండు ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఫలితం వెలువడిన వెంటనే ఏఎంసీ చైర్మనన్ నాదెళ్ల శ్రీరామ్ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లి ఆర్‌వోపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. పక్కన పెట్టిన 18 చెల్లని ఓట్లలో మూడు ఓట్లను తీసుకొచ్చి టీడీపీ అభ్యర్థికి కలిపి, ఆ అభ్యర్థి గెలిచినట్లు ప్రకటించారని వైఎస్సార్ సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అంతే కాకుండా తమ అభ్యర్థిపై దురుసుగా ప్రవర్తించి, కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని ఆర్‌వో బెదిరించారని పేర్కొంటున్నారు. ఈ పరిణామాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి సత్యనారాయణ.. తనకు జరిగిన అన్యాయంపై కోర్టును ఆశ్రయిస్తానని మీడియా ఎదుట ప్రకటించారు. రెండు ఓట్లతో గెలిచిన అభ్యర్థి ఫలితం... చెల్లని ఓట్ల వ్యవహారంతో మారిపోయిందన్న ఆరోపణలు కౌంటింగ్ పారదర్శకతపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
మిగిలిన చోట్లా రీకౌంటింగ్‌కు నో..
కోరుకొండ మండలం పశ్చిమగోనగూడెంలోనూ ఇదే తరహా వివాదం నెలకొంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి కేవలం ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇంత స్వల్ప తేడా ఉండటంతో ఓట్లను మరోసారి లెక్కించాలని ఆయన అధికారులను కోరారు. అయినప్పటికీ అధికారులు రీకౌంటింగ్‌కు అంగీకరించలేదని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కూటమి అభ్యర్థి విజయాన్ని ప్రకటించడంలో మాత్రం అధికారులు ఆత్రుత చూపారని విమర్శిస్తున్నారు. రెండు ఓట్ల తేడాతో గెలిచిన చోట కౌంటింగ్ తీరుపై ప్రశ్నలు తలెత్తగా, ఎనిమిది ఓట్ల తేడాతో ఓడిన చోట రీకౌంటింగ్ అభ్యర్థనను తిరస్కరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు.
● సీతానగరం మండలం కాటవరం గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఎదురైందని వైఎస్సార్ సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి 40 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రీ కౌంటింగ్ నిర్వహించాలని కోరినా అధికారులు అంగీకరించలేదని ఆరోపిస్తున్నారు. ఈ గ్రామానికి చెందిన కరుటూరి శ్రీహరిబాబు సీతానగరం జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి జనసేన అభ్యర్థి, ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మిని 2,600 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. అలాంటి శ్రీహరిబాబు సొంత గ్రామంలోనే వైఎస్సార్ సీపీ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైనా రీకౌంటింగ్‌కు అధికారులు అంగీకరించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
● మరోవైపు రాజానగరం మండలం పల్ల కడియంలోనూ ఇదే తరహా వివాదం చోటుచేసుకుంది. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి 51 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఓట్ల లెక్కింపుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రీకౌంటింగ్ నిర్వహించాలని ఎంతగా కోరినా అధికారులు అంగీకరించ లేదని వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి అభ్యర్థి గెలుపును ప్రకటించి చేతులు దులుపుకొన్నారని మండి పడుతున్నారు. ఇలా చంద్రవరం, పశ్చిమగోనగూడెం, కాటవరం, పల్ల కడియం.. ఈ నాలుగు చోట్లా రీకౌంటింగ్ విషయంలో భిన్నమైన వైఖరి ప్రదర్శించారనే ఆరోపణలు అధికారుల నిష్పక్షపాతంపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి.
కౌంటింగ్‌లో అవకతవకలపై ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
జక్కంపూడి రాజాతో మాట్లాడుతున్న రాజానగరం సీఐ వీరయ్య గౌడ్
ఒక్కొక్కరికి ఒక్కోలా నిబంధనలు
ఓట్ల లెక్కింపులో స్వల్ప తేడాలు వచ్చినప్పుడు అభ్యర్థులు రీకౌంటింగ్ కోరడం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమే. అయితే ఆ అభ్యర్థనలను నిబంధనల ప్రకారం, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి అధికారులు నిర్ణయించాలి. ఏ పార్టీ అభ్యర్థి కోరారన్నది కాకుండా, కౌంటింగ్‌లో జరిగిన పొరపాట్లు లేదా సందేహాలకు ఉన్న ఆధారాలే ప్రామాణికంగా ఉండాలి. కానీ జిల్లాలోని పలు కౌంటింగ్ కేంద్రాల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. కూటమి నేతలు అడిగితే రీకౌంటింగ్‌కు మార్గం సుగమం చేసి, తమ అభ్యర్థులు కోరితే మాత్రం నిరాకరించారని విమర్శిస్తోంది. ఆ ఆరోపణలపై ఎన్నికల అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.
కౌంటింగ్ అధికారుల
తీరు అనుమానాస్పదం
కూటమి నేతలు అడిగితే
వెంటనే రీకౌంటింగ్
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కోరితే
నిరాకరణ
చంద్రవరం, పశ్చిమగోనగూడెం,
కాటవరం, పల్ల కడియంలో వివాదాలు
కోరుకొండ జెడ్పీటీసీ కౌంటింగ్‌లోనూ అదే తీరు
రీకౌంటింగ్ కోరుతూ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధర్నా
కోరుకొండ జెడ్పీటీసీ స్థానం ఓట్ల లెక్కింపు కూడా తీవ్ర వివాదానికి దారితీసింది. తొలుత వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 800కు పైగా ఓట్ల మెజార్టీ ఉన్నట్లు లెక్కల్లో వెల్లడైందని, చివరి నిమిషంలో ఫలితం మారిపోయి టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నన్నయ వర్సిటీలోని కౌంటింగ్ కేంద్రం వద్ద రీకౌంటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. పూర్తి స్థాయిలో రీకౌంటింగ్ నిర్వహించి న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు. దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు భారీగా మోహరించారు. రాత్రి 9 గంటల సమయంలో జక్కంపూడి రాజాను పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన ఇంటి వద్ద విడిచి పెట్టేశారు.


