● కొవ్వాడ ముంపులో కుళ్లిపోతున్న వరి చేలు
● తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలు
● చేతికొచ్చిన పంట వరద పాలు
● జాడలేని ప్రజాప్రతినిధులు
దేవరపల్లి: పంట చేతికందే దశలో విరుచుకుపడిన అర్నబ్, మురసు తుపాన్లు అన్నదాతల ఆశలను నిలువునా ముంచేశాయి. భారీ వర్షాల కారణంగా పొలాలు ముంపు బారిన పడ్డాయి. సాధారణంగా తుపాన్ల సమయంలో డెల్టా ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. కానీ అర్నబ్, మురసు తుపానులతో మెట్ట ప్రాంతంలోని అనేక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కున్నాయి. ప్రధాన రహదారులపై ఐదు నుంచి పది అడుగుల ఎత్తున నీరు ప్రవహించింది. ఆ ప్రవాహానికి రోడ్లపై ఉన్న కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి.
ముంపులోనే చేలు
వర్షాలు తగ్గినప్పటికీ వరి చేలు నేటికి ముంపులోనే నానుతున్నాయి. పంటపై 2 నుంచి 4 అడుగుల ఎత్తున వరద నీరు ఉండడంతో చేలు చెరువుల్లా మారాయి. వరి, మినుము చేలు పూర్తిగా నీటిలో ఉండడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దేవరపల్లి మండలం గౌరీపట్నం, కొండగూడెం, యర్నగూడెం, త్యాజంపూడి, గోపాలపురం మండలం చిట్యాల, వెంకటాయపాలెం, చెరుకుమిల్లి, భీమోలు గ్రామాల్లో వేల ఎకరాల వరి చేలు మునిగిపోయాయి. గోపాలపురం మండలంలో కొవ్వాడ కాలువ ముంపునకు సుమారు 4 వేల ఎకరాలు నీట మునిగినట్టు రైతులు తెలిపారు. గోపాలపురం మండలానికి ఎగువనున్న కన్నాపురం, దిప్పకాయలపాడు, కొయ్యలగూడెం, ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీటికి మండలంలోని భీమోలు, గోపాలపురం, చిట్యాల చెరువులు తెగిపోయి నీరు కొవ్వాడ కాలువలో కలవడంతో నీటి ప్రవాహం పంట చేలను ముంచెత్తినట్టు రైతులు తెలిపారు.


