సాక్షి, రాజమహేంద్రవరం: పరిషత్ ఎన్నికల ప్రచారం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం తేలడానికి కొద్ది గంటలే మిగిలింది. కానీ కూటమి పార్టీల్లో మాత్రం అసలు పోరు ఎన్నికలకు ముందే మొదలైంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల కంటే సొంత కూటమి నేతల నుంచే వెన్నుపోటు పొంచి ఉందనే భయం పలువురిని వెంటాడుతోంది. జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ పీఠం ఎవరికి కేటాయిస్తారన్న దానిపై స్పష్టత లేక టీడీపీ, జనసేనలో పలువురు ఆశావహులు తమకే అవకాశం వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం మరికొందరికి మింగుడుపడటం లేదు. భవిష్యత్తులో తమకు పోటీగా మారతారనే అనుమానంతో కొందరి ఓటమికి తెరవెనుక పావులు కదుపుతున్నారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల మధ్య సమన్వయం కొరవడటంతో ఓట్ల బదిలీపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తమకంటే తమకంటూ..
కొత్తగా ఏర్పాటైన తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌కు తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా 21 జెడ్పీటీసీ, 405 ఎంపీటీసీ స్థానాలకు నవంబర్ 5న పోలింగ్ జరగనుంది. కీలకమైన ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. మొత్తం 412 ఎంపీటీసీ స్థానాల్లో ఏడు ఏకగ్రీవం కాగా, మిగిలిన 405 స్థానాలకు 901 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల తర్వాత జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిని నిర్ణయిస్తామని కూటమి అధినేతలు ప్రకటించడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. తొలుత టీడీపీ, జనసేన నాయకులు తమ పార్టీకే చైర్పర్సన్ పీఠం కేటాయిస్తారని ప్రచారం చేసుకున్నారు. అయితే కూటమిలోని అంతర్గత విభేదాలు, ఎన్నికలపై వాటి ప్రభావం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.
జనసేన, టీడీపీలో ఆశావహుల పోటీ
జనసేన నుంచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఆమె కూడా చైర్పర్సన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మంత్రి కందుల దుర్గేష్ కడియం నుంచి పోటీ చేస్తున్న మహేశ్వరీదేవికి చైర్పర్సన్ పదవి విషయంలో హామీ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో జనసేనలోనే ఇద్దరు ఆశావహులు తెరపైకి వచ్చినట్లయింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులకు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది.
ఫ టీడీపీ నుంచి రంగంపేట జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న ఆళ్ల శిరీష చైర్పర్సన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. తన సామాజికవర్గం మద్దతుతో పార్టీ నాయకత్వం ఆశీస్సులు లభిస్తాయని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దేవరపల్లి నుంచి పోటీ చేస్తున్న అండ్రు రాధిక పేరు కూడా ఈ రేసులో వినిపిస్తోంది.
సొంతవారే ఓడిస్తారేమోనన్న భయం
చైర్పర్సన్ పీఠంపై ఆశలు పెట్టుకున్న వారిలో కొందరి ప్రచారం ఇతరులకు ఇబ్బందిగా మారుతోందని తెలుస్తోంది. భవిష్యత్తులో తమకు రాజకీయ ప్రత్యర్థులుగా మారతారనే అనుమానంతో కొందరు ఆశావహుల విజయావకాశాలను దెబ్బతీసేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పైకి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యమని చెబుతున్నప్పటికీ, లోలోపల మాత్రం తమకు అనుకూలమైన వారికే ప్రాధాన్యం దక్కాలనే లెక్కలు వేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓట్ల బదిలీపై అనుమానాలు
కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని గ్రామాల్లో ఒక పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పోటీ చేస్తుండగా, మరో పార్టీకి చెందిన నాయకుడు జెడ్పీటీసీ బరిలో ఉన్నారు. టీడీపీ 266, జనసేన 120, బీజేపీ 21 ఎంపీటీసీల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఈ స్థానాలకు సంబంధించి జెడ్పీటీసీ అభ్యర్థులకు ఓట్ల బదిలీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి చోట్ల మూడు పార్టీల క్యాడర్ పరస్పరం సహకరించుకోవడంపై పోటీదారులకు నమ్మకం కుదరడం లేదు. అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తితో ఉన్న కొందరు నాయకులు తమ అభ్యర్థి వరకే ఓట్లు అడుగుతూ, కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి కోసం ప్రచారం చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని చోట్ల జెడ్పీటీసీ అభ్యర్థి ఎంపిక తమకు నచ్చకపోవడంతో ఎంపీటీసీ అభ్యర్థులు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దీంతో ఒకే కూటమిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులకు ఓటరు ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న జరిగే పోలింగ్‌లో కూటమి అభ్యర్థులకు ఎదురుతప్పదని పలువురు అంటున్నారు.
ఫ ఆ పార్టీల్లోనే వెన్నుపోట్ల భయం
ఫ జెడ్పీ చైర్పర్సన్ పీఠంపై
ఎవరికి వారే ప్రచారం
ఫ అభ్యర్థుల మధ్య
కొరవడిన సమన్వయం


